సీనియ‌ర్ లీడ‌ర్‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్ (డీఎస్) పెద్ద కుమారుడు, మాజీ మేయ‌ర్ సంజ‌య్ మ‌ళ్లీ రాజ‌కీయంగా కొత్త ఊపిరి పోసుకునేందుకు త‌ప‌న ప‌డుతున్నాడు. ఇందూరు కేంద్రంగా రాజ‌కీయంగా ఎదిగిన సంజ‌య్‌.. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ముహూర్తం సిద్దం చేసుకుంటున్నాడు. మేయ‌ర్ త‌ర్వాత ఆయ‌న డీఎస్‌తో క‌లిసి టీఆరెస్‌లో చేరిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత తండ్రితో పాటు ఆయ‌న కూడా పార్టీకి దూర‌మ‌వుతూ వ‌చ్చాడు. గులాబీ శ్రేణులు కూడా వీరిని దూరం పెడుతూ వ‌చ్చారు.

డీఎస్ త్వ‌ర‌లో రాజ‌కీయంగా ఓ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి సిద్ధంగా ఉండ‌గా.. ఆయన పెద్ద కొడుకు సంజ‌య్ కూడా ఇదే బాట‌లో పయ‌నిస్తున్నాడు. పీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామ‌కం త‌ర్వాత నేరుగా వెళ్లి క‌లిసి సంజ‌య్ త‌న సంఘీభావాన్ని తెలిపాడు. రేవంత్ సార‌థ్యంలో కాంగ్రెస్ బ‌లోపేతం అవుతుంద‌ని, పూర్వ వైభ‌వం సంత‌రించుకుంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు. కాంగ్రెస్ పార్టీలో చేరుతాడ‌ని భావించారు. కానీ డిసెంబ‌ర్ 9న హైద‌రాబాద్‌కు రాహుల్ రాక నేప‌థ్యంలో.. ఆయ‌న స‌మ‌క్షంలో సంజ‌య్ చేరేందుకు నిర్ణ‌యించుకున్నాడు. ఆలోపు ఇక్క‌డ కార్య‌క్షేత్రంలో భ‌విష్య‌త్ రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాడు సంజ‌య్‌.

ఈ రోజు జిల్లా కేంద్రంలో ఆత్మీయ స‌మ్మేళ‌నం ఏర్పాటు చేశాడు. న‌గ‌రంలోని ముస్లిం పెద్ద‌ల‌ను, మున్నూరుకాపు కుల సంఘ నాయ‌కుల‌ను, అభిమానుల‌ను, మిత్రులు, మీడియాను ఈ స‌మ్మేళ‌నానికి ఆహ్వానించాడు. మ‌ళ్లీ తాను రాజ‌కీయాల్లో యాక్టివ్ పార్ట్ తీసుకోబోతున్నాన‌నే సంకేతాన్నిచ్చాడు. మొన్న‌టి వ‌ర‌కు అజ్ఞాతంలో ఉన్న సంజ‌య్‌.. తెర వెనుక త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు సంబంధించిన గ‌ట్టి వ్యూహ ర‌చ‌నతో ముందుకు సాగేందుకుక నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఆత్మీయ స‌మ్మేళ‌న‌మే దీనికి ఓ నాందిగా ఉద‌హ‌రించ‌వ‌చ్చు. న‌గ‌రంలో మొన్న‌టి వ‌ర‌కు స్త‌బ్దుగా కాంగ్రెస్‌లో చ‌ల‌నం వ‌స్తున్న‌ది. పార్టీలో కొత్త ఉత్సాహం క‌నిపిస్తున్న‌ది. ఇప్ప‌టికే బీజేపీ న‌గ‌రంలో పాగా వేసింది. అది వ‌స్త‌రిస్తూ పోతున్న‌ది. ఇప్పుడు కాంగ్రెస్ వంతు వ‌చ్చింది. టీఆరెస్‌కు ఇది కంచుకోటగా ఉండే. ఇప్పుడు ఈ రెండు పార్టీలు త‌మ ఉనికిని చాటుకునేందుకు తండ్లాడుతున్నాయి.

You missed