సికింద్రాబాద్ ఏరియా…
జ‌నం ర‌ద్దీగా ఉన్నారు. ట్రాఫిక్ కిక్కిరిసిపోయి ఉంది. అప్ప‌టి వ‌ర‌కు ర‌య్యిన దూసుకుపోయిన ఆటో కద‌ల్లేక క‌దులుతున్నట్టు మెల్ల‌గా ముందుకు పోసాగింది.

హార‌న్ మోత‌లు.. ముందుకు పోయే దారి లేదు. అదీ వాళ్ల‌కీ తెలుసు. కానీ
చిరాకుతో కూడిన హార‌న్‌ల‌వి. ప‌క్క‌నున్నోడిని మ‌రింత చికాకు క‌లిగించేలా.

ఉన్న‌ట్టుండి మెల్ల‌గా దారి ఫ్రీ అయ్యింది. ముందుకు ర‌య్యిన ఉరుకుతున్నాయి బండ్లు.

నేను కూర్చున్న ఆటో వాలా ముందుకు దూకించాడు. ప‌క్క‌కు ట‌ర్న్ కొట్టి ముందుకురికించి గేర్ ట‌ప‌ట‌పా మారుస్తున్నాడు.

ట‌ర్న్ కొట్టే స‌మ‌యంలో ఎడ‌మ‌ప‌క్క‌నున్న ఓ స్కూటీ అద్దానికి ఆటో తాకింది. ‘ట‌ప్’ మ‌ని శ‌బ్ద‌మొచ్చింది. అయినా ఆటోవాలా అదేదీ ప‌ట్టించుకోలేదు. కొంచెం సందు దొరికితే ఉరికించి అవ‌త‌ల ప‌డ‌దామ‌నే అత‌ని క‌ళ్లు చురుకుగా ప‌ని చేస్తున్నాయి.

వెనుక నుంచి స్కూటీవాలా గొంతు అరుస్తున్న‌ది. ‘రేయ్ సాలె… అందే హై క్యారే. క‌నిపిస్త‌లేదారా?’

ఆ ర‌ణ‌గొణ ధ్వ‌నులలో స్కూటీవాలా గొంతు క‌లిసిపోయింది. వాడి అరుపు ట్రాఫిక్‌రోద‌నే అయ్యింది. ఎవ‌డు ప‌ట్టించుకుంటాడు. ఎవ‌డి హ‌డావుడి వాడిది.

నేను కూర్చున్న ఆటోవాడు ర‌య్యి ర‌య్యిన ముందుకురికిస్తున్నాడు.

మొత్తానికి ట్రాఫిక్‌ను ఈది ఓ తీరానికి చేరుకుంటున్న స‌మ‌యంలో ఆ స్కూటీ బాధితుడు ర‌య్యిన వ‌చ్చి ఆటో ముందు ఆపాడు.

“క్యారే … తాకిచ్చుకుంట పోతున్న‌వ్‌. కండ్లు క‌న‌బ‌డ్త‌లేవా..?”

ఆటోవాలా ఆటోను ఆపాడు.
విన‌మ్రంగా “క్యా సాబ్ ” అన్నాడు. వినిపించ‌న‌ట్టు.

వాడికి చిర్రెత్తుకొచ్చింది.
“గుద్దుకుంట‌నే పోతున్న‌వ్‌… క‌నిప‌స్త‌లే.”

“అచ్చ‌.. సాబ్ ల‌గా తెర గాడీకో”

“అవును బే అదే అంటున్న‌…”

“సారి సాబ్‌.. సారి. మై నై దేఖా.”

మంచి గ‌రం మీదున్న స్క‌టీవాలా స‌ల్ల‌బ‌డ్డ‌డు వెంట‌నే.
ఆటోవాలా ఏద‌న్న అంటే స్కూటీ స్టాండేసి కింద‌కు దిగి తేల్చుకుందామ‌నే రేంజ్‌లో ఉన్నాయి అత‌ని ముఖ క‌వ‌ళిక‌లు.

హెల్మెట్ పెట్టుకొని ఉన్న తెలిసిపోతున్న‌ది అత‌ని ముఖం.

“సారీ” అన‌గానే స‌ర్రున బండిని ముందుకురికించాడు. బ‌తికిపోయిన‌వ్ బిడ్డా అన్న రీతిలో ఓ లుక్ ఇచ్చి.

నా ఆటోవాలా కూల్‌గా త‌న ఆటోను ముందుకు ఉరికించాడు.

మ‌ళ్లీ ట‌ర్నింగులు కొట్టుకుంటూ.

“స్కూటీకి తాకిచ్చిన‌వ్‌… నేను చూసిన. నీదే త‌ప్పు” అన్నాను నేను.

“ఊకోండి సార్‌. ప‌క్క‌న బ‌స్సు ఉంది. ఆడు లోప‌ల‌కు ఉరికొస్తుండు. మ‌రి నేనెటుపోవాలె.” అన్నాడు.

స్కూటీకి ఆటో తాకిన విష‌యం ఆటోవాలాకు తెలుసు అన్న విష‌యం అప్పుడు అర్థమయింది నాకు.

నేను నోరెళ్ల‌బెట్టి ఆటోవాలాను గ‌మ‌నిస్తున్నా. జుట్టు నెరిసిపోయి ఉంది. మాస్క్ పెట్టుకున్నాడు. ముఖంలో భావాలు తెల‌వ‌డం లేదు.

“ఇప్పుడు ఆనితో ఇవ‌న్నీ చెప్పి వాద‌న పెట్టుకోలేను.”

“సారీ అని చెబితే అయిపోతుంది క‌దా. మ‌న‌కు అవ‌సర‌మా లొల్లి” అన్నాడు మళ్లీ.

నేను అత‌న్నే చూస్తున్నాను.

“ఆడు న‌డిపే న‌డుపుడుకు మీదెక్కిచ్చినా త‌ప్పు లేదు. అంత‌లోప‌ల‌కు దూసుకొస్తున్నాడు.”

“అయినా రోజుకు ఇసొంటోళ్ల‌ను వంద‌ల మందిని సూస్త సాబ్ ….”

“ఇసొంటోళ్ల‌తోని ఒర్రుకుంట కూసుంటే దందా అయిత‌దా. ఓ సారీ చెప్పితే ఖ‌తం”

“మ‌న ప‌ని మాత్రం ఆగొద్దు….”

ఆటో ఓ సందులోకి మ‌ళ్లింది. గేరు మార్చి ర‌య్యిన వేగం పెంచాడు. టైం చూస్కుంటు.

 

Dandugula Srinivas

You missed