దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

కోటిన్నర పెట్టి చక్కగా క్యాంపు కార్యాలయాలను నిర్మించుకున్నారు. రెండతస్తల భవనంలో సకల సౌకర్యాలూ ఉన్నాయి. మీటింగులు పెట్టుకోవచ్చు.. రెస్టు తీసుకోవచ్చు.. సన్నిహితులతో పార్టీ కార్యకలాపాలపై మంతనాలు చేసుకోవచ్చు.. ఎవరైనా కార్యకర్తలు వస్తే సేద తీరొచ్చు. ఇవన్నీ కేసీఆర్‌ ప్రభుత్వంలో ప్రతీ నియోజకవర్గానికి ఒక క్యాంపు కార్యాలయం ఉండాలని నిర్మించినవే. ఎవరూ ఎమ్మెల్యే ఇంటి చుట్టు తిరగకుండా నేరుగా ఇక్కడికే వచ్చి తమ పనులు చేసుకుని పోవచ్చు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ చెక్కులు ఇక్కడే ఇచ్చేవారు. పార్టీ మీటింగులకు హాజరై భోజనాలు చేసుకుని పోవచ్చు.

ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చింది. మాజీ ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయాలు ఖాళీ చేశారు. కొత్త ఎమ్మెల్యేలు తిష్ట వేశారు. అంతా ఇంచుమించు ఇలాగే జరిగింది. కానీ నిజామాబాద్‌ రూరల్ నియోజకవర్గంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతున్నది. ఇక్కడ గెలిచించి కాంగ్రెస్‌ అభ్యర్థి రేకులపల్లి భూపతిరెడ్డి, ఓడింది బాజిరెడ్డి గోవర్దన్. బాజిరెడ్డికి, భూపతిరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శతృత్వం ఉంది. ఇద్దరు ఒకప్పుడు బీఆరెస్ పార్టీయే. తనకు రావాల్సిన ఎమ్మెల్యే సీటు బాజిరెడ్డి తన్నుకుపోయాడనే కక్ష, కోపం భూపతిరెడ్డిలో ఇప్పటికీ రగులుతూనే ఉంటుంది. అందులోనూ బీసీ,రెడ్డి ఫీలింగు.

ఇప్పుడు గెలిచినంక ఎమ్మెల్యే హెదాలో క్యాంపు కార్యాలయాన్ని వాడుకోవాలి. కానీ ఇంత వరకు అక్కడ అడుగుపెట్టలే. మొదట వాస్తుదోషమని చెప్పి తప్పించుకు తిరిగాడు. మరెక్కడ మీటింగులు పెట్టాలి..? అని కార్యకర్తలు, నాయకులు కాలు కాలిన పిల్లిలా తిరుగుతుంటే కంఠేశ్వర్‌ బైపాస్‌ రోడ్డులో ఏ జాగాలో రేకుల షెడ్డు వేశాడు. దాన్నే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుగా పేరు పెట్టాడు. అక్కడే మీటింగులు. రూరల్ సమావేశాలు ఏమున్నా అంతా అక్కడికే రావాలి. ఎర్రటి ఎండాకాలం రేకుల షెడ్డులోనే నానా తిప్పలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. కారణం ఎమ్మెల్యే చాదస్తం.

ఓడిన నేతపై కోపం ఉంటే సర్కార్‌ సొమ్ముతో కట్టిన క్యాంపు కార్యాలయం ఏం పాపం చేసింది. బీసీ కూర్చున్న సీటు.. అందునా బాజిరెడ్డి దగ్గరుండి కట్టించుకున్నాడు. మనకవసరమా..? ఛీ..ఛీ అన్నాడు. ఇది మరి అహంకారానికి, చాదస్తానికి పరాకాష్ట అంటే. అట్లుంటది భూపతితోని. సొంత పార్టీ నేతలే మన ఎమ్మెల్యే తీరు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed