దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
ఎంతకాదన్నా వారిద్దరు మిత్రులు. జిగ్రీదోస్తులు. ఒకప్పుడు. ఒకరికొకరు అన్నట్టుగా ఉన్నారు. కానీ రహస్యంగా. కలివిడిగా కలిసిపోలేని పరిస్థితులు. ఎవరికి వారే చెప్పుకునే సైద్దాంతిక సుద్దులు. ఇద్దరినీ నేరుగా కలపలేదు. అలా కనికట్టుచేశారు. మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా.. అవి తుగ్లక్ చర్యలని తెలిసీ కేసీఆర్ ఓకే చెప్పేశాడు. జీఎస్టీ నుంచి మొదలు పెట్టి పెద్ద నోట్ల రద్దు దాకా. తన పని తాను కానిచ్చేసుకున్నాడు. పక్కోడు తగలబడితే నాకేందీ..?నేను బాగుంటే చాలు అనే రీతిలో తన క్షేమం, అధికార దాహమే పరమావధిగా ప్రవర్తించాడు కేసీఆర్. అందుకే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి మరీ మోడీ తుగ్లక్ నిర్ణయాలకు ఓకే చెప్పేశాడు.
చివరకు మోడీ ఆశీస్సులతో కేటీఆర్‌ను సీఎంను కూడా చేయాలనుకున్నాడు. మోడీని కేసీఆర్ ఎంతలా నమ్మాడంటే.. తన మనసులోని మాటను ఢిల్లీకి పోయి మోడీకి చెప్పి మరీ ఆశీర్వాదాలు కోరాడు. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. తామెలాగూ తెలంగాణలో అధికారంలోకి రాము.. శత్రువుకు శత్రువు మిత్రుడే కదా అని అలా కానిచ్చేశాడు మోడీ కూడా. కానీ కేసీఆర్‌లోని మేథావితనం వెయ్యిరెట్లు వెలిగిపోయి.. తెలంగాణను ఉద్దరించేశాను ఇక దేశాన్ని జిగేల్‌మనిపిస్తాను.. అలా అయితే ఇక్కడ స్పేస్ దొరికి కొడుకు సీఎం అవుతాడని ఏవేవో కాకిలెక్కలేసుకున్నాడు. కోతేశాలేషాడు. టీఆరెస్‌ను బీఆరెస్ అని ప్రకటించేసుకున్నాడు.
మరి జాతీయ పార్టీ కదా.. ఎవరికి తిట్టాలే. మోడే టార్గెట్. దళితబంధు అన్నాడు. రైతుబంధు ఇస్తాను మీకు అని మోచేతికి బెల్లం మాటలు మాట్లాడాడు. ఇక్కడ టంచన్‌గా పింఛన్ ఇవ్వకున్నా.. మీ దగ్గర ఎంతిస్తున్నారు.. మేము చూడు ఎంతిస్తున్నామో అంటూ గొప్పలకు పోయాడు. సహజంగానే లోపలున్న కోతలరాయుడు పెరిగి పేట్రేగిపోయాడు. ఇదంతా గమనించిన మోడీలోని లోపలి మనిషికి అప్పుడు బయటకు వచ్చాడు. ఇక చెక్‌పెట్టే టైం వచ్చిందని స్కెచ్ వేశాడు. ఎక్కడ దొరుకుతారా అని మోడీ ఎదురుచూశాడు. లక్కీగా కేటీఆర్ ఆ వల నుంచి తప్పించుకుని అత్యాశకు పోయిన కవిత మరీ చీప్‌గా చీప్‌లిక్కర్ పాలిట్రిక్స్‌లో ఇరుక్కుపోయింది.
దొరికింది మోఖ మోడీకి. దీన్ని ఆసరా చేసుకుని ఆడుకున్నంత ఆడుకున్నాడు. తన జిగ్రీ దోస్త్ కేసీఆర్‌కు చుక్కలు చూపించాడు. నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. అసెంబ్లీలో కూడా ఘోరంగా దెబ్బతిన్న తరువాత ఇక కేసీఆర్‌కు, బీఆరెస్‌కు శుభం కార్డు వేసేందుకు రెడీ అయ్యాడు మోడీ. ఇదిగో ఇలా కవితను ఈడీ అరెస్టు చేసేదాకా సీన్లను రక్తికట్టించాడు. ఇప్పుడు కటకటాలు తప్పవు మీకు అంటూ బహిరంగ వేదికల్లోనే బాహాటంగా చెప్పేస్తున్నాడు. అంతే మరి ఎవరి లాభం వారిది. ఎవరి స్వార్ధం వారిది. ఏ పార్టీ ప్రయోజనాలు వారికి.
అప్పుడు మోడీతో కేసీఆర్‌కు పని ఉండే. కేసీఆర్‌తో మోడీకి లోపాయికారిగా అవసరం ఉండే. అలా లోలోపల కలిసి పనిచేశారు. ఇప్పుడు కేసీఆర్‌తో పనిలేదు. కేసీఆర్ పనీ అయిపోయింది. ఇంకేముందు ఇలా వాడుకుని తగేలేయడమే బీజేపీ పని. కేసీఆరూ ఇలాగే చేస్తాడు. మోడీ ఇప్పుడు అదే చేస్తున్నాడు. మిత్రలాభం కాస్త మిత్రబేధంతో ముగిసింది. సహవాసదోషం కన్నబిడ్డను కటకటాల పాలు చేసింది. చేసిన పాపాలు ఇలా వెంటాడుతున్నాయి.