దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
ఎమ్మెల్సీ కవితకు ఇక కటకటాలే దిక్కు. అవును. మోడీ మాటలు ఆంతర్యం ఇదే సంకేతాన్ని పంపుతున్నది. జగిత్యాలలో జరిగిన సభలో మోడీ కవిత లిక్కర్ స్కాం ఉదంతాన్ని ప్రస్తావించాడు. లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు… కవిత అరెస్టు అంతా బీజేపీ, మోడీ డైరెక్షన్‌లో నడుస్తున్న విషయం అందిరికీ తెలిసిందే. ఈ విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు మోడీ సైతం సిద్దమయ్యాడు. అసలే పార్లమెంటు ఎన్నికలు. ఇక ఇప్పుడ కాకపోతే మరెప్పుడు..? ఉన్న అవకాశాన్ని , రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు మోడీ దేనికీ వెనుకాడడు.
అందుకే కవిత లిక్కర్ స్కాంలో అవినీతిని బయటకు తీసి అరెస్టు చేశామని పరోక్షంగా తానే చెప్పుకోవడం రాజకీయంగా సంచలనం రేపింది. మొన్న అర్వింద్ కూడా కవిత అరెస్టును తనకు మేలు జరిగేలా, రెచ్చగొట్టేలా కామెంట్ చేశాడు. తనను ఓడిస్తానన్న కవిత ఇప్పుడు జైలు నుంచి నామినేషన్ వేస్తుందా..? అని వెటకారంగా ప్రశ్నించడం కూడా బీఆరెస్‌ను సెల్స్ డిఫెన్స్‌లో పడేయడమే. ఇప్పుడు కవిత ఈడీ కస్టడీలో ఉంది. వారం రోజుల తరువాత ఆమెను కోర్టు ముందుంచాలి. కానీ తాజాగా మోడీ మాటలు వింటే ఈడీ కబంధ హస్తాల నుంచి కవిత ఇప్పుడప్పుడే బయట పడేలా లేదు. తమ పంతం నెగ్గించుకుని కన్నికల్లో ఎంత మేలు జరిగితే అంత తమ ఖాతాలో వేసుకోవడం, ఓట్లను కొల్లగొట్టే పనిలో బీజేపీ ఉంది. కవిత ఇందులో ఇప్పుడు పావుగా మారింది.