సందర్భమేంటో తెలియదు..ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. అవి అన్యపదేశంగా వస్తాయో… అప్పటికప్పుడు వస్తాయో.. ముందే అనుకుని మాట్లాడతారో… అవగాహన లేకనో… మిడిమిడి జ్ఞానమో…. ఏదైతే ఏమిగానీ.. మాట్లాడింది మాత్రం వాస్తవం. ప్రజల ముందు ఉన్నదున్నట్టు చెప్పుకోవడం కూడా ఓ కళ. ప్రజలకూ తెలిసొస్తుంది తాము ఎన్నుకున్న ఎమ్మెల్యే ఏ రేంజ్‌లో ఎదిగాడో.. ప్రజలను ఎంతగా ఉద్దరిస్తున్నాడో… ఎన్ని మేడలు కట్టాడో.. ఎంత సంపాదించాడోనని.
మంత్రి మల్లారెడ్డి మాటలే అలాంటివి. నిన్న అసెంబ్లీలో చెప్పుల ప్రస్తావన తీసుకొచ్చాడు. ప్రతిపక్షాలను ఏదో అందామనుకుని వారిని చెప్పులతో పోల్చాడు. వాళ్లెప్పుడూ కాళ్ల కిందే ఉంటారనే అహంకారాన్ని ప్రదర్శించాడు. అలా అనడమూ తప్పే. చెప్పులు కుట్టుకుని బతికే మాల మాదిగలను అవమానించినట్టే. అది ఆ దొరకు తెల్వదు. పెద్దగా చదవుకోలేదు. అప్పనంగా సంపాదించాడు. అడ్డదారిలో మంత్రయ్యాడు. ఇలా మైకు దొరికితే చాలు అది ఏ ప్లేస్ అనేది కూడా చూసుకోడు.. సొల్లు కార్చుకుని తన అజ్ఞానాన్ని ఇలా బయటపెట్టుకుంటాడు. నిన్న అసెంబ్లీలోనూ అదే చేశాడు.
ఇది చాలదంటూ పనిలో పని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రస్తావన తెచ్చాడు. పాపం జీవన్‌రెడ్డి కర్మకాలి .. ఆయన తొడుక్కునే కాలి చెప్పుల ప్రస్తావన మల్లారెడ్డి నోటి వెంట వచ్చింది. ఇప్పటి వరకు ప్రజలెవరికీ తెలియని ఓ కఠోర వాస్తవాన్న చెప్పి నోరెళ్లబెట్టేలా చేశాడు మంత్రి మల్లారెడ్డి. మా జీవన్‌రెడ్డి యాబైవేలు, లక్ష రూపాయల చెప్పులు తొడుగుతాడని. అవునా..? చెప్పులకే లక్షా..? ఎంత సంపాదించిం ఉంటాడో పాపం అని ప్రజలు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. అదేందో గానీ జీవన్ రెడ్డి ఇలా ఎప్పుడు చర్చల్లో కేంద్ర బిందువవుతూ ఉంటాడు. ఆయనకూ అది ఇష్టమే అనుకోండి… జీవన్ రెడ్డా.. మజాకా ..? మరి.