నిజామాబాద్ జిల్లాలో వార‌స‌త్వ రాజ‌కీయాలు పెద్ద‌గా రాణించ‌లేదు. రాజ‌కీయంగా ఓ స్థాయికి చేరుకొని, పెద్ద ప‌ద‌వులు అనుభ‌వించిన వారంతా త‌మ రాజ‌కీయ వార‌సులుగా కొడుకుల‌ను రంగంలోకి దింపాల‌ని ఆశించ‌డం స‌హ‌జం. వారిని ఓ ప‌ద‌విలో చూసి మురిసిపోతారు. దాని కోసం అష్ట‌క‌ష్టాలు ప‌డ‌తారు. ఎంత‌టి ఖ‌ర్చైన భ‌రిస్తారు. అప్ప‌టి వ‌ర‌కు త‌ను సంపాదించిన ప‌ర‌ప‌తినంతా దార పోసేందుకు సిద్ద‌ప‌డ‌తాడు. అలా వార‌సుడి రాజ‌కీయ ఎదుగుద‌లను చూసేందుకు ఉవ్విళ్లూరుతాడు. ఇందూరు రాజ‌కీయాల్లో సైతం వార‌స‌త్వం వ‌చ్చింది. కానీ నిల‌బ‌డ‌లేదు. ఏదో కొద్ది మంది మాత్ర‌మే తమ ఉనికిని కాపాడుకోగ‌లిగారు. చాలా మంది రాజ‌కీయంగా తెర‌మ‌రుగైపోయారు. కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇద్ద‌రు నేత‌లు వాళ్ల కొడుకుల‌ను రాజ‌కీయ వార‌సులుగా ప్ర‌వేశ‌పెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నార‌నే ప్ర‌చారం జోరందుకున్న నేప‌థ్యంలో ఈ వార‌స‌త్వ రాజ‌కీయాల అంశం మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది.

కాంగ్రెస్ సీనియ‌ర్ మైనార్టీ నాయ‌కుడు, మాజీ మంత్రి ష‌బ్బీర్ అలీ, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవ‌ర్ధ‌న్ కూడా త‌న కుమారుడిని కూడా రాజ‌కీయాల్లోకి తీసుకురావాల‌ని ఆశిస్తున్నాడ‌ట‌. ఇదిలా ఉంటే ప్ర‌స్తుత రాజ‌కీయాల‌కు వీరిద్ద‌రూ ప‌నికిరార‌నే భావ‌న వారిలో ఉంది. కాలం క‌లిసివ‌స్తే వార‌సులుగా ప్ర‌వేశ‌పెడ్తారేమో.
ఇక ఒక‌సారి ఇందూరు గ‌త రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే.. మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి, ఎంపీ అర్వింద్ మిన‌హా రాజ‌కీయ వార‌సులుగా ఎద‌గ‌లేదు. సీనియ‌ర్ నేత వేముల సురేంద‌ర్‌రెడ్డి ఎమ్మెల్యేగా కావాల‌ని చాలా ప్ర‌య‌త్నించినా … అవ‌కాశాలు చేజిక్కినా సాధ్యం కాలేదు. చివ‌ర‌కు ఆయ‌న కోరిక తీర‌కుండానే కాలం చేశాడు.అప్ప‌టికే వ్యాపార రంగంలో సెటిల్ అయిన‌… ప్ర‌శాంత్‌రెడ్డి తండ్రి ఆశ‌య‌సాధ‌న కోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చి అన‌తికాలంలోనే స‌క్సెస్ అయ్యాడు. కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడిగా , న‌మ్మిన బంటుగా మారాడు. మంత్రిగా కొన‌సాగుతున్నాడు. రాజ‌కీయాల్లో అపారఅనుభవం గ‌డించిన ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్‌.. డీఎస్ త‌న రాజ‌కీయ వార‌సుడిగా పెద్ద కుమారుడ్ సంజ‌య్‌ను రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చాడు. నిజామాబాద్ కార్పొరేష‌న్ తొలి మేయ‌ర్‌గా చేశాడు. కానీ సంజ‌య్ ఎక్కువ కాలం రాజ‌కీయాల్లో నిల‌బ‌డ‌లేడ‌లేక‌పోయాడు. చిన్న కొడుకు అర్వింద్ వ‌చ్చీ రావ‌డంతోనే బీజేపీలో చేరి ఎంపీగా క‌విత‌పై గెలిచి సంచ‌ల‌నం సృష్టించాడు. ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్రవేసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. వీరిద్ద‌రు త‌ప్ప ఇందూరు రాజ‌కీయాల్లో వారసుడిగా వ‌చ్చి ఎదిగిన నాయ‌కుడు లేడు. మాజీ మంత్రి, స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి చిన్న కుమారుడు పోచారం భాస్క‌ర్‌రెడ్డి… తండ్రి హోదాను ఆస‌రా చేసుకొని డీసీసీబీ చైర్మ‌న్‌గా కాగ‌లిగాడు. మాజీ మంత్రి సంతోష్‌రెడ్డి కుమారుడు శ్రీ‌నివాస్‌రెడ్డి వార‌సుడిగా వ‌చ్చి ఓ సారి ఎన్నిక‌ల్లో త‌నేంటో ప‌రీక్షించుకుని మ‌ళ్లీ వెనుదిరిగి చూడ‌లేదు. మాజీమంత్రి ఏలేటి మ‌హిపాల్‌రెడ్డి, అన్నపూర్ణ‌మ్మ‌ల వార‌సుడిగా మ‌ల్లిఖార్జున్ వ‌చ్చినా రాజ‌కీయంగా రాణించ‌లేదు. ప్ర‌స్తుతం బాల్కొండ బీజేపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జిగా ఉన్నాడు. ఓట‌మెర‌గ‌ని దివంగ‌త నేత కేశ్‌ప‌ల్లి గంగారెడ్డి త‌న రాజ‌కీయ అనుభ‌వాన్నంతా ఉప‌యోగించి త‌న వార‌సుడిగా ప్ర‌వేశ‌పెట్టిన గ‌డ్డం ఆనంద్‌రెడ్డి ఫెయిల్ అయ్యాడు. రాజ‌కీయాలు అత‌నికి వంట‌బ‌ట్ట‌లేదు. కాలం క‌లిసిరాలేదు. చివ‌ర‌కు అకాల మ‌ర‌ణం పొందాడు. జుక్క‌ల్ మాజీ శాస‌న స‌భ్యుడు సౌదాగ‌ర్ గంగారం త‌న వార‌సుడిగా అల్లుడిని రాజ‌కీయాల్లోకి తీసుకువ‌ద్దామ‌నుకున్నాడు. కానీ అది జ‌ర‌గ‌లేదు. నిజామాబాద్ ఎంపీగా చేసిన తాడూరి బాలాగౌడ్ అల్లుడు కూడా కొంత‌కాలం రాజ‌కీయాల్లో ఉన్నా.. మళ్లీ క‌నిపించ‌లేదు. రూర‌ల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ త‌న కొడుకు బాజిరెడ్డి జ‌గ‌న్‌ను ఎమ్మెల్యే చేయాల‌నుకున్నాడు. మొన్న ఎన్నికల్లో టికెట్ ఆశించాడు. కానీ కేసీఆర్ ఇవ్వ‌లేదు. జ‌డ్పీటీసీని చేసి జ‌డ్పీ చైర్మ‌న్ చేద్దామ‌నుకున్నాడు. కానీ కుద‌ర‌లేదు. ఇపుడు ఎమ్మెల్యే కోసం కొడుకును రెడీ చేస్తున్నాడు.

You missed