బోధన్ రాజకీయాలు మారుతున్నాయి. మొన్నటి వరకు ఇక్కడి నుంచి మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుదర్శన్‌రెడ్డి మరోమారు పోటీ చేస్తారని భావించారు. కానీ ఆయన ఈసారి పోటీకి విముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది. కొంత మంది టీఆరెస్ నేతలు కూడా సుదర్శన్‌రెడ్డి పోటీ చేయకపోవడమే మంచిదనే భావనలో ఉన్నారు. ఇక్కడ టీఆరెస్ ఎమ్మెల్యే షకీల్‌పై వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతున్నది. క్యాడర్‌ను పట్టించుకోవడం లేదనే విషయం అధిష్టానానికీ తెలుసు.
కానీ ఎమ్మెల్సీ కవితపై ఇక్కడ నిర్లక్ష్యానికి గురైన నాయకత్వం గంపెడాశలు పెట్టుకున్నది. ఆమె కూడా పెద్దగా ఇక్కడి విషయంలో జోక్యం చేసుకోకపోవడంతో ఎక్కడ చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంలో ఉన్నారు. చివరాఖరుగా ఓసారి కవితతో భేటీ అయ్యి తమ భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సుదర్శన్‌రెడ్డి తమకు కావాల్సిన అభ్యర్థిని టీఆరెస్‌లో నుంచి ఎంచుకునేందుకు సిద్దమయినట్టు తెలుస్తోంది. ఓ కీలక నేతకు పలుమార్లు ఆయన ఫోన్ చేసి కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా కోరినట్టు సమాచారం. ఎటూ తేల్చుకోలేని పరిస్థితులో ఆ నేత కవితతో భేటీ తర్వాత తన నిర్ణయం చెబుతానని చెప్పినట్టు తెలిసింది.