(దండుగుల శ్రీనివాస్)
జైలుకు పంపేందుకు వీరు సిద్దంగా ఉన్నారు. జైలుకు పోక తప్పదని యువరాజు కూడా సంసిద్దమై పోయాడు. మెంటల్‌గా ఫిక్స్ అయిన యువనేత మెంటల్ పీస్ కోసం ఇప్పట్నుంచే యోగా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. ఓ రెండు మూడు నెలలైతే ఉండాల్సి వస్తదని డిసైడ్ అయిపోయాడు. ఆరోపణలపై స్పందించాడు. అవును నిజమే ఆ డబ్బు పంపిన మాట వాస్తవమే. కానీ లాభాలొచ్చాయంటున్నాడు. సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. విచారణకు సిద్దమంటున్నాడు. జైలుకు కూడా పోతా నాకేమన్నా భయమా అని అంటూనే…. అసలు మేఘా కిట్టిగాని మీద ఏసీబీ సోదాలు చేయాలన్నాడు. వాడి కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలన్నాడు. మధ్యలో ఈ గోలేందిరో…? నిన్ను జైలుకు పంపుతామంటుంటూ .. అట్లెట్ల పంపుతరు..? ఏం తప్పు చేశానని గాయ్ గాయ్ చేయక…. నడిమిట్ల గీ కిట్టిగాని లొల్లెందుకు. మొన్నటిదాకా మీతోనే గదా అంటగాగింది. పంచుకుతిన్నది. ఇప్పుడు అధికారం మారింది. మేఘా ఈగ కాంగ్రెస్ పంచన చేరిందని బాధా..? కామనే కదా. నీ పార్టీ నుంచి గెలిచినోళ్లే జంప్ అయ్యారు. కిట్టిగానిదో లెక్కన.
అవును.. జైలు జీవితం ఎట్లుంటది బై. ఓ మూడు నెలలన్నా లోపలుండాల్సి వస్తది. తిండి ఎట్లుంటది…? నిద్ర పడ్తదా..? అరె ఊకెనే ఎందుకు ఫికర్ అయితున్నవన్నా… అక్క లేదా జైళ్ల అన్ని రోజులు. అడుగు ఎట్లుందో…? యోగా చేస్త. స్లిమ్ అయిత. ఏ ఊకో అన్న నువ్వేం చేయకున్నా బొక్క బొక్క అయితవు తియ్ ఆడ తిండితింటే. అవునా అంత బక్కగైతన. మరి పాదయాత్ర చేస్తందుకైనా శక్తి ఉంటదా..? చక్కరొచ్చి అడ్డం పడ్తన. ఏంకాదు మల్లా బయటకొచ్చినంక దొడ్డుకావొచ్చు గానీ, ఈ పాదయాత్ర ఇప్పుడవసరమానే. అట్ల చెప్పకపోతే మనోళ్లు ఆగమైతర్రా.
నాయ్న ఫామ్‌హౌజులనే పండవట్టె. నేనేమో జైళ్ల దోమలు కొట్టుకుంట ఉంటే… పార్టీకి ఎవడు దిక్కు..? మన హరిగాడున్నడు గానె. ఆనికి చాన్సియ్యద్దురో… మనందరినీ మింగి కూసుంటడు. మరెట్లనే. జైలుక పోయివచ్చినోళ్లంతా సీఎంలు అవుతున్నరని ప్రచారం చేయ్యుర్రి. ఇక మనమే సీఎం అని క్లారిటీ ఇయ్యుర్రి. అంతా మనపక్కనే ఉండాలె. ఎటూ పోవద్దు. అటూఇటూ గావొద్దు. ఇప్పటికే టైం జర మంచిగ నడస్తలేదు. అవును అరెస్టు చేస్తరంటవా..? చెయ్యని నాకేమన్నా భయమా…? యోగా చేస్త. నీ యోగా పాడుగాను ఆడ దోమలు కొట్టుడే ఓ యోగ అయితది పో. ఫికరు పడకు. ఇంకో ఖుష్ కబరేందో తెలుసునా…? ఏందిరా. నాయ్న కూడా నువ్వు జైలుకు పోవాలనే అనుకుంటుండె. అదేందిరో. నిన్ను సీఎం చేయాలె చేయాలె అని ఎన్నో కలలు కన్నడు కదా. ఇట్లనైనా అయితవేమోనని ఓ నమ్మకం పెట్టుకున్నడంట. శకునం బాగనే ఉందిరో. అయితే ఇగ నీ పోత.