(DANDUGULA SRINIVAS)
వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్:
అరే పొయ్ గా డబుల్ బెడ్‌రూం ఇండ్లల జొర్రుర్రి వ్యా… నేన్ జూస్కుంటా.. గా ఎమ్మెల్యే రాకేశ్‌గాడు ఏం జేస్తడో..?
అన్నాడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి.
నివ్వెరపోయి జూసుడు ఇలేకరుల వంతైంది. ఆముదం తాగినట్టు ముఖాలు పెట్టి అట్లనే చూస్తుర్రు గానీ ఎవలూ కుయ్‌మంటలే కుయ్క్‌మంటలే.
మళ్లా అందుకున్నడు సారు. ఇగ దంచతుండు. మైకల దంచినట్టే.
నేను కట్టిచ్చిన కదా ఆ డబుల్‌బెడ్ రూం ఇండ్లు అండ్ల వొయ్ ఉండుండ్లి. నేన్ జూస్కుంటా..! మళ్లా అన్నడు. రెచ్చగొడ్తుండాళ్లను.
అండ్లకెళ్లి ఒకడు ధైర్నం చేసి అడిగిండు.
ఏ ఊకో అన్నా..! గప్పుడే మాకేం జెయ్యలే. ఇంగ గిప్పుడేం జేత్తవన్నా…!
డౌటనుమానంతో కూడిన ముఖం పెట్టుకుని మరీ అడిగిండా ఇలేకరి.
దబాయించిండు మాజీ. అరే గట్లగాదే. గానాడు గీ కలెట్టరు ఇనలే. యాభైసార్లు జెప్పిన గా డబుల్‌బెడ్‌రూంలు మా ఇలేకరులకు ఇయ్యండ్లని.
నెపం కలెక్టర్ మీదేసిండు.
మళ్లా అందుకున్నడా జన్రలిస్టు.
ఎమ్మెల్యేగా ఉన్పప్పుడే గాలె. ఇగ గిప్పుడేం జేత్తవ్ తియ్..! ఎటకారం మేళవించి మరీ దెప్పిపొడిచిండు.
అరే మీరైతే అండ్ల జొర్రుండ్లి బై.. గా ఎమ్మెల్యే రాకేశ్‌గాడేమంటడో నేన్ జూస్కుంట..!
మళ్లా అదే పాటందుకున్నడు మాజీ.
గిప్పుడైతే గర్రమైండు జన్రలిస్టు.
పదేండ్ల సంది నువ్ జేసిందేమీ లేదు గానీ, గిప్పుడొచ్చిన గీ ఎమ్మెల్యే ఏమంటుడు. ఏ ఊకో అన్న నువ్వు నీ మాటలు. ఇగ నువ్వు మారవా..?
అయినా గా డబుల్ ఇండ్లేమన్న సక్కగ గట్టిర్రా. సగం పనులు కూడా పూర్తిజెయ్యలే. ఎవలికీ ఇయ్యక అవి బూతు బంగ్లాలోలో అయినయ్.. అని ఆన్నుంచి ముఖం తిప్పుకొని బండికాడికి పోయిండు.
బండి చాలు చేసి సక్కగా పోయిండు. వెనక్కి తిరిగి చూడకుండ. ఇసోంటి ముచ్చట్లు బాగానే చెప్తవ్ తియ్ అనుకుంట.
