vastavam exclusive

www.vastavam.in

దండుగుల శ్రీనివాస్‌- తెలంగాణ బ్యూరో:

(8096677451)

మంత్రి పదవి ఎవరికి..? మొన్నటిదాకా సుదర్శన్‌రెడ్డి అనధికారికంగానే మంత్రిగా కొనసాగాడు. ప్రొట్‌కాల్‌ కూడా పాటిస్తూ వచ్చారు అధికారులు. కీలక హోం శాఖ కూడా ఆయనకే అని డిసైడ్‌ అయ్యారు కూడా. కానీ ఇందూరు రాజకీయాల్లో రోజు రోజుకు కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బీఆరెస్‌ నుంచి కీలక నేతలకు కాంగ్రెస్‌లోకి లాగేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం తీవ్ర కసరత్తులు చేస్తున్నది. గతంలో మంత్రులుగా, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారిపై డేగ కన్ను వేసింది కాంగ్రెస్‌. కాంగ్రెస్‌ అంటేనే రెడ్డిల రాజ్యమనే పేరు పడింది. రెడ్డి లాబీయింగ్‌తో ఎక్కడెక్కడి బంధాలో ఇప్పుడు అనుబంధాలుగా మారి రాజకీయ సంబంధాలుగా దారి తీస్తున్నాయి.

నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ నేతకు ఇప్పటికే కాంగ్రెస్‌ అధిష్టానం గాలం వేసింది. పార్టీలోకి వస్తే మంత్రివర్గంలో చోటిస్తామని, కీలక శాఖ కూడా అప్పగిస్తామనే ఆఫర్‌ ఇచ్చింది. ఇది సంప్రదింపుల మధ్యే ఉండగా.. తాజాగా ఇంకో స్కూప్‌ వార్త వాస్తవానికి దొరికింది. కామారెడ్డి జిల్లాకు చెందిన బీఆరెస్‌ సీనియర్‌ నేతతో కాంగ్రెస్‌ వర్గాలు టచ్‌లోకి వచ్చాయి.

మంత్రి పదవి ఇచ్చేందుకు తాము సిద్దమని ఆశ చూపుతున్నాయి. కామారెడ్డి జిల్లా బీఆరెస్‌ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న ఈ పెద్దాయనకు ఇవి రిటైర్‌మెంట్‌ పాలిటిక్స్‌. ఇక ఆఖరు రోజుల్లో మంత్రిగా చేయాలనే తలంపు, ఆకాంక్ష కూడా అతనికి లేకపోలేదు. దీన్ని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్‌ పెద్దలు ఈ పెద్దనేతకు గాలం వేశారు. ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిగినట్లు తెలిసింది. గత కొంతకాలంగా సదరు ఈ సీనియర్‌ నేత పార్టీ వైఖరిపట్ల,అధినేత కేసీఆర్‌ పట్ల కినుక వహించినట్లు కూడా తెలుస్తోంది. అందుకే కేసీఆర్‌ తను ఓడిపోయిన తరువాత జరిగిన ఒకట్రెండు మీటింగులకు తన దగ్గరే ఉంచుకుని, స్టేజీపై ముందు వరుసలో తన పక్కనే కూర్చుండబెట్టుకున్నాడు.

కడియం శ్రీహరి పార్టీని వదలివెళ్లిన తరువాత కేసీఆర్‌కు భయంపట్టుకున్నది. ఎవరు తనవారో, ఎప్పుడు ఎవరు జంప్‌ అవుతారో తెలియని సందిగ్ఘంలో ఉన్నాడు. పార్లమెంటు ఎన్నికల్లో జీరో రిజల్ట్‌ ఆ పార్టీని, అధినేతను మరింతగా కుంగదీసింది. కీలక నేతలకు, కార్యకర్తలకు, నాయకులకు కూడా తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఈ క్రమంలో ఒక్కొక్కరూ జారుకుంటున్నారు. తాజాగా ఇందూరు జిల్లాలో మాజీ మంత్రికి గాలం వేసిన కాంగ్రెస్‌ అధిస్టానం, కామారెడ్డి జిల్లాకు చెందిన ఈ వృద్ధనేతపైనా నజర్ పెట్టింది.

మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన బీఆరెస్‌లోని ఇద్దరు కీలకనేతలకు మంత్రి పదవిగాలం వేస్తోంది కాంగ్రెస్‌. ఈ గాలినికి ఎవరు చిక్కుతారో, ఎవరు మంత్రి పదవి దక్కించుకుంటారో చూడాలి.

 

You missed