మరణం నా చివరి చరణం కాదు
మౌనం నా చితాభస్మం కాదు
మనోహరాకాశంలో విలపించే
చంద్రబింబం
నా అశ్రుకణం కాదు
నిర్విరామంగా నిత్యనూతనంగా
కాలం అంచున చిగురించే నెత్తుటి
ఊహను నేను
కలల ఉపరితలమ్మీద కదలాడే
కాంతి పుంజం నేను
కన్నీళ్ళకి కర్తవ్యాన్ని నిర్దేశించే దిక్సూచిని
నేను
అగ్ని పద్యం నేను దగ్ధగీతం నేను
అక్షరక్షిపణి నేను
ఆయుధాలుగా రూపాంతరంచెందే
ఆకలి నేపథ్యం నేను
అడవి నేను – కడలి నేను
ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షణ నేను
అజ్ఞాతంగా అంతర్లీనంగా
మట్టిపొరల్లోంచి పరీవ్యాప్తమవుతున్న
పోరాట పరిమళం నేను
శుష్కించిన పల్లెనుంచి శిథిలమైన
బతుకునుంచి శూలమైన చూపునుంచి
పరాధీనమౌతున్న స్వేదంలోంచి
ఆవిర్భవించిన మంటల జెండాల జాతర నేను మందుపాతర నేను
లోపభూయిష్టమైన వ్యవస్థలో
లోహంగా మారిన పిడికిలి నేను
సంపదల సమతుల్యం కోసం
దోపిడీ వటవృక్షాన్ని నేలకూల్చే
సైనికుల సారధ్యం నేను
చరిత్రపుటపై చెక్కుచెదరని సత్యం నేను
హింసకు ప్రతి హింసను నేను
హిట్లర్లూ హిరణ్య కశిపుల ధ్వంసం నేను
ఈ దీర్ఘకాలిక యుద్ధవ్యూహంలో
పీడితుడే నా అస్త్రం – అణ్వస్త్రం
శత్రువు నా పాదధూలి
— అలిశెట్టి ప్రభాకర్
(నేడు అలిశెట్టి జయంతి-వర్ధంతి)
(source: Sudeer Kumar Tandra)