దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
ఢిల్లీ లిక్కర్ స్కాం, మానిలాండరింగ్ కేసులో అరెస్టయిన కవితను వాళ్ల ఫ్యామిలీయే ఒంటరి చేసిందా..? కేసీఆర్ ఎందుకు ఇంత వరకు ఆమెను పలకరించలేదు..? ఎందుకు ఈ కేసుపై మాట్లాడలేదు..? ఏవో సోషల్ మీడియాలో వచ్చిన ఆకాశరామన్న కథనాలపై స్పందించి ప్రెస్‌మీట్లలో మాట్లాడే కేసీఆర్.. తన సొంత కూతురు, తనకంటూ రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసుకుని మహిళల్లో మంచి పేరున్న కవిత విషయంలో ఎందుకు ఈ వైఖరిని అవలంభిస్తున్నాడు..? ఇవన్నీ ఇప్పుడు రాజకీయాల్లో చర్చకు తావిస్తున్న అంశాలు.
కేసీఆర్ మౌనం వెనుక ఓ ఎత్తుగడ ఉంటుందనుకుంటారు. తనేం చేసినా దానికో పరమార్థమూ ఉందంటారు. కానీ తన కూతురు విషయంలో అదీ… ఢిల్లీ లిక్కర్ స్కాం, అరెస్టుపై ఆది నుంచి ఆయన అవలంభిస్తున్న తీరు పూర్తి ఆక్షేపనీయం. అవును..! అంతా అనుకుంటున్నదిదే. కన్నకూతురు జైలు పాలయి నానా అవస్థలు, తంటాలు పడుతుంటే ఓ సారి పలకించడానికి టైం దొరకడం లేదా..? కనీసం ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేయడానికి చేతులు రావడం లేదా..? ప్రెస్‌మీట్‌లో గంటలు గంటలు మాట్లాడే కేసీఆర్ ఓ రెండు నిమిషాలు కూతురు విషయంలో ఇలా ఎందుకు జరిగింది..? దీన్ని ఖండిస్తున్నాను.. అనేంత టైం దొరకడం లేదా..?
కేసీఆర్ మౌనంగా ఉన్నాడంటే ఆమె చేసిన తప్పు ఒప్పుకునే క్రమంలో అర్థాంగీకారంగా భావంచాలా..? అదే అనుకుంటున్నారంతా. అంతా తనకే తెలుసు.. అనుకునే కేసీఆర్ చాలా తప్పిదాలు చేశాడు. అలాంటి తప్పదాలకే మొన్నటి అసెంబ్లీలో భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అయినా తేరుకోలేదు. మేలుకోలేదు. గుణపాఠం నేర్చుకోలేదు. అందుకే పార్టీ క్యాడర్, లీడర్ అంతా చేజారిపోతున్నారు. ఇదంతా ఒకెత్తు. రాజకీయాల్లో ఇవన్నీ సహజం. పడిపోయిన కెరటం లేస్తుంది ఓనాడు. కానీ అది కాదిప్పుడు ఈ వార్త కంటెంట్. కన్న కూతురును ఎందుకు ఆయన పరామర్శించలేదు.
తీహార్ జైలులో ఆమెను కలవడానికి ఎందుకు వెళ్లలేదు. ఆమె అరెస్టును ఎందుకు ఖండించలేదు. అంటే ఫ్యామిలీయే ఆమెను పట్టించుకోకుండా మరిచిపోతున్నప్పుడు, ఇంకా జనాల్లో ఆమె పేరు ఎలా నానుతుంది. ఎలా గుర్తు పెట్టుకుంటారు. ఆమె లేకుండా కీలకమైన పార్లమెంటు ఎన్నికలు కూడా జరిగిపోతున్నాయి. నిజామాబాద్‌లో ఆమె ఊసు లేకుండానే ప్రచారం కొనసాగుతోంది. అరెస్టు పర్వాన్ని లేవనెత్తడానకే జంకుతున్నారు. తండ్రే పట్టించుకోనప్పుడు, పార్టీ శ్రేణులకు స్ట్రాటజీ వివరించనప్పుడు అభ్యర్థులు, లీడర్లు ఎందుకు ఆమె పేరును తలస్తారు. పాపం… కవితక్క…! ఇలా ఒంటరయ్యింది..!! కాదు కాదు ఒంటరిని చేశారు.