దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

బీఆరెస్‌ గెలిచింది ఒక్క సీటు జిల్లాలో. గెలిచింది మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. బాల్కొండ నియోజకవర్గం. ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థికి 65వేల ఓట్లొస్తే.. నాలుగున్నర వేల ఓట్లతో గట్టెక్కాడు వేముల ప్రశాంత్‌రెడ్డి. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు. మాజీ మంత్రే జిల్లా పార్టీకి ఇప్పుడు పెద్ద దిక్కు. అంతా తానై నడిపిస్తున్నాడు. కవిత జైలు పాలుకావడంతో ఆయనే అన్నీ భుజస్కంధాలపై వేసుకున్నాడు. ఇది కాదు వార్త. అసలు వార్త ఏంటంటే…

ఇప్పుడు వేముల ప్రశాంత్‌రెడ్డి ఇలాఖాలోనే ఆయనకు గట్టి దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్‌ వ్యూహం పన్నింది. ఇక్కడ భారీ మెజారిటీ కైవసం చేసుకుని జిల్లాలో తమ పట్టు ఏపాటిదో నిరూపించుకునేందుకు సిద్దమయ్యింది. అందుకు అనుగుణంగానే ఎన్నికల ముందు నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వస్తోంది.

బాల్కొండ నియోజకవర్గానికే చెందిన డీసీసీ ప్రెసిడెంట్‌ మానాల మోహన్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్‌ ఈరవిత్రి అనిల్‌, రైతు సంఘం నేత అన్వేష్‌ రెడ్డిలకు కార్పొరేషన్‌ పదవులిచ్చింది. అదనంగా మాజీ మంత్రికి అత్యంత సమీప బంధువు, బడా కాంట్రాక్టర్‌ను పార్టీలోకి గుంజింది. డీసీసీబీ చైర్మన్‌ ను చేసి వదిలింది. ఇక ఇక్కడ ఇన్చార్జిగా ఉన్న ముత్యాల సునీల్‌ రెడ్డి ఉండనే ఉన్నాడు. అంటే ఒక్క వేములపై ఐదుగురి పంచతంత్రం ఇక్కడ పనిచేయనుంది.

ఏ రేంజ్‌లో కాంగ్రెస్‌ ఎన్నికలపై గురి పెట్టిందో ఇదో ఉదాహరణ మాత్రమే. ఇప్పుడిది మాజీ మంత్రికి ఇజ్జత్‌ కా సవాల్‌. బీఆరెస్‌ ఇక్కడ ఓట్లు గణనీయంగా తగ్గితే ఆ పార్టీ ఉనికి మరింత ప్రమాదంలో పడనుంది. ఇప్పుడున్న నేతలు జంప్‌ కావడమే కాదు.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మట్టికరవతప్పదు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed