దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రధాన ప్రతినిధి:

డీఎస్‌.. ఇందూరు బిడ్డ..! గల్లీ నుంచి ఎదిగి ఢిల్లీలో మంచి పరిచయాలు పెంచుకున్న బీసీ నేత!! పీసీసీ చీఫ్‌గా కీలక పదవి చేపట్టిన రాజకీయ ఉద్దండుడు. సీఎం పదవి తృటిలో తప్పిన నేతల్లో డీఎస్‌ ఒకడు. కాంగ్రెస్‌ కురువృద్దుడు. మున్నూరుకాపుల్లో రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎదిగిన నాయకుడు. ఇవన్నీ గతం. వర్తమానం దారుణం. అనారోగ్యపరమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడు. నాలుగు గోడల మధ్య బంధీయై ఉన్నాడు. ఎలా ఉన్నావు..? అని పలుకరించే దిక్కు లేదు. ఇదంతా ఎందుకంటే.. ఇంతటి దారుణ పరిస్థితులు ఆయనకే కాదు.. ఆయన బిడ్డలకూ కష్టకాలన్నీ తెచ్చిపెట్టాయి. తండ్రి చాటు బిడ్డలుగా ఎదిగిన ధర్మపురి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌లు ఇప్పుడు తండ్రి ఉన్నా లేని లోటును అనుభవిస్తున్నారు. ఇదో ఇబ్బందికర సన్నివేశం. పగవాడికి కూడా రావొద్దనుకునే సందర్భం. ధర్మపురిర సంజయ్‌ తండ్రి ప్రోత్సహంతో రాజకీయం ఆరంగేట్రం చేశాడు.

నిజామాబాద్‌ మేయర్‌గా ఎదిగాడు. ఆ తరువాత కనుమరుగైపోయాడు. అర్వింద్ తండ్రి చాటు బిడ్డగానే ఉన్నాడు. కానీ రాజకీయంగా తన సొంత నిర్ణయాన్నే అమలు చేశాడు. బీజేపీలో చేరాడు. ఎంపీగా టికెట్‌ తెచ్చుకున్నాడు. కానీ అర్వింద్‌ గెలుపులో తండ్రి పాత్రే కీలకం. డీఎస్‌ అప్పటికే కేసీఆర్‌తో తిబ్బతిని ఉన్న కాలనాగు. కేసీఆర్‌ పార్టీలోకి పిలిచాడు. ప్రభుత్వ సలహాదారు చేశాడు. రాజ్యసభ సభ్యడినీ చేశాడు. కానీ అర్వింద్‌ బీజేపీలో చేరిన తరువాత డీఎస్‌ను కేసీఆర్‌ ఘోరంగా అవమానించాడు. పార్టీలో ఎవరూ అతన్ని దరి చేరనీయలేదు. దీనికి తోడు సంజయ్‌పై అత్యాచార ఆరోపణల కేసు పెట్టి జైలుకు పంపాడు కేసీఆర్‌, కవితలు. దీంతో రగిలిపోయాడు డీఎస్‌. కవితను ఓడగొట్టి కేసీఆర్‌పై కసి తీర్చుకోవాలనుకున్నాడు.

ఒక్కదెబ్బకు మూడుపిట్టలు. ఒకటి కేసీఆర్‌పై పగ. రెండు కవిత ఓటమి. రెండు తన కన్న కొడుకు గెలుపు. చక్రం తిప్పాడు. మున్నూరుకాపులను ఏకం చేశాడు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న మధుయాష్కీ తన శిష్యుడు. మధుతో మంతనాలు జరిపాడు. ఎలాగూ నీవు గెలిచేది లేదు.. సైలెంట్‌గా ఉండు కవితను ఓడిద్దాం అని కూడబలుక్కున్నారు. అనుకున్నది సాధించారు. అర్వింద్‌ గెలిచాడు. ఇప్పుడు మళ్లీ అర్వింద్‌ ఎంపీ టికెట్‌ తెచ్చుకున్నాడు. దాంతో పాటు తీవ్ర వ్యతిరేకత కూడా వెంట తెచ్చుకున్నాడు. ప్రజల్లో అర్వింద్‌ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ కులం పెద్దల్లో కూడా అర్వింద్‌ పట్ల సదాభిప్రాయం లేదు. గెలవటం కష్టం.

మోడీ, అయోధ్య, బీజేపీ.. మంత్రాలు పెద్దగా పనిచేయవిక్కడ. తండ్రి లేడు. తనకు తోడూ లేదు. ఇక పెద్ద కొడుకు సంజయ్‌ పరిస్థితి దారుణం. అసెంబ్లీ కోసం అర్బన్‌ టికెట్‌ ఆశించాడు. తండ్రి బలంగా లేక అది దక్కలేదు. ఇప్పడైతే మరీ దారుణం. తండ్రిలాగే కొడుకు సంజయ్‌నూ పకలరించేవాడు లేడు. పదవి దాకా ఎందుకు కనీసం పార్టీ కార్యక్రమాలకూ పిలవడం లేదు. బతికుండగానే డీఎస్‌ ఇక లేడు అనే విధంగా పార్టీ పెద్దలు వ్యవహరిస్తున్నారు. ఇది పార్టీ పరంగా సంజయ్‌కు తీవ్ర ఇబ్బంది కాగా.. రేపు ఎంపీ ఎన్నికల్లో అర్వింద్‌ తండ్రి లేని లోటు విజయపజయాల్లో తీవ్ర ప్రభావం చూపనున్నాయి. అందుకే వీరిద్దరూ ఇప్పుడు తండ్రి ఉన్నా అనాథలు.

 

You missed