దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ వ్యవహారం అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. జిల్లా నేతల మధ్య సమన్వయం కొరవడింది. మంత్రివర్గంలో జిల్లాకు చోటు లేకపోవడంతో పెద్ద దిక్కు లేకుండా పోయాడు. మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయమని మొదటి నుంచి ప్రచారం ఉంది. హోం శాఖ కూడా ఇస్తారనే ఆశలు కూడా ఉన్నాయి. కానీ ఆ ఇచ్చేదేదో పార్లమెంటు ఎన్నికలకు ముందు ఇస్తే మరింత బలంగా ఆయన పార్టీని ముందుకు నడిపివాడనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారింది. జిల్లాకు పెద్ద దిక్కన్నట్టేగానీ ఆయన మాట వినేవారు లేరు. నిర్ణయాలు పూర్తిగా మద్దతు తెలిపడం లేదు.
ఎడ్డెం అంటే తెడ్డం అనే వారు తయారయ్యారు. మాటకు విలువ లేదు. మంత్రిగా ఉంటే ఆ పవరే వేరే ఉంటుండే. ఆ లాజిక్‌ను మరిచాడు సీఎం రేవంత్. కచ్చితంగా తన దగ్గరి బంధువైన సుదర్శన్‌రెడ్డికే కేబినెట్ విస్తరణలో చాన్స్ వస్తుంది. అందులో డౌట్ లేదు. అందులోనూ ఆయనకు ఇవే చివరి రాజకీయ భవితవ్యం అనే ప్రచారమూ జరుగుతోంది. పెద్ద మనిషి అని అంతో ఇంతో మర్యాద ఇస్తున్నా.. ఆయన అందరినీ సమన్వయం మాత్రం చేసుకోలేకపోతున్నాడు. ముందు విన్నట్టు వింటున్నారు. ఆ తరువాత ఎవరి దారి వారిదే. మంత్రి పదవి ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయం జిల్లా కాంగ్రెస్ క్యాడర్‌లో ఉంది. ఇదిప్పుడు ఎటు దారి తీస్తుందో తెలియదు.
ఇప్పటికే ఎంపీ టికెట్ ఎవరికి ఇప్పించుకోవాలో అర్థం కాక తల్లడమల్లడమవుతున్నారు. రోజుకో పేరు తెరమీదకు వస్తుంది. సుదర్శన్‌రెడ్డి చెప్పిన అభ్యర్థి పేరును ఇక్కడి నేతలంతా ఏకాభిప్రాయంతో ఒప్పుకోవడం లేదు. దీంతో ఇది ఎటూ తేలడం లేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ప్రచారం ఎలా చేస్తారు..? జిల్లాకు పెద్ద దిక్కు అని భావిస్తున్న సుదర్శన్‌రెడ్డి మాట ఎంత మంది వింటారు..? అనేదే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది.