దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: అధికారం ఉన్ననాళ్లూ దోస్తు మేరా దోస్తు అన్నారు. అధికారం పోగానే అంతం చూశారు. కేసీఆర్‌ ఒంటెత్తు పోకడలు.. మితిమీరిన అతి విశ్వాసపు ఆలోచనలు రాజకీయంగా అతన్నే కాదు.. ఇటు పార్టీని అతని కూతురు కవిత పొలిటికల్ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశాయి. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ముందుగా ఊహించినట్టే కవిత జైలు పాలు కాక తప్పలేదు. సాక్షాత్తూ పీఎం వరంగల్‌ సభలో అవినీతి పరులను వదలం.. ఢిల్లీ దాకా బీఆరెస్‌ అవినీతి పాకింది.. అని కామెంట్‌ చేయడంలోనే కవిత కేసు మరింత జఠిలం కానుందని తేటతెల్లం చేసింది. మోడీ మాటలను నిజం చేస్తూ ఆమెకు కోర్టు తీహారు జైలుకు పంపింది.

వచ్చేనెల 6 వరకు ఆమె జైలులో ఉంటుంది. ఆ తరువాత వాదనలు, రిమాండ్‌, కస్టడీ.. కట్టడి ఇదే సీరియస్‌ కొనసాగనుంది. ఆమెను అంత త్వరగా వదలరు. ఎన్నికలు ముగియాలి. బీజేపీ అనుకున్నది సాధించాలి. మళ్లీ మోడీ పీఎం గద్దెనెక్కాలి. ఇవన్నీ జరగాలి. అప్పటి వరకు కవిత ఓ బలిపశువు. ఎన్నో అవినీతి అక్రమాలు జరిగినా జైలు వరకు పోని ఉదంతాలు ఎన్నో. అవినీతి పరులు బీజేపీలో చేరగానే నీతి మంతులయిపోతారు. అదేలా అని ఎవరైనా ప్రశ్నిస్తే.. దేశం కోసం, ధర్మం కోసం అని నినాదం ఉండనే ఉంది.

సేమ్‌ తెలంగాణ కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో కేసీఆర్‌ పాటించిన పాలసీలాగే. రాజకీయ పునరేకీకరణ పేరుతో ప్రతిపక్షాలు లేకుండా చేసి అంతా తానే అన్న చందంగా మోనార్క్‌లాగా చెలామణి అయిన కేసీఆర్ లాగే.. మోడీ కూడా. ఇద్దరూ ఇద్దరే. అధికారమే పరమావధిగా కొనసాగిన వాళ్లు. కొత్త రాజకీయాలకు భాష్యంచెప్పిన వాళ్లు. ఇప్పుడు కేసీఆర్‌ శకం ముగిసింది. అనుభవిస్తున్నాడు. మోడీ శకం ఇంకా ఉంది. కొన్నళ్ల పాటూ ఉంటుంది. ఇదీ ఓ దశలో ముగుస్తుంది. అప్పటి వరకు ఇలా ప్రతీకారదాడులు, అధికారం కోసం పావులుగా మార్చి బలిపశువులను చేయడం కొనసాగుతుంది. ఢిల్లీ లిక్కర్‌ స్కాం, మానిలాండరింగ్ విషయంలో ఈడీ చేసింది తప్పు కాదు.

కానీ ఇందులో రాజకీయ కోణం బలంగా ఇమిడి ఉండటడమే అసలైన తప్పు. ఒకరి పట్ల తీసుకున్న కఠిన నిర్ణయాలు, మరొకరిపై జాలి, దయ, కటాక్షంగా మారడం ఇప్పుడు నడస్తున్న పొలిటికల్ ట్రెండ్‌. ఎవరు తీసిన గోతిలో వారే పడతారన్నట్టు కేసీఆర్‌ నడిచిన బాటలోనే మోడీ నడుస్తున్నాడు. కేసీఆర్‌ ఈటల రాజేందర్‌ లాంటి పిచ్చుక మీద బ్రహ్మాస్త్ర ప్రయోగమనే కవితలాంటి వారి మీద మోడీ చేస్తున్నాడు. ఒకరితో ఒకరు ఆడుకుంటున్నారు. ఇదే రాజకీయ క్రీడ. పరమపద సోపానం. ఒకరి సారి ఒకరు నిచ్చెనవుతారు. మరొకరసారి పామై మింగేసి పాతాళానికి పడేస్తారు. కచ్చితంగా ఇవి జరిగి తీరాల్సిందే. ఇవాళ కేసీఆర్. రేపు మోడీ. అంతే.

You missed