దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

ఆమె ఇంటా గెలవలేదు.. రచ్చా గెలవలేదు. రెండింటా ఘోరంగా ఓడిపోయింది. పరువు తీసుకున్నది. చెప్పుడు మాటలు విన్నది. మంచి చేసే వారి మాటలు పెడ చెవిన పెట్టింది. ఇక్కడే కట్టె కాలే వరకు ఉంటా.. అని శపథం చేసిన కవిత.. జిల్లాలో పార్టీ నేలమట్టమయి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నా పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలను ఇష్టారాజ్యానికి వదిలేసింది. చెప్పుడు మాటలు విని పార్టీ పరువు బజారున పడుతున్నా తమాషా చూసింది. ఘోర పరాభవం మూటగట్టుకున్న ఫలితాల్లో ఆమె పాత్రను కాదనలేం. తీసేయలేం. చెట్టుకు చెదలు పడుతున్నా ఆమె పట్టించుకోకపోవడం ఇక్కడ విషాదం. అందుకే ఆమె అరెస్టుకు ముందే అనాథయ్యింది.

జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఆమె ఎప్పుడూ పట్టుసాధించే ప్రయత్నం చేయలేదు. ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకునేందుకూ యత్నించలేదు. వేర్వేరు కుంపట్లను స్వయంగా రాజేసింది. ఎమ్మెల్యేల మధ్య ఉన్న వైరాన్నీ పెంచి పోషించింది. అందుకే అంతిమంగా ఆమెకు ఘోర పరాభవమే మిగిలింది. లిక్కర్‌ స్కాంలో ఆమె పేరు తెరపైకి వచ్చిన తరువాత ఆమె ప్రజాక్షేత్రంలో పలుచన పడింది. మహిళల్లో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్న ఆమె.. తనకంటూ ఓ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసుకోలేకపోయంది. కోటరీని మాత్రం నమ్ముకున్నది.

పీఏలు, పీఆర్వోలు చెప్పిందే ఆమెకు వేదం. వారు చెప్పిన మాటలు విని నిర్ణయాలు తీసుకోవడం ఆమె అపరిపక్వ ఆలోచనలకు భారీ మూల్యమే పార్టీ చెల్లించాల్సి వచ్చింది. ఆమెకూ అదే స్థాయిలో నష్టం జరుగుతూ వచ్చింది. ఇక్కడ బీజేపీ బలపడటానికి, ఆమె ఓటమికి కారణం ఆమె వైఖరే. ఎవరి మాటా వినకపోవడం, కోటరి ఆమె దరికి ఎవరినీ చేరనీయకపోవడం, జాగృతి ముసుగులో విచ్చిన్నకర శక్తులు ఆమె చుట్టే మూగి ఉండటం కవితకు వాస్తవ పరిస్థితులను కళ్లకు కనబడకుండా చేశాయి.

ఆమె అద్దాల మేడలో రాణిగానే ఉండేలా చేశారు. కారు అద్దాల్లోంచి చేతులూపి టాటా చెప్పే నేతగానే చిత్రీకరించారు. అందుకే ఆమె క్రమేణా ప్రజలకు దూరమవుతూ వచ్చింది. ఇప్పుడు అరెస్టుల దాకా వ్యవహారం వెళ్లింది. పార్టీనే అనాథ అయ్యిందని అంతా అనుకుంటున్నారు. కానీ ఆమే అనాథయ్యింది. ఇప్పుడు ఓడిన ఎమ్మెల్యేలు సమయం చూసి జంప్‌ అవుతారు. వాడుకున్నన్ని రోజులు వాడుకున్నారు. తరువాత గోడ దూకే పిల్లులవుతారు.

కానీ కవితను నమ్ముకుని ఉన్న ఉద్యమకారులకు, కార్యకర్తలకు, జాగృతి నిజమైన కార్యకర్తలకు మాత్రం తీవ్ర అన్యాయమే చేసింది. కనీసం ఇప్పుడు ఈడీ కస్టడీలో సాయంత్రం ఆరు గంటల నుంచి 7 గంటల వరకు కలసి మాట్లాడే అవకాశం ఇచ్చారు. కానీ ఇన్నాళ్లూ ఇక్కడ ఆ అవకాశమూ దక్కలేదు. అందుకే ఆమె జనం నేతగా ఎదిగి జనానికి దూరమై.. ఫక్తు ఓ నాయకురాలిగా.. చెప్పుడు మాటల సూత్రధారుల పావులకు బలైన పాత్రధారిగా మిగిలిపోయింది.

 

You missed