ఇందూరు టీఆరెస్‌కు కంచుకోట. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తన హవా కొనసాగుతోంది. జిల్లాలో కవిత అన్నీ తానై వ్యవహరిస్తున్న తరుణంలో ఆ పార్టీ అన్ని సీట్లను క్లీన్ స్వీప్ చేస్తూ వస్తున్నది. బీజేపీ ఇప్పుడిప్పుడు ఇక్కడ బలం పుంజుకుంటున్నది. ఇక్కడ అన్ని సీట్లతో దాదాపుగా త్రిముఖ పోటీ నెలకొననున్నది. ఈ పోటీ అంతిమంగా టీఆరెస్‌కే లాభం చేకూర్చిపెట్టే అవకాశం ఉంది. దీంతో ఉత్తర తెలంగాణలో వీక్‌గా ఉన్న కాంగ్రెస్‌కు పూర్వవైభవం తేవాలంటే … రేవంత్‌ను ఇక్కడ ఇందూరు నుంచి పోటీకి దింపితే బాగుంటుందనే ప్రతిపాదనలు నాయకులు, కార్యకర్తల నుంచి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ అర్బన్ లేదా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి రేవంత్ పోటీ చేయనున్నారని గత వారం పది రోజులుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నాయి. బీజేపీలోనూ ఇదే అంశం చర్చకు తెర తీస్తున్నది. ఆ నాయకులు కూడా దీనిపై ఆరా తీస్తున్నారు.
అయితే నిజామాబాద్ అర్బన్ నుంచి ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయనున్నాడనే ప్రచారం లేకపోలేదు. డీఎస్ త్వరలో కాంగ్రెస్ గూటికి చేరనున్న క్రమంలో పెద్ద కొడుకు సంజయ్‌కు అర్బన్ టికెట్ కన్ఫాం చేసుకున్నట్టేననే ప్రచారమూ ఉంది. లోలోపల ఇటు సంజయ్, అటు డీఎస్ రంగం రెడీ చేసుకుంటున్నారు. మున్నూరు కాపుల బలం, మైనార్టీల సపోర్టుతో సంజయ్‌ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా గెలిపించుకోవచ్చనే ధీమాలో డీఎస్ ఉన్నాడు. ఇదే విషయం పై అధిష్టానంతో కూడా చర్చించి ఒప్పించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నిజామాబాద్ అర్బన్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ అనేది ఇతర ఆశావహ కాంగ్రెస్ నాయకులను కంట్రోల్ చేయడంలో భాగంగా చేస్తున్న ఎత్తుగడగా కూడా కొందరు భావిస్తున్నారు. దీనిపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి మాట్లాడాడు. ఉత్తర తెలంగాణపై రేవంత్ ప్రధానంగా దృష్టి పెట్టాడని, నిజామామాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల నుంచి ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలని కార్యకర్తలు బలంగా కోరుతున్నారని ఆయన అన్నాడు.