ఇప్పుడు అందరి దృష్టి హుజూరాబాద్ పై పడింది. గెలుపు ఇద్దరికీ ఇజ్జత్‌కా సవాల్ గా మారింది. ఈటల రాజేందర్ పొలిటికల్ ఎపిసోడ్‌ను ఈ హుజురాబాద్ ఉప ఎన్నిక ఓ మలుపు తిప్పనుంది. దీనికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి కేసీఆర్ అనవసరంగా ఈటలకు మైలేజీ ఇస్తున్నాడనే విమర్శలు సర్వతా వినిపిస్తున్నాయి. ఈటలను గెలవనీయకుండా ఘోరంగా ఓడగొట్టి బుద్ది చెప్పాలని కేసీఆర్ అన్ని శక్తులను అక్కడ మోహరించాడు.
హరీశ్ రావైతే పండగలేదు… పబ్బం లేదన్నట్టుగా అక్కడే తిష్టవేశాడు. టీఆరెస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కనిపించడం లేదక్కడ ఇప్పుడు. హరీశ్ రావే అంతా తానై వ్యవహరిస్తున్నాడు. విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. నాయకులకు పదవులు, ప్రజలకు తాయిలాలు, కొత్త పథాకలు అన్నీ ఇక్కడ కేంద్రంగానే జోరుగా సాగుతున్నాయి. మిగిలిన అన్ని చోట్లా పాలన పడకేస్తే.. ఇక్కడ మాత్రం పరుగులు పెడుతున్నది. తాజాగా కేంద్రం కూడా ఈ ఉప ఎన్నికపై జోక్యం పెంచింది. మొన్నటి వరకు బీజేపీ సైతం కేసీఆర్‌తో సఖ్యత కోసం పట్టీ పట్టనట్టుగా ఉందనే విమర్శలు వచ్చాయి.
అందుకే ఎన్నిక నోటిఫికేషన్‌లో జాప్యం చేసిందనే అపవాదును అది మూటగట్టుకున్నది. తాజాగా మారిన పరిస్థితులు కేసీఆర్ ప్రభుత్వానికి కంటగింపుగా మారాయి. కేంద్ర బలగాలను ఈ ఎన్నిక కోసం మోహరించడం.. కేసీఆర్ బహిరంగ సభ పెట్టుకోనీయకుండా ఆంక్షలు పెట్టడం లాంటి చర్యలతో కేసీఆర్ దూకుడుకు బీజేపీ ముకుతాడు వేసే చర్యలు ఉపక్రమించందనిపిస్తున్నది. ఇంతా చేసి చివరలో టీఆరెస్ పరవు పోయేలా ఫలితాలైతే రావు కదా.. అనే అనుమానమూ వస్తున్నది ఆ సెక్షన్‌లో.
ఎందుకంటే.. ఈటల రాజేందర్‌కు ప్రభుత్వ వ్యతిరేక వర్గమంతా మద్దతుగా ఉన్నారు. హుజురాబాద్‌లో మంచి పేరుంది. పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా చూస్తున్నారు. ఎలాగైన ఈటలను గెలిపించాలనే తలంపు అక్కడ మెజార్టీలో కనిపిస్తుంది. అదే జరిగితే టీఆరెస్ పరువు పోతుంది. ఎందుకంటే.. ఇక్కడ అనవసరంగా కేసీఆర్ దీన్ని పెద్ద ఇష్యూ చేసి కూర్చున్నాడు. ఈటలను తన మానన తనను వదిలిపెడితే పోయేది. ఓ ఉప ఎన్నిక స్ట్రాటజీ తీసుకుని దాని ప్రకారం పోయున్నా సరిపోయేది. కానీ కేసీఆర్ దీనికి అత్యంత ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడం ఈటలను మరింత పెంచి పెద్ద చేసినవాడయ్యాడు. తనను తాను కేసీఆర్ చిన్నగా చేసుకున్నాడు పంతానికి పోయి. ఇప్పుడు చావో రేవో అన్న చందంగా ఈ ఇద్దరు బరిలో కొట్లాడుతున్నారు. ఇది పార్టీల మధ్య పోరులా లేదు.. ఈటల, కేసీఆర్ ల మధ్య పోరులా ఉంది. జనాలు కూడా అట్లనే చూస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఫలితాల తర్వాత టీఆరెస్ పరిస్థితి ఇలా అయితే మాత్రం.. దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాల్సిందే. ఎందుకంటే.. హుజూరాబాద్‌ను అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా మార్చింది ఆయనే. ఈటలను పెంచి పెద్ద చేసింది ఆయనే. పరిపాలన ఇక్కడ కేంద్రంగా నడుపుతున్నదీ ఆయనే. అన్నీ.. అన్నీ .. అన్నీఆయనే.