టీఆరెస్‌లో పాలనలో కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. కేటీఆర్ మార్కు ఆలోచనలు అమలులోకి వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కేటీఆర్ ప్రతిపక్షాల విపరీత ఆరోపణలపై భగ్గున మండుతున్నాడు. చాలా సందర్బాల్లో తన కోపాన్ని బయట కూడా పెట్టుకున్నాడు. ఈట్ కా జవాబ్ పత్తర్ సే అనే పిలుపు కూడా ఇచ్చాడు తెగించి. దీని పర్యవసానం తొలత పెద్దగా కనిపించలేదు. కానీ లోలోపల కేటీఆర్ రగులుతూనే ఉన్నాడు.
మీడియా ముసుగులో తీన్మార్ మల్లన్న సీఎం కేసీఆర్ పై మాట్లాడిన తీరును స్వయంగా కేటీఆర్ మీడియా ముఖంగానే మండిపడ్డాడు. కోపాన్నంతా వెళ్లగక్కాడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డిపైనా అదే స్థాయిలో విరుచుకుపడ్దాడు. వాడు వీడు అనే వరకు వెళ్లింది వ్యవహారం. ఎవరినీ లెక్కచేయను .. అనే విధంగా తను కూడా అదే దోరణిలో మాట్లాడుతూ మారిన తన వైఖరికి సంబంధించిన సంకేతాన్ని పంపించాడు. తీన్మార్ మల్లన్నను జైలుకు పంపి చిప్పకూడు తినిపించి శుభారంభం చేశాడు కేటీఆర్. ఇక వరుస పెట్టాడు. బీజేపీ నేతలు టార్గెట్ చేశాడు.
తాజాగా టీచర్ల బదిలీల విషయంలో ధర్నా చేసిన బండి సంజయ్‌కు కూడా జైలే దిక్కయ్యింది. బెయిల్ దొరికింది. అర్వింద్‌పై నిజామాబాద్ టౌన్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎస్సీ, ఎస్టీ చట్టాన్నుద్దేశించి తనదైన శైలిలో వంకరగా మాట్లాడబోయి దొరికిపోయాడు అర్వింద్. దీనిపైనే కేసు నమోదైంది. ఇది ఎన్ని మలుపులు తిరిగి ఎటు దారి తీస్తుందో చూడాలి. కేటీఆర్ పిలుపుతో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఇక మాటల దూకుడు పెంచనున్నారు. తీన్మార్ మల్లన్న మొన్న కేటీఆర్ కొడుకు హిమాన్షుపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై అంతటా వ్యతిరేకత వచ్చింది. బీజేపీలోనే చాలా మంది తీన్మార్ మాటలను తప్పుబట్టారు.
దీనిపై కేటీఆర్‌కు అత్యంత దగ్గరగా వ్యవహరించే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్‌లు మరీ విపరీతంగా మాట్లాడారు. బట్టలూడదీసి కొడతానని ఒకరు, ఇంటికొచ్చి తంతానని ఇంకొకరు తమ నోటి పవర్‌ను చూపించారు. కేటీఆర్ దగ్గర మార్కులు కొట్టేశారు. మంత్రి మల్లారెడ్డి ఆ మధ్య రేవంత్‌పై తొడకొట్టిన సందర్భ సన్నివేశాలకు తెర వెనుక కేటీఆరే అని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. మొన్నటి వరకు కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలపై కొంత సంయమనం పాటించాడు. ఈ మధ్య ఆయనా విరుచుకుపడుతున్నాడు. కానీ కేటీఆర్ మాత్రం ఈ చర్యలపై యాక్షన్‌కు కూడా దిగాడు. ఇన్ని మాటలు మాట్లాడితే చేతులు కట్టుకు కూర్చోవాలా..? నో నెవ్వర్… అన్నాడు. అంటున్నాడు. చేసి చూపిస్తున్నాడు. కేటీఆర్ పిలుపుతో నేతలూ ఇక తమ సత్తా చాటుకుని.. యువనేత వద్ద మంచి మార్కులు కొట్టాయాలనే తహతహలో ఉన్నారు. ఏ మాత్రం చాన్స్ దొరికినా.. దొరకకపోయినా.. నోటిదురుసు చూపించే ప్రతిపక్ష నేతలకు చిప్పకూడు తినిపించేందుకు కేటీఆర్ ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఇదీ ఇప్పుడు కొనసాగుతున్న కేటీఆర్ మార్కు పాలన.