హుజురాబాద్‌లో హరీశ్‌రావు ఎన్నికల ప్రచారంలో పదును పెంచుతున్నాడు. పంచ్ డైలాగులతో ప్రసంగాలను రక్తి కట్టిస్తున్నాడు. అవసరమైతే అవలీలగా ఎలాంటి అబద్దాలనైనా ఆడేందుకు వెనుకాడడం లేదు. మొన్నటి దుబ్బాక ఎన్నికల కన్నా ఇక్కడే ఎ..క్కు…వ ప్రయాస పడుతున్నాడు. శ్రమకోరుస్తున్నాడు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ కాదు అభ్యర్థి.. హరీశ్ రావే అన్నంతంగా కష్టపడుతున్నారు. అందరూ అట్లనే అనుకుంటున్నారు కూడా. సీఎం స్థాయిలో హామీలు కూడా ఇస్తున్నాడు. అమలయ్యే బాధ్యత నాదీ అని కూడా అంటున్నారు. స్వయంగా సీఎం చెప్పిన చాలా వాటికే ఇప్పటికీ దిక్కు లేదు.
ఇప్పుడు హరీశ్ హుజురాబాద్ కేంద్రంగా ఎడాపెడా అభయహస్తానిచ్చేస్తున్నాడు. ఇక్కడ నిధుల వరద పారుతున్నది. మూడు నెలలుగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. రాజేందర్ ఓ బచ్చా అంటూనే.. బచ్చాను ఓడగొట్టేందుకు బడా బడా ఆసాములే దిగారు.. ఆమాత్యులే చమడోస్తున్నారు. హేమాహేమీలే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. నిద్రాహారాలు మాని అన్ని శక్తులు అహరహం పనిచేస్తున్నాయి.
తాజగా ఓ ఫార్మా కంపెనీకి చెందిన వందల కోట్లు దొరికాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. దీనిపై ఏ మీడియా స్పందించడం లేదని కూడా తిట్టి పోస్తున్నారు. ఎన్ని పైసలు దొరికినా ఖర్చు వెనుకాడేది మాత్రం ఉండదు. వేల కోట్లు గుమ్మరించేందుకు రెడీగా ఉన్నది అధికార పార్టీ. సరే.. ఇదంతా తెలిసిన ముచ్చటే. పాత కథే గానీ..తరుచూ హరీశ్ అనే ఓ మాట మళ్లీ ఓ వార్తా కథనంగా వచ్చింది. ఆసామికి, సామాన్యుడికీ మధ్య పోటీ అని… ఆసారి ఈటల రాజేందర్. సామాన్యుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని ఆయన అర్థం. అలా పంచ్ డైలాగులతో సెంటిమెంట్‌తో ప్రజల్లో గెల్లుకు మద్దతు దొరుకుతుందనేది హరీశ్ ఉద్దేశం. అర్థం కాని విషయం ఏంటంటే.. ఈటల ఆసామి నిజమే. వందల కోట్లు ఉన్నయి నిజమే. వందల ఎకరాలు ఉన్నయి నిజమే. గెల్లుకు ఏమీ లేవు నిజమే. కానీ గెల్లును గెలిపించేందుకు మీరు వేల కోట్లు ఖర్చు పెడుతున్నది నిజం కాదా? హరీశ్ చెప్పినట్టు పేదోడు పేదోడిగానే పోటీ చేస్తుండా..? కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నది ఎవరు..? ఈ ఒక్క నియోజకవర్గం గెలుపు కోసం ఇంతలా దిగజారిపోయిందెవరు? అంతటి ఘోర పరిస్థితులు చేజేతులా క్రియేట్ చేసుకుంది ఎవరు?? ప్రజలంతా గమనిస్తున్నారు. వాళ్లను ఇంకా వెర్రి వెంగళప్పలనుకోవడం మీ పొరపాటు. ఎవరెంత ఖర్చు చేస్తున్నారు.?
ఆసామి పెడుతున్న ఖర్చెంత? సామాన్యుడి తరుపున సర్వశక్తులు గుమిగూడి పెడుతున్న కోట్లెన్ని..? ఆసామి మభ్యపెడుతూ ఆడుతున్న అబద్దాలెన్ని..? సామాన్యుడి తరుపున అవలీలగా దిగజారి పచ్చి అబద్దాలాడుతున్న పెద్దలెవరు?? ఆసామి ని ఓడించేందుకు .. ఇదేదో రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయంగా మలిచి.. పాలన ఇక్కడి కేంద్రంగా చేసేంతకగా జంకుతున్నదెవరు? అభద్రతకు లోనై మిగిలిన పాలనంతా పాతరేస్తున్నదెవరు? కరోనా కరువు కోరల నుంచి బయటపడని ప్రజల గురించి మరిచి హుజురాబాద్ చుట్టూ చక్కర్లు కొడుతూ.. గెలుపు కోసం పాలన అంత అక్కడ మోకరిల్లేలా చేసిందెవరు?
జనం వెర్రివెంగళప్పలు.. మీరు చెప్పిందంతా వింటారు? ఇచ్చిదంతా తీసుకుంటారు..?
ఓటు మాత్రం వేస్తారు…? ఎవరికో వాళ్లకు తెలుసు.. మీకు తెలుసు…
ఎందుకంటే వాళ్లు వెర్రివెంగళప్పలు కాబట్టి…