ఇప్పుడు అన్ని పార్టీలు దళితరాగం అందుకున్నాయి. సీఎం కేసీఆర్ ఏనాడైతే దళితబంధును తెరపైకి తెచ్చాడో.. అప్పట్నుంచి ఇతర పార్టీలు కూడా అప్రమత్తమయ్యాయి. కేసీఆర్ వేసే ప్రతీ అడుగు వెనుకా ఏదో మర్మముంటుంది. ఏదో మతలబుంటుంది. ఇంకేదో ప్రయోజనం ఉంటుంది. ఇదే తరహాలో ఆలోచించాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. ఈ విషయంలో బీజేపీ కన్నా కాంగ్రెస్ ముందంజలో ఉంది. రేవంత్ రెడ్డి అత్యుత్సాహం దీనికి తోడైంది. దళిత, గిరిజన ఆత్మగౌరవ సభల పేర .. కేసీఆర్‌ను ఇష్టమొచ్చినట్టు తిట్టే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. బీజేపీ మూడెకరాలేమైనయి అని నిలదీస్తున్నది అప్పుడప్పుడు. బీజేపీకి నమ్మకం లేదు ఎస్సీలు తమను నమ్ముతారని. అందుకే అది బీసీలపై నమ్మకం పెట్టుకున్నది. కాంగ్రెస్ మాత్రం బలంగానే దళితరాగమందుకున్నది. ఇదెంత వరకు పోయిందంటే.. మొన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి తాము అధికారంలోకి వస్తే ఎస్సీని సీఎం చేస్తామని, తాను అధిష్టానాన్ని బతిమాలుతానని అన్నాడు. ఈరోజు దాసోజు శ్రవణ్, మల్లురవిలు సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మీ సీఎం సీటు మాకు కావాలి అని అన్నారు. దళితుణ్ని సీఎం చేయాలనేది వీళ్ల డిమాండ్‌గా చెప్పారు.
ఈ దళిత సీఎం అనేది ప్రస్తుత రాజకీయాల్లో సెట్కానిది. అసాధ్యమైనది. కేసీఆర్ వెలమ కులాన్నే సీఎంగా చూడాలనుకంటున్నాడు. అయితే తాను. లేకపోతే కొడుకు. రేవంత్‌రెడ్డి తన రెడ్డి కులపోడే సీఎం కావాలని కోరుకుంటాడు. అందుకోసమే ఇదంతా చేస్తున్నాడు. తానే స్వయంగా ఓటుకు నోటు కేసులో దొరికిన సంఘటనలో ఈ విషయం చెప్పాడు కూడా. ఇక బీజేపీ దళితకార్డున తీసి ఎక్కడో అటుకు మీద పడేసింది. ఇక దళిత సీఎం అనేది ఉత్త ముచ్చట. మరి కాంగ్రెస్ పదే పదే ఇప్పుడు దళిత సీఎం అనే మాట ఎందుకు తీస్తుంది.?
ఒకటి.. తాము అధికారంలోకి రామనే భావనలో ఇంకా కాంగ్రెస్ ఉండి ఉండాలి. అందుకే ఈ దళిత సీఎం అనే అంశం కేసీఆర్‌ను ఆత్మసంరక్షణలో పడేసేందుకు వాడుకోవచ్చ అనే ఎత్తుగడై ఉండాలి.
కానీ ఆ ఎత్తుగడ వేస్తే గనుకు కాంగ్రెసే సెల్ఫ్ గోల్ అయినట్టు. ఎందుకంటే ఈ డిమాండ్ ఎక్కడి వరకు వెళ్తుందంటే.. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడ్నే సీఎం చేస్తామనే వరకు. కానీ అవి మాటలకే పరిమితం. కేసీఆర్ లాగ. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఓ రెడ్డే సీఎం అవుతాడు తప్పితే. మరొకరు కారు. అధికారం కోసం ఆ సెక్షన్ అంతలా తపించిపోతుంది. ఎదురుచూస్తున్నది. ఇక బీజేపీ అధికారంలోకి రావడం కల్ల. దానికి ఈ లొల్లి లేదు.