(దండుగుల శ్రీ‌నివాస్‌)

ప‌దేండ్లు అధికారంలో ఉన్న పార్టీ ప‌త్రిక, కేసీఆర్ మాన‌స పుత్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో ఇంకా జీతాలు ప‌డ‌లేదు. ద‌స‌రాకు వారం రోజులు కూడా లేదు. ఇంకా జీతాలు రాల‌పోయే స‌రికి.. అంతా బిక్కు బిక్కు మంటూ ఎదురుచూస్తున్నారు ఉద్యోగులు. మొన్న‌టికి మొన్న కేటీఆర్ ఆఫీసుకు వ‌చ్చి ఇక న‌మ‌స్తేను మ‌రింత బ‌లోపేతం చేద్దాం.. ఎవ‌రినీ తీసేయొద్దు.. ఇదే మ‌న‌కు శ్రీ‌రామ ర‌క్ష అని ప‌లికి భ‌రోసా ప‌లుకులు ఎవ‌రిలోనూ ధీమాను తీసుకురాలేక‌పోయిన‌యి. గ‌త నాలుగు నెలలుగా జీతాలు ఆల‌స్యంగానే వ‌స్తున్నారు. ప్ర‌తీ నెల నాలుగో తారీఖు దాకా ఎదురుచూసే వాళ్లు. ఐదోతారీఖు దాట‌నియ్య‌కుండా జాగ్ర‌త్త‌లు ప‌డ్డారు.

ఇక లాభం లేద‌నుకుని ఆ మేనేజ్‌మెంట్ ఉద్యోగులకు చెప్పేసింద‌ట‌. మీరు ఇక‌పై జీతాల కోసం కొంచెం ఎదురుచూడాల్సిందేనని. ఖ‌చ్చితంగా, ఇత‌మిత్థంగా ఈ రోజు వేస్తామ‌ని చెప్ప‌లేమని కూడా చేతులెత్తేసింది. మీ ఈఎంఐల డేట్లు ఎప్పుడు ఎలా మార్చుకుంటారో జ‌ర చూసుకోండ్రి.. మా మీద పడి ఏడ‌వ‌కుండ్రి అని ముంద‌స్తుగా మెంట‌ల్‌గా ప్రిపేర్ చేసి పెట్టింది వారిని. ఎంత ప్రిపేర్ అవుదామ‌న్నా వారితో కావ‌డం లేదు. మొన్న‌టి వ‌ర‌కు ఉద్యోగాలు తీసేస్తారేమోన‌ని భ‌యంతో బ‌తికిన ఉద్యోగులు.. ఇప్పుడు జీతాలు ఎప్పుడేస్తారోన‌ని ఎదురు చూస్తున్నారు.