(దండుగుల శ్రీ‌నివాస్‌)

రాష్ట్ర బ‌డ్జెట్ అంకెల గార‌డీ పేద‌ల‌కు తెలియ‌దు. వారు పెద్ద‌గా ప‌ట్టించుకోరు. ఆ లెక్క‌లు, ఖ‌ర్చులు, రాబ‌డులు వారిక‌వ‌స‌రం లేదు. ఈ స‌ర్కార్ ఏమిచ్చింది? మా జీవితాలు బాగుప‌డ్డాయా? ఎదురుచూస్తున్న హామీలేమైనా అమ‌లువుతున్నాయా? ఇవే ఆ పేద‌ల‌కు కావాల్సింది. తాజా బ‌డ్జెట్‌లో చెప్పుకోవాల్సినవి పెద్ద‌గా ఏమీ లేవు. ఒక్క ఇందిరా కుటుంబ జీవిత బీమా మిన‌హా. నేను చెప్పేది.. ప‌క్కా పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల గురించే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వ‌చ్చిన త‌రువాత కూడా ఈ సెక్ష‌న్ల‌లో పెద్ద‌గా మార్పేమీ లేదు. ఊహించుకున్నంత‌, ఆశించినంతగా జీవన ప్ర‌మాణాలు ఏమీ పెర‌గ‌లేదు. జీతాలూ పెర‌గ‌లేదు. జీవితాలు చిన్నాభిన్న‌మ‌య్యాయే త‌ప్ప‌. రైతు భ‌రోసా, పింఛ‌న్లు.. ఇవి కాకుండా… ప్ర‌త్య‌క్షంగా పేద‌ల‌కు, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు ఈ స‌ర్కార్ అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల్లో మ‌రీ ద‌గ్గ‌రైన‌వి.. వారిని ఆదుకుంటున్న‌వి.. ఫ్రీ బ‌స్సు ప‌థ‌కం, స‌న్న‌బియ్యం పంపిణీ. అవి రెండూ పేద‌ల జీవితాల‌తో పెన‌వేసుకున్నాయి. కొన్ని లోపాలుండొచ్చు వీటి అమలులో. కానీ అంతిమంగా ఇవి పేదోడి కుటుంబ బ‌డ్జెట్‌కు వంద‌శాతం అండ‌నిచ్చేవే. మ‌హిళ‌ల‌కు ఫ్రీ బ‌స్సు ద్వారా ఆదా అయ్యే ఆ మొత్తం.. ఆ కుటుంబానికి ఎంతో కొంత చేదోడువాదోడుగా నిలుస్తున్న‌ది.

దీన్ని ఏ ప్ర‌తిప‌క్షాలు వ‌ద్ద‌న్నా.. వారికే న‌ష్టం. వారికి జనం నాడి తెలియ‌ద‌నే అనుకోవాలె. ఇక స‌న్న‌బియ్యం ప‌థ‌కం.. దొడ్డుబియ్యం తిన‌డం మానేసి చాలాకాల‌మే అయ్యింది అంతా. పేద‌వ‌ర్గం కూడా త‌మ పిల్ల‌ల‌కు స‌న్న‌బియ్యాన్నే పెడుతున్న‌ది. ఇప్పుడు మార్కెట్లో స‌న్న‌బియ్యం ధ‌ర కిలోకు 40 నుంచి 60 వ‌ర‌కు ఉంది. ఫ్రీగా ఇచ్చే ఈ స‌న్న‌బియ్యం ప‌థ‌కం కూడా ఎంతో ఉప‌యోగంగా, వారి కుటుంబ బ‌డ్జెట్‌కు బాస‌ట‌గా నిలుస్తున్న‌ది. తాజాగా ఈ బ‌డ్జెట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన ఇందిరా కుటుంబ జీవిత బీమా ప‌థ‌కం.. ఆ పేద సెక్ష‌న్‌కు మ‌రింత అండ‌గా నిల‌వ‌నుంది. రేష‌న్‌కార్డుదారుల‌కే ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నారు. దాదాపు కోటికిపైగా కుటుంబాలకు ఇది బాస‌ట‌గా నిల‌వ‌నుంది. ఆ కుటుంబ పెద్ద చ‌నిపోతే 5 ల‌క్ష‌లు బీమా కింద చెల్లించే ఈ ప‌థ‌కం ద్వారా కొండంత అండ‌నే ఇవ్వ‌నుంది. ఇందులో డౌట్ లేదు. నిస్స‌హాయ స్థితిలో, పూట‌గ‌డ‌వ‌డ‌మే క‌ష్టంగా మారిన నేటి త‌రుణంలో ఆ కుటుంబ పెద్ద చ‌నిపోతే.. దిక్కుమొక్కులేని ఆ జీవితాల‌కు ఆ ఆర్తిక భ‌రోసా అండ‌నే ఇస్తుంది. రైత‌లకు మాత్ర‌మే రైతుబీమా ఉండేది. భూమి లేని నిరుపేద‌లు చాలా మందే ఉన్నారు రాష్ట్రంలో. వారంద‌రికీ ఇందిర‌మ్మ జీవిత బీమా ప‌థ‌కం బాస‌ట‌గా ఉంటుంది. ఇక స‌ర్కార్ ఇచ్చిన 4వేల పింఛ‌న్ ఇస్తే.. మ‌రింత అండ‌గా నిల‌బ‌డిన‌ట్టే. కానీ అది ఇప్ప‌ట్లో జ‌రిగే ప‌ని కాదు. అప్ప‌టి వ‌ర‌కైతే ఈ మూడు ప‌థ‌కాలు పేద కుటుంబాల బ‌డ్జెట్‌కు తోడునీడ‌గా నిలుస్తున్నాయి.

Dandugula Srinivas

7661066999