(దండుగుల శ్రీనివాస్)
పవన్ తిక్కకు తగ్గట్టే తీర్చిదిద్దాడు హరీశ్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్‌ను. దీనికి తన పైత్యాన్ని రంగరించాడు. అతీతశక్తులు ఆపాదించేశాడు హీరోకు షరా మామూలుగా. కామెడీ మిస్ అయ్యింది. బీజీఎం రణగొణ ధ్వనులతో థమన్ కర్ణభేరిలను పగలగొట్టేశాడు. పాటలకంత సీన్ లేదు. ఈ మనసే సే.. సే.. తొలిప్రేమ పాటను ఉన్నదున్నట్టు దించేశాడు. బీజేపీకి అనుకూలమైన సీన్లు, డైలాగులు చేర్చారు. రాజకీయంగా కాంట్రవర్సీలకు పోలేదు. హీరోను ఎలివేట్ చేసేందుకు సీన్లు క్రియేట్ చేసుకుంటూ పోయాడు హరీశ్. రాశీకన్నా పాత్రకు అర్థం లేదు. శ్రీలీల డ్యాన్సులకు నిజంగానే పవన్ భయపడ్డాడు. అందుకే డ్యాన్సులకు ఆమెను దూరం పెట్టి.. పవన్‌తో బలవంతంగా స్టెప్పులేయించాడు. దేఖ్లేంగే సాలా…. పాటకు దేవీ ప్రసాద్ ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చినా.. దానికి న్యాయం చేయలేక పోయాడు పవన్. డైలాగులు తనే రాసుకున్న హరీశ్.. త్రివిక్రమ్ మార్కును కాపీ కొట్టేందుకు ప్రయత్నించి ప్రతీ డైలాగులో ప్రాసలకు ప్రయాస పడ్డాడు.
కానీ అవి అంతగా కిక్కునియ్యలేకపోయాయి. పాతబస్తీలోకి వెళ్తున్నావ్… బొట్టు తీసేయ్.. అంటే.. నేను పాకిస్తాన్‌కు వెళ్లడం లేదనే అసందర్భ, మతచిచ్చు భావోద్వేగాల డైలాగులు అక్కడక్కడా పంటికింద రాయిలా తగిలాయి. శ్రీలీలకు బదులుగా ఆమె స్నేహితురాలిని రేప్ చేసే సీన్.. ఆమె చేత చెప్పించిన డైలాగులు అంత ఘోరంగా చూపడం అవసరం లేదు. సినిమాలో శ్రీలీల కనిపించిన సీన్లే కాస్త ఆహ్లాదాన్నిచ్చాయి. సినిమా అంత రణగొణ ధ్వనులు, తుపాకుల మోతలు.. ఆ చప్పుళ్లలో కలిసి పోయిన ప్రాసల డైలాగులు ఇవే అన్నీ. హీరో చేత భారీ డైలాగులు. సందేశాలు. ఒళ్లు అలవకుండా, చొక్కా నలగకుండా చేసే ఫైట్ సీన్లు.. ఇవి కామన్ పీపుల్‌కు పెద్దగా ఎక్కేవి కావు కానీ, అభిమానులకు మాత్రం ఉస్తాద్ అచ్చమైన ఉగాది పండుగే అయింది. పవన్ అన్నట్టుగా .. దర్శకుడిది భారతదేశం గర్వించదగ్గ స్థాయి మాత్రం కాదు. మూసలో పడి కొట్టుకుపోయి.. హీరోల ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయిన ఓ ఆర్డినరీ డైరెక్టర్ మాత్రమే. నాతో ఇంకా ఇంకా సినిమాలు తీయొచ్చు అని పవన్ ఆఫర్ ఇచ్చాడు… ఇకపై కూడా పవన్ నుంచి ఇలాంటి సినిమాలే వస్తాయి. అంతకు మించి ఊహించొద్దు. ఆశించొద్దు. ఇది చాలు అభిమానుల జీవితాలకు. అంతే.

Dandugula Srinivas
7661066999
