వాస్తవం ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్:
డీఎస్ పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్.. కాంగ్రెస్ పార్టీని వీడేందుకు రెడీ అయ్యాడు. నిజామాబాద్‌లో బలమైన మున్నూరుకాపు సామాజికవర్గ కులంలో ఉన్న కారణమొకటైతే.. తాను డీఎస్ తనయుడిని కదా? ఇదేనా దివంగత డీఎస్‌కు అధిష్టానం ఇచ్చిన మర్యాద ? అని సంజయ్ ప్రశ్నిస్తున్నాడు. కానీ డీఎస్ జీవిత చరమాంకంలో ఇద్దరు కొడుకుల మధ్య నలిగిపోయాడు. చిన్న కొడుకు అర్వింద్ బీజేపీలో ఉన్నాడు. తన తండ్రి కూడా బీజేపీలో ఉన్నాడని ప్రచారం చేసుకున్నాడు. పెద్ద కొడుకు అనారోగ్యంగా ఉన్న తండ్రిని హడావుడిగా గాంధీభవన్ తీసుకుపోయి కాంగ్రెస్ కండువా కప్పించాడు. అంతకు ముందు డీఎస్ .. కేసీఆర్ మాటలు విని బీఆరెస్‌లో చేరడమే అతిపెద్ద తప్పు. ఆయన రాజకీయ జీవితంలో అదో మచ్చగా మిగిలిపోయింది.
ఈ తరుణంలో కూడా చిన్న కొడుకు అర్వింద్.. నాన్నను నీడలా వెంటాడాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరలేదని బలవంతంగా ప్రకటన చేయించాడు. ఇంటి లొల్లి రచ్చకెక్కింది. డీఎస్ తన జీవిత చరమాంకంలో ఇద్దరి కొడుకుల మధ్య తీవ్ర మానసిక క్షోభకు గురై తనువు చాలించాడు. డీఎస్ విగ్రహం ఏర్పాటు చేయించే విషయంలో కూడా అదే రచ్చ. పెద్ద కొడుకు సంజయ్‌కు ఆహ్వానం లేదు. డీఎస్ విగ్రహానికి బీజేపీ రంగు పులిమాడు అర్వింద్. వీరిద్దరి చేష్టల వల్ల డీఎస్ రాజకీయ ఆనవాళ్లే లేకుండా చేసే ప్రయత్నం జరిగింది తప్ప… ఇద్దరూ తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకోలేదు. ఇక ఇప్పుడు సంజయ్ తన తండ్రి పరపతి, కాంగ్రెస్ అధిష్టానం.. అంటూ అస్త్రాన్ని ఉపయోగిస్తున్నాడు. కానీ దీన్ని అధిష్టానం పెద్దగా పట్టించుకునే స్థితిలో లేదు. ఎందుకంటే డీఎస్ చివర ఘడియల్లో తీసుకున్న నిర్ణయాలు, జరగిన సంఘటనలే. ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్. దీన్ని కాదని సంజయ్ బయటకు పోతే.. మర్యాద రామన్న సినిమాలో గడప లోపు ఉన్నంత వరకే సేఫ్టీ అనే విధంగానే ఉంటుంది.
ఎందుకంటే కాంగ్రెస్లోఉంటే కనీసం తండ్రి పేరు చెప్పుకుంటే పరువన్నా దక్కుతుంది! పనులన్నా అవుతాయి. మర్యాదైనా నిలుస్తుంది. ఇవ్వడానికి ప్రయత్నమైనా చేస్తారు.. కానీ గడప దాటితా అని బెదిరిస్తే.. అది కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టే. అయినా ఇప్పుడు ఏ పార్టీలోకి పోతాడు సంజయ్. బీఆరెస్ అధికారంలో ఉన్నప్పుడు లైంగిక ఆరోపణల కేసులో జైలుకు పోయి వచ్చాడు. మరి కేటీఆర్ చేరదీస్తాడా? కేసీఆర్ వల్ల ఓ సారి జరిగిన నష్టం ఈ ఇద్దరికి అంతా ఇంతా కాదు. మరి కవిత పెట్టబోయే పార్టీలోకి పోతాడా? లైంగిక ఆరోపణలు, జైలు.. సంజయ్ వ్యవహార శైలి ఆ కొత్త పార్టీకి కలసి వస్తుందా? కేవలం కులబలమే చూస్తారా? అదే చేస్తే.. ఆ బలాన్నే చూస్తే.. సంజయ్ వెనుక వచ్చే ఆ కులబలమెంత? ఇప్పుడు ఇవీ చర్చకు తెరలేపుతున్న అంశాలు.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
