(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఆంధ్ర‌లో అమ‌రావ‌తి గ్రాఫిక్స్‌ను మించిన బొమ్మ‌లు మూసీ సుంద‌రీక‌ర‌ణ పేరిట క‌నిపిస్తున్నాయి. జ‌నాల‌కు ఈ స‌ర్కార్ గ్రాఫిక్స్ అందాల‌ను క‌నుల విందుగా చూపుతున్నాయి. అబ్బా ఇంతందంగా చేస్తారా? మ‌రెందుకు ఇవ‌న్నీ అడ్డంకులు.. ? అని కామ‌న్ పీపుల్ కూడా అన‌మాన‌ప‌డేలా.. స‌ర్కార్‌ను మెచ్చుకునేలా అద్బుత‌మైన క‌వ‌రింగు, క‌ల‌రింగు ఇస్తున్నారు. ఇవాళ క‌విత ప్రెస్‌మీట్ పెట్టారు. మూసీ పున‌రుజ్జీవం మీద.. స‌ర్కార్ చెబుతున్న లెక్క‌లు, నిబంధ‌న‌లు, సాకులు, విమ‌ర్శ‌లు, స‌మ‌ర్థింపులు.. అన్నీ చెబుతూనే త‌న అధ్య‌య‌నాన్ని స‌వివ‌రింగా ఆమె జనం ముందుంచారు. ఈ క్ర‌మంలో ఆమె ఓ ప‌దం వాడారు. స‌ర్కార్ నుంచి డిజిట‌ల్ దుర్వాస‌న వ‌స్తోంద‌ని. అవును.. సోష‌ల్ మీడియాలో ఆ కాంగ్రెస్ వారియ‌ర్స్‌ను మించి హైడ్రా దీన్ని భుజానికెత్తుకున్న‌దేమో అనిపించేలా. క‌విత చెప్పిన పాయింట్లు, లేవ‌దీసిన ప్ర‌శ్న‌లు, నిల‌దీసిన టెక్నిక‌ల్ ఇష్యూలు.. ఇప్పుడు స‌ర్కార్ ముందున్నాయి. స‌మాధానం చెప్పాల్సిన అనివార్య‌త‌ను క్రియేట్ చేశారు. లేదా జ‌నం ముందు అదే ప‌నిగా ఎన్ని గ్రాఫిక్సుల చేసినా, ఎంత మాయాజాలం చేసినా అది డిజిట‌ల్ దుర్వాస‌నే అవుతుంది. మూసీ దుర్వాస‌న మాత్రం పోదు. క‌విత స‌ర్కార్ ముందుంచిన ఎనిమిది పాయింట్లు, ప్ర‌శ్న‌లు.. ఇవే..!

పాయింట్ నెం.1

సుంద‌రీక‌ర‌ణ పేరుతో చేస్తున్న ఈ కార్య‌క్ర‌మానికి డీపీఆర్ ఏదీ? ఇప్ప‌టి వ‌ర‌కు స‌ర్కార్ ఆ డీపీఆర్‌ను ప్ర‌జ‌ల ముందుంచ‌లేదు. ఇందులో మర్మ‌మేంటీ? ఇప్పుడు సీఎం చెప్పింది మొద‌టి ఫేజ్ లెక్క‌లు, ఆ ప్ర‌ణాళిక‌లే. దాని ప్ర‌కారం కూడా గ‌తంలో ఇచ్చిన అంచ‌నా విలువ‌కు ఇప్పుడు చెప్పిన అంచ‌నా విలువ‌కు రూ. 1400 కోట్లు పెరిగింది ఎందుకు?

పాయింట్ నెం.2

ఒక వేళ గాంధీ విగ్ర‌హ‌మే పెట్టాల‌నుకుంటే దాని మొత్తాన్ని చాల త‌క్కువ‌గా చేసి సీఎం చెబుతున్నారు. ఆఫ్ట్రాల్ రూ. 70 కోట్ల నుంచి రూ. 200 కోట్లు అంటున్నాడు. వీటితో పేద‌ల‌కు ఎంత మేలు చేయొచ్చో తెలుసా సీఎం? ఆ దిశ‌గా ఎప్పుడైనా ఆలోచించావా? స‌రే, గాంధీ బొమ్మ కోసం ఓ రెండు వంద‌ల కోట్లు పెడ్తార‌నుకో.. మ‌రి ఇంకా రూ. 1200 కోట్లు ఎవ‌రికిస్తున్నారు? ఎటు పోతాయి?

పాయింట్ నెం3

మొత్తం మూసీ న‌దీ తీరం వెంబ‌డి ఫార్మా కంపెనీల నుంచి ఇత‌ర మార్గాల నుంచి మురికి, వ్య‌ర్థాలు, విష‌పూరిత నీరు 16 నాలాల ద్వారా వ‌చ్చి మూసీలో చేరుతున్న‌ది. దీన్ని నిలువ‌రించేందుకు మీరు చేప‌ట్టిన చ‌ర్య‌లేమిటి? ఓ నాలుగు ఎస్టీపీలు నిర్మిస్తున్నామ‌ని చెప్పి చేతులు దులుపుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వీటి ద్వారా అంత‌టి మురిని నీటిని శుద్ది చేయ‌డం సాధ్య‌మవుతుందా? ముందు దీని గురించి ఎందుకు ఆలోచించ‌డం లేదు?

పాయింట్ నెం. 4

మ‌ల్ల‌న్న సాగ‌ర్ నుంచి గోదావ‌రి నీటిని తెచ్చి మూసీని నింపుతామ‌న్నారు. కొండ‌పోచ‌మ్మ సాగ‌ర్ అంచ‌నాను రూ. 1100 కోట్ల నుంచి రూ. 7వేల కోట్ల‌కు పెంచారు. ఆ ప‌నులు మొద‌లు పెట్టారా? మ‌రి గోదావ‌రి నీళ్లు ఎక్క‌డ్నుంచి వ‌స్తాయి? దీనికి స‌మాధానం చెప్ప‌రెందుకు?

పాయింట్‌నెం. 5

జియాగూడ‌లో గొర్లు కోసి వ్య‌ర్థాలు మూసీలో వేస్తున్నారు. స్లాట‌ర్ హౌజ్‌లేదు. మూసీ చుట్టూ సిబ్బందిని ఎందుకు పెంచ‌డం లేదు? ముందు ఈ వ్య‌ర్థాలు మూసీల‌కు పోకుండా కాపాడండి. ఐదారు వేల కోట్లు అని బాకా ఊదుతూ ప్రాక్టిక‌ల్ అంశాల‌ను విస్మ‌రిస్తున్నారు. మూసీ క‌బ్జా కాకుండా చూడాలె. వ్య‌ర్థాలు అందులోకి రాకుండా ఆపాలె. మూసీ డెవ‌ల‌ప్‌మెంట్ పేరుతో 1430 ప్రాప‌ర్టీస్‌ను ప‌డ‌గొడుతున్నారు. వారితో ఎందుకు చ‌ర్చిస్త‌లేదు స‌ర్కార్‌? ఎందుకు రేట్ గురించి మ‌ట్లాడ‌త‌లేరు?

పాయింట్ నెం. 6

మొత్తం ఫేజ్1 కే రూ. 7వేల కోట్లు అంటున్నారు. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ లెక్క వేరు. భూ సేక‌ర‌ణ‌కు అయ్యే ఖ‌ర్చు వేరు. ఎస్టీపీల నిర్మాణాల‌కు అయ్యే ఖ‌ర్చూ వేరే. సీఎం చెబుతున్న ఫేజ్‌1 మూసీకి ఇవ‌న్నీ అద‌నం. వీటికి డ‌బ్బులెక్క‌డివి? ఎక్క‌డ్నుంచి తెస్తారు? డ‌బ్బుల్లేంది ఇవ‌న్ని ప‌నులు ఎట్లా అవుతాయి? టోట‌ల్ డీపీఆర్ ఇవ్వ‌కుండా జ‌నాల‌ను మ‌భ్య‌పెట్ట‌డం కాదా?

పాయింట్ నెం.7

రూ. 17వేల కోట్ల‌తో మూసీ పున‌రుజ్జీవం చేస్తామ‌ని కేసీఆర్ స‌ర్కార్ అంటే.. 2017లో ఎన్విరాన్‌మెంటల్ బోర్డు ఈ ప్ర‌పోజ‌ల్‌ను రిజెక్టు చేసింది. 30 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల మేర ఇక్క‌డ కడితే ఇబ్బందులొస్తాయ‌ని చెప్పింది. అదే సంస్థ ఈ స‌ర్కార్‌కు ఎలా ప‌ర్మిష‌న్ ఇచ్చింది? ఫేజ్‌1లో 18 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగులని ఇప్పుడు ఈ స‌ర్కార్ ప్ర‌పోజ‌ల్ పెట్టింది. ఈ గ్రాఫిక్స్ మాయాజాలం ఏందీ? జాదూ మంత‌ర్ ఏందీ? పార‌ద‌ర్శ‌క‌త ఏదీ?

పాయింట్ నెం.8

హైడ్రా పేరిట 30 మీట‌ర్ల‌లోపు ఇళ్ల‌న్నీ కూల‌గొడ్తున్నారు. జాగృతి ఆధ్వ‌ర్యంలో ఇటీవ‌ల ఓ ప్రైవేటు సంస్థ మూసీ న‌ది మ‌ధ్య‌లో ఉన్న‌ద‌ని ధ‌ర్నా చేస్తే.. హైడ్రా 5 వీడియోలు పెట్టిండ్రు. రంగ‌నాథ్ కు 6 ఫిర్యాదులు ఇస్తే యాక్ష‌న్ తీసుకోలే. పేద‌ల ఇండ్లే కొడుతున్నారు. పెద్ద‌ల జోలికి పోతలేరు. హైడ్రా రాకుమందే దీనికి ప‌ర్మిష‌న్లు ఇచ్చార‌ని రంగ‌నాథ్ అన్నారు. అక్టోబ‌ర్ 22, 2025 రంగ‌నాథే స్వ‌యంగా ఎమ్మార్వోకు రాసిండు. ఏమ‌ని? ఈ బిల్డింగు 0.37 ఎక‌రాలు క‌బ్జా చేసిండ్రు.. క‌నీసం నాలా డైవ‌ర్టు చేయ‌కుండా క‌ట్టిండ్రు.. ఆ క‌ట్ట‌డం ద్వారా కోకాపేట్‌, నార్సింగి ఏరియాలో వ‌ర‌ద‌లొచ్చాయ‌ని. ఇది ఆప‌క‌పోతే.. జ‌నాల‌కు ప్ర‌మాదం ఉందని కూడా రాశారు. ఇప్పుడు ఎదురుదాడి చేస్తారా? మీరు గ్రాఫిక్ డిజైన‌రా? ద‌మ్ముందా బ‌ల్డోజ‌ర్ తీయ్‌.. ఆదిత్య ప్రాప‌ర్టీస్‌కు పోదామా?

 

Dandugula Srinivas

Senior Journalist

7661066999