(దండుగుల శ్రీనివాస్)
క్యాలెండర్ మారింది. ఉగాది వచ్చింది. అంతే. జీవితాల్లో మార్పులు రాలేదు. ఇంకా దుర్బరంగానే మారాయి. కానీ మనం రాశిఫలాలు చూసుకుంటాం. పంచాంగ శ్రవణం వింటాం. ఈసారైనా బతుకులు మారుతాయా? అని. ఆశగా. అవన్నీ ఆశలేనని తెలిసినా. స్వరాష్ట్రంలో ఇక్కడి ప్రజల జీవితాలు మారుతాయనుకున్నారు. కానీ అప్పుల ఊబిలో మరింతగా చిక్కుకుపోయారు. వీరు కాకపోతే వారు.. వారు కాకపోతే వీరు.. ఎవరి మారినా.. ఎవరు వచ్చినా జీవితాల్లో పెద్దగా మార్పులేం లేవు. అలా ఆశించి భంగపడ్డ జీవితాలే. ఆ భంగపాటును జీవితంలో ఓ భాగంగా చూసుకుని సర్ది చెప్పుకుని కాంప్రమైజ్ అయ్యే కాలమిది. అంతే. అందుకే ఆదాయం అంతంతే. అది ఇంకా లోతుల్లోకి పడిపోతుండగా.. ఖర్చు మాత్రం ఆకాశానికి తాకుతున్నది. పెరుగుతున్న బంగారం ధరలెక్క. ఆ బంగారం ఇప్పుడు మెడలో ఉండటం లేదు. మార్వాడీల తాకట్టు దుకాణాల్లో భద్రంగా ఉంది.
ముత్తూట్, మణప్పురం లాకర్లలో భద్రంగా ఉంది. అయితే మిత్తీ కట్టాలే, లేదంటే వేలంలో ఉన్నది పోగొట్టుకోవాలె. ఇవే తిప్పలు తెలంగాణ జనానికి. స్వరాష్ట్రం వచ్చిన కాడి నుంచి. ఏటికేడాది అవింకా పెరుగుతున్నాయే తప్ప… తగ్గడం లేదు. ఉచితాలెన్ని పెట్టినా.. జీవన ప్రమాణాలు పెంచే మార్గాలు వెతకని రాజకీయాలు ఇక్కడ తిష్ట వేశాయి. ఉపాధిని పెంచే విధానాలకు పాతరేసి.. మళ్లీ ఎన్నికల్లో ఎట్లా గెలవాలో పోటీలు పడి మ్యానిఫెస్టోలు తయారు చేసే కంపెనీలుగా అవి మారాయి. అందుకే ఇక్కడి జీవితాలు యాంత్రికంగా మారాయి. యంత్రాల్లా పనిచేసుకుంటూ .. అదీ లేనప్పుడు తుప్పు పడుతూ ఉన్నాయి. తప్పులు వెతుకుతూ ఉన్నాయి. సంపాదన లేనప్పుడు, ఆదాయమనే మాటకే అర్థం మరిచిపోతున్నప్పుడు ఇంట్లోనే మర్యాదదక్కనప్పుడు .. రాజ్యపూజ్యం ఎలా ఉందోచూసుకోవడమెందుకు దండగా.. అనుకుంటున్నారు. అందుకే ఆదాయం, వ్యయం చూసుకుంటున్నారు. ఎ
ట్లాగూ ఆదాయం పెరగదు కానీ, ఖర్చు ఎంతుందోననే భయం, ఆత్రుతతో కొత్త పంచాంగాన్ని చదివేశారు. ఇంకెన్ని అప్పులు చేయాలో లెక్కలేసుకుంటున్నారు రాశి ఫలాలననుసరించి. తమ తలరాతలు ఎలా ఉండబోతున్నాయో అంచనా వేసుకుంటున్నారు పంచాంగ ఫలాలను బట్టి. కానీ ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చేసింది. పంచాంగాలెన్ని మారినా.. జీవితాలు విషాదం నుంచి బయటపడే మార్గాలు లేవని. అలవాటైన ఈ విషాద జీవితంలో చిటికెడైనా ఆనందం దొరక్కపోతుందా అని వెతుక్కంటున్నారు అల్పసంతోషులుగా. అలవాటైన దోరణిలో. షరా మాములుగా. ప్రతీ ఏడాది మాదిరిగానే.

Dandugula Srinivas
7661066999
