(దండుగుల శ్రీనివాస్)
వాళ్లంతా ఏపీ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌లు. తెలంగాణ ఏర్పడగానే ఏపీకి వెళ్లిపోవాలి. కానీ వెళ్లలేదు. అప్పటి సీఎం కేసీఆర్ కూడా పరిపాలన పరంగా వీరంతా ఇక్కడే ఉండాలని పట్టుబట్టాడు. కేంద్రంతో తొలత మంచి సంబంధాలే నెరిపిన కేసీఆర్.. వీరిని ఇక్కడే కొనసాగేలా చేసుకున్నాడు. వీరు కోర్టుకు కూడా వెళ్లారు. మన హైదరాబాద్‌ను వదిలవెళ్లాలని వారికి లేదు. దీంతో పాటు ఇక్కడ కేసీఆర్ కు అత్యంత దగ్గరగా ఉన్న ఐఏఎస్ కు టీమ్‌గా ఉన్నందున మంచి పొజిషన్‌లో ఉండవచ్చనే భావనలో ఇక్కడే తిష్టవేశారు. కానీ ఇప్పుడు కేంద్రం వీరిపై నజర్ పెట్టింది. వీరిని ఆంధ్రకు వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇక వెళ్లక తప్పని పరిస్తితి.
నేడో రేపో హైదరాబాద్‌ను వదిలి ఆంధ్రాకు పయనం కావాల్సిన ఐఏఎస్‌లలో స్మితా సబర్వాల్, రోనార్డ్ రోస్, వాణి ప్రసాద్, ఆమ్రాపాలి, మల్లెల ప్రశాంతి, వాకాటి కరుణలతో పాటు ఐపీఎస్‌లు అంజనీ కుమార్, అభిషేక్ మహంతీలను కూడా ఈనెల 16లోగా ఆంధ్రలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది డీవోపీటీ. ఇక అక్కడ ఉన్న ఐఏఎస్‌లను కూడా ఇక్కడకు రావాల్సిందిగా కోరింది. ఇక్కడికి వచ్చే వారిలో ఎస్ఎస్ రావత్, అనంతరామ్, సృజన, శివశంకర్‌లున్నారు. అయితే ఇప్పటి వరకు ఆంధ్రాకు చెందిన ఐఏఎస్‌లు ఇక్కడే తిష్ట వేయడంతో ఇప్పటికే ఐఏఎస్‌లుగా కన్వర్డ్ కావాల్సిన 17 మందికి చాన్స్ దొరకలేదు. ఇప్పుడు తెలంగాణలో 17 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఐఏఎస్‌లు కావడానికి మార్గం సుగమమైంది. మనోళ్లకు కలెక్టర్ పదవులు రానున్నాయి.