(దండుగుల శ్రీనివాస్)
పరాభవ నామ సంవత్సరం ఉగాదికి ఒక రోజు ముందు బీఆరెస్‌కు తన ప్రసంగంతో పరాభవం పాలు చేసిండు సీఎం. షడ్రుచులను అసెంబ్లీ వేదికగా రుచి చూపించిండు. గవర్నర్ ప్రసంగంపై ప్రధాన ప్రతిపక్షం బీఆరెస్ తీసుకున్న స్టాండ్, మాట్లాడిన తీరుపై అగ్గిమీద గుగ్గిలమే అయిండు. ఏకధాటిగా మూడు గంటల పాటు తన ప్రసంగం ధాటితో ప్రతిపక్షానికి చుక్కలు చూపించిండు. తాను గుక్క తిప్పుకోకుండా మాట్లాడి బీఆరెస్ గొంతెండిపోయేలా చేశాడు. ఆరు రుచుల సమ్మేళనాన్ని పంచాడు. ఉగాదికి ఒకరోజు ముందే అసెంబ్లీలో పరాభవ పచ్చడిని తినిపించాడు. ఇక ఈ ఏడాదంతా ఇట్లనే ఉంటది మీకు అని సింబాలిక్‌గా తెలియజేశాడు. అనేక అంశాలపై సీఎం అనర్గళంగా మాట్లాడి మరోసారి తన విశ్వరూపాన్నే చూపాడు. బీఆరెస్ పదేళ్ల పాపాలు, లోపాలు ఎత్తి చూపడంతో పాటు.. తమను అసెంబ్లీలో నిలదీసేంత సీన్ ఇంకా ఆ పార్టీకి లేదని, రాదని, ఆ అవసరం రానీయమని చెప్పిన సీఎం.. వచ్చే సాధారణ ఎన్నికల్లో మిమ్మిల్ని మరోమరు తొక్కి అధికారంలోకి వచ్చి చూపుతానని శపథం చేశాడీ వేదికగా. ఇదే నా సవాల్.. కాసుకోండని, రాసిపెట్టుకోండని అల్టిమేటం జారీ చేశాడు.
హామీల అమలు నుంచి మొదలు పెట్టి, సర్కార్ సంస్కరణలను ఏకరువు పెట్టి.. బీఆరెస్ డీఎన్ఏ ఇదేనని ఎత్తిచూపి, కృతజ్జత, విశ్వాసం లేని వ్యక్తిత్వం వారిదని క్లారిటీ ఇచ్చి.. అప్పుల చిట్టా విప్పి.. చెల్లెను అవమానించిన అన్న అంతరంగాన్ని ఆవిష్కరించి. ఆరు రుచులు ఎట్లుంటయో చూపి పరాభవాన్ని చవిచూపాడు సీఎం.
లిక్కర్ రాణి అని మీ వాళ్లతోనే అనిపించావు సిగ్గులేదా? అని కేటీఆర్‌ను తిట్టినప్పుడు, మహిళల పట్ల రామన్నకు ఉన్న కమిట్‌మెంట్ ఏంటో.. తను నోరు జారిన సన్నివేళాను మరోసారి గుర్తు చేసినప్పుడు ఆ పార్టీ నేతలకు కూడా అవును కదా.. సీఎం చెప్పింది నిజమే కదా అని అనిపించింది. అప్పుల చిట్టా విప్పి.. ఇప్పటి వరకు తాము చేసిన అప్పేందో.. పదేళ్లలో చేసిన అప్పుకు మిత్తీ, అసలు కడ్తున్నదెంతో వివరించిన వైనం అందరికీ అవగాహన కల్పించింది. మొత్తంగా, నికరంగా సర్కార్ ఇప్పటి వరకు జనం మీద అప్పు తెచ్చి ఖర్చుపెట్టింది ఎంతో కూడా వివరించిన వైనం సర్కార్ నిజాయితీకి అద్దం పట్టింది.
తెలంగాణ తెచ్చింది సోనియేనని కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చెప్పినప్పుడు, ఆ కేసీఆర్ చూపిన కృతజ్ఞతలో అణువంత కూడా కేటీఆర్‌కు లేదని, అసలు అతడు మనిషే కాదన్నాడు సీఎం. కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేసేందుకు ఇంకెవరో అవసరం లేదని, కొడుకు చాలన్న రేవంత్… బావ మాటలు, నటనకు ట్రాప్‌లో పడిపోయిన కేటీఆర్ దెబ్బతినక తప్పదని హితబోధ చేశాడు. అహంకారం మా జన్మహక్కనే విధంగా కేటీఆర్ ప్రవర్తిస్తున్నాడని, ఆ జాతికి నియ్యతి లేదని పనిలో పనిగా ఆ కులాన్ని దునుమాడాడు సీఎం. ఆ కుటుంబమే రాజ్యాధికారం చేయాలని భావించి, ఆశించి భంగపడ్డ తీరును వివరిస్తూనే జనం ముందు ఆ పార్టీ, పాలన, నేతలు ఎలా పరాభవమయ్యారో..? ఎందుకు పరాభవం పాలయ్యారో వివరించి.. ఇక భవిష్యత్తులో ఆ పార్టీకి పరాభవమే దిక్కని చెప్పకనే చెప్పారు సీఎం పరాభవ నామ సంవత్సరం సాక్షిగా. అసెంబ్లీ వేదికగా.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
