వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్:
తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలంటే కేబినెట్ మీటింగులు సెక్రటేరియట్‌లోనే జరపాలని, అప్పుడే మర్యాదగా ఉంటుందని, మంత్రులను గౌరవించినట్టవుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అప్పుడు ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో కేబినెట్ మీటింగులు జరిగేవని, ఇప్పుడు కాంగ్రెస్ ఢిల్లీలో జరుపుకుంటున్నదని కవిత చురకలంటించారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రెస్‌మీట్లో ఆమె మాట్లాడారు. ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో హామీల అమలుకు నిధులు కేటాయించాన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వం ఈ మేరకు బిల్లు పెట్టిందని, గవర్నర్ దాన్ని ఆమోదించలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని ఆమె గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికులు శ్రమ దోపిడీకి గురి అవుతున్నారన్నారు. ఆర్టీసీలో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాని డిమాండ్ చేశారు. ఫ్రీ బస్సులు ఎవరి కోసం ఎందుకోసం పెట్టారని ప్రశ్నించిన ఆమె.. ఫ్రీ బస్సులు పెట్టి బస్సుల సంఖ్యను ఎందుకు పెంచలేదన్నారు. ఆర్టీసీపై ప్రభుత్వం శ్వేత పత్రం రిలీజ్ చేయాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో 52 రోజులు సమ్మె జరిగి 33 మంది కార్మికులు చనిపోయారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ యూనియన్లను రద్దు చేస్తే కాంగ్రెస్ వచ్చాక పునరుద్ధరిస్తామన్నారని ఇచ్చిన మాటలన్నీ సీఎం మరిచిపోయారని విమర్శించారు. ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కాకుండా పర్మినెంట్ ఉద్యోగులను తీసుకోవాలని, రవాణాశాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ భాద్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 24 న ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన ఛలో సెక్రటేరియేట్ కార్యక్రమానికి జాగృతి మద్దతు తెలుపుతున్నట్టు ఆమె ప్రకటించారు. ఆర్టీసీకి ఛైర్మన్, యూనియన్లు లేకపోవటంతో అధికారుల జులుం భరించలేని పరిస్థితికి చేరిందని, ప్రభుత్వం దిగి వచ్చే వరకు జాగృతి ఆర్టీసీ తరఫున పోరాడుతూనే ఉంటుదని, ఆర్టీసీని రక్షించుకునేందుకు అందరం ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.
