(దండుగుల శ్రీనివాస్)
సీఎంవో నుంచి ఓ ప్రకటన విడుదలైంది. రైతులకు శుభవార్త అంటు. ఏమై ఉంటుందబ్బా… అనుకున్నారు. ఈ సమయంలో సర్కార్ నుంచి రైతులకు శుభవార్తా? ఆశ్చర్యంతో కూడిన అపనమ్మకం తోడై ఏందని ఆరా తీస్తే.. రైతు భరోసా వేస్తున్నారట. ఇది శుభవార్తా? అవును. పత్రికలు కూడా అట్లనే రాసుకున్నయి. ఇదెందుకు శుభవార్త కావాలె. కచ్చితంగా ఇది శుభవార్తే అవుతుంది. అవును మరి. పడతాయో పడయో తెలియదు. ఎప్పుడేస్తారో, ఎంతేస్తారో తెల్వదు. ఎన్ని ఎకరాలకు వస్తాయో ఎప్పుడు వస్తాయో అనుమానం. ఇవన్నీ టెన్షన్లు, ప్రశ్నలు, అనుమానాల నడుమ సర్కార్ నుంచి ఓ ప్రకటన రావడమంటే శుభవార్తే కదా! అది రైతులకు ఊపిరిపోయే వార్తే కదా. అప్పులు ఊబిలో చిక్కుకు విలవిల్లాడే కొంచెం ఊరటే కాదా?
సర్కార్ రాగానే ఎన్ని సీజన్లు వేస్తుందో, ఎన్ని సీజన్లు ఎగ్గొడుతుందో రైతు దగ్గర లెక్కల్లేవు. మీరిస్తున్నారు.. మేం తీసుకుంటున్నాం బాంచన్! అంతే. ఇప్పటికీ రెండు సీజన్లు ఎగ్గొట్టింది సర్కార్. గత ఏడాది జూన్‌లో ఒకేసారి 9వేల కోట్లు అని ఆర్బాటం చేసినా.. ఆ తరువాత మళ్లీ అదే తంతు. ఊరించి ఊరించి, ఇప్పుడిట్ల ఏడాదికి. అదీ విడతల వారీగా. అయినా సరే అర్హులందరికీ వేయండి సారు.. అని ప్రాదేయపడటమే కదా రైతులు చేసేది. నేను వేస్తున్నా.. కానీ ఎంత మందికి పడుతున్నాయో లేదో నాకు తెల్వదు అని సీఎం సారే అంటుంటే.. ఆ పైసలు తమ ఖాతాలో టింగు టింగు అని పడకున్నా.. టకీ టకీ మని లేటుగా పడ్డా సరే సారు.. పడాలి. మీ దయ మీ బాంచన్.
అవునూ… దీనికి కూడా ఓ వేదిక కావాలె. నిధులు విడుదల చేసేందుకు ఓ ఆర్బాటపు మీటింగొకటి ఉండాల్నా? ఇదేమైన్నా కొత్త పథకమా? లేకపోతే మ్యానిఫెస్టోలో చెప్పినట్టు ఎకరానికి 15వేలు చేస్తున్నాడా? అన్ని అనుమానాలొద్దు గానీ.. ఇన్ని వేల కోట్లు ఏస్తుంటే.. మనది మనం చెప్పుకోకపోతే ఇంకెవడు చెప్తాడే రాములా! అంతే ఇదో పీఆర్ స్టంట్. రైతులకు ఇంత చేస్తున్నాం.. చెప్పుకుంటే తప్పేముంది? చెప్పుకోవాలె. డప్పుకొట్టి మరీ. ఇప్పటికే లేటు చేశారుగా సారు.. మళ్లీ సాగదీస్తూ ఇప్పుడు కొంత.. ఇరవై రోజులకు ఇంకొంత… ఆపై ఆపై మరికొంత.. ఎందుకు సారు..? అని అడిగేరు. అసలే ఆడ బడ్జెట్ డొల్లా. ఇంకా అడిగితే.. గా కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పు.. దాని వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ…… ఆ ప్రసంగం వింటారా? ఇచ్చింది తీసుకుని .. ఎవుసం పనులు చేస్కోర్రి గప్‌చుప్‌గా. ఆయ్……!
అవునూ..అసెంబ్లీ సెషన్స్ ఇయ్యాల్టినుంచే కదా!

Dandugula Srinivas
Senior Journalist
7661066999
