(మ్యాడం మధుసూదన్-
సీనియర్ పాత్రికేయులు)
ఆదాయం తక్కువ.. అప్పులెక్కువ.. మరికొన్ని రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇదీ. అప్పుల భారం అంతకంతకు పెరిగి ప్రభుత్వానికి గుదిబండగా మారుతున్నది. రెవిన్యూ లోటు కూడా విపరీతంగా పెరిగిపోయింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజాగా విడుదల చేసిన ఆర్థిక నివేదిక ఆందోళన కలిగిస్తున్నది.
మొత్తం రెవిన్యూ ఆదాయం అంచనాలో జనవరి నెలాఖరు నాటికి రాబడి 60 శాతం కూడా మించలేదు. రియల్ ఎస్టేట్ ఆదాయం ఏమాత్రం పెరగలేదు. ఎక్సైజ్ ఆదాయం ఎప్పటిలాగే రాష్ట్ర ఖజానాను ఆదుకుంటున్నది. ఆదాయంలో సింహభాగమైన జీఎస్టీ రాబడి 72 శాతానికి చేరి గుడ్డిలో మెల్ల అన్న తీరులో కొంత ఆశను రేకెత్తిస్తున్నది. రియల్ ఎస్టేట్ ఆదాయం 64 శాతానికి మించలేదు. పన్నేతర ఆదాయం నామమాత్రమే. మొత్తం రెవిన్యూ రాబడుల్లో రూ. 2.29 లక్షల కోట్లు ఉంటాయని అంచనా వేయగా.. జనవరి నెలాఖరు నాటికి రూ. 1.38 లక్షల కోట్లు మాత్రమే సమకూరింది. ఇది మొత్తం అంచనాలో 60 శాతంగా ఉంది.
ఇక, రాష్ట్ర పన్నుల రాబడి రూ. 1.75 లక్షల కోట్లు అంచనా వేయగా.. జనవరి నెలాఖరు నాటికి రూ. 1.26 లక్షల కోట్లు సమకూరింది. మొత్తంలో ఇది 72 శాతంగా ఉంది. జీఎస్టీ ద్వారా రూ. 59వేల కోట్లు అంచనా వేయగా.. ఇప్పటి వరకు రూ. 43వేల కోట్ల ఆదాయం వచ్చింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 19వేల కోట్లు అంచనా వేయగా.. రూ. 12వేల కోట్లు సమకూరాయి. వ్యాట్, ఎక్సైజ్ , పెట్రోల్, డీజీల్ ద్వారా రూ. 37వేల కోట్లు అంచనా వేయగా.. రూ. 27 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరింది. ఇది మొత్తం అంచనాలో 74 శాతంగా ఉంది. నేరుగా మద్యం అమ్మకాల ద్వారా రూ. 27వేల కోట్లు వస్తాయని అంచనా వేయగా.. ఇప్పటి వరకు రూ. 19వేల కోట్లు ఖజానాకు చేరాయి. మద్యం ఆదాయం కొంత ఆశాజనకంగానే ఉంది.
ద్రవ్యలోటు..అంటే అప్పు రూ. 54వేల కోట్లుగా ఉంటుందని అంచనా వేయగా.. జనవరి నాటికే అది రూ. 69వేల కోట్లు మించిపోయింది. అంటే.. దాదాపు అంచనాలో ఇప్పటికే 30 శాతం మించింది. 130 శాతానికి ఇది చేరుకున్నది. రెవిన్యూ మిగులు రూ. 2,700 కోట్లు ఉంటుందని అంచనా వేయగా.. రివర్సులో రూ. 10వేల కోట్లు లోటు ఏర్పడింది. ఇది మరి రెండు నెలల్లో (ఫిబ్రవరి, మార్చి) ఎంత పెరుగుతుందో అంచనా వేయొచ్చు. ఆదాయం, అప్పు నిష్పత్తిని చూస్తే అప్పు భారం ఆదాయం కంటే యమ స్పీడులో పెరుగుతున్నది.
కాగా, ఆదాయం అప్పుల విషయం ఇలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం కాస్త ధైర్యంగా అభివృద్ధి, మౌళిక సదుపాయాలకు ఎక్కువ నిధులు కేటాయించడం విశేషం. క్యాపిటల్ ఎక్స్పెండేచర్ (పెట్టుబడి వ్యయం)కింద ఈ ఏడాది రూ.36వేల కోట్లను వెచ్చించాలని ప్రభుత్వం భావించినప్పటికీ అదిప్పటికే రూ. 44వేల కోట్లు మించింది. ఇది రెండు నెలల్లో ఎంత పెరుగుతుందో ఇప్పుడే చెప్పలేం. భారీగా రెవిన్యూ లోటు ఉన్నప్పటికీ పెట్టుబడి వ్యయం ఇంత స్థాయిలో వెచ్చించడం అభినందించదగ్గ విషయం. మరికొన్ని రోజుల్లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే తరుణంలో ఆదాయం, అప్పుల మధ్య ఉన్న వ్యత్యాసం రాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగానే మారింది. మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశం పెట్టే అవకాశం ఉంది.
