వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌:

ఎన్నికల ప్రక్రియలో భాగంగా బదిలీ అయిన తహసీల్దార్లని వెంట‌నే వారి పూర్వ జిల్లాల‌కు బ‌దిలీ చేయాల‌న్న తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) విజ్ఞ‌ప్తి మేర‌కు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. వెంట‌నే అధికారుల‌కు ఈ బ‌దిలీ ప్ర‌క్రియ చేప‌ట్టాల‌ని ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం మంత్రి డిప్యూటీ క‌లెక్ట‌ర్ల‌తో భేటీ అయ్యారు. ఇప్పటికే ప‌లుమార్లు త‌హ‌సీల్దార్ల బ‌దిలీ విష‌యంలో ట్రెసా తరపున మంత్రికి విన్నవించారు. దసరా పండగ లోపు తహసీల్దార్ల బదిలీలు చేపట్టి వారి కుటుంబాలలో సంతోషం నింపాలని ఈ సంద‌ర్బంగా ట్రెసా ప్రతినిధులు కోరారు. ఈ విషయంపై పూర్తి సానుకూలంగా స్పందించిన ఆయ‌న వేదిక మీదనే ఉన్న రెవెన్యూ ముఖ్యకార్యదర్శి, సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ కు వెంట‌నే ముఖ్యమైన సంఘ నాయకులతో చర్చించి బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. వీలైతే దసరా పండగలోపు బదిలీలు చేపడతామని హామీ ఇచ్చారు.

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం లో తెలంగాణ రాష్ట్రంలోని డిప్యూటీ కలెక్టర్లు/స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లతో రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ట్రెసా తరపున హాజరైన రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్ లతో కూడిన ప్రతినిధి బృందం రెవెన్యూ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కలిసి పలు అపరిష్కృత సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. విధి నిర్వహణలో భాగంగా తహసీల్దార్లు/ఆర్డీవోలపై పోలీసు కేసుల నమోదు విషయంపై కలెక్టర్ ముందస్తు అనుమతిని తప్పనిసరి చేస్తూ పోలీస్ శాఖకు ఆదేశాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతులతో సహా అన్ని కేడర్ల ప్రమోషన్లపై పూర్తి సానుకూలంగా హామీ ఇచ్చిన మంత్రి ,కొత్త రెవెన్యూ చట్టం పటిష్టంగా అమలు చేయడానికి గ్రామానికో రెవెన్యూ అధికారిని నియమించుటకు ప్రభుత్వం నిర్ణయించిందని ఈ సందర్బంగా ప్రకటించారు.ప్రభుత్వ భూములు కాపాడడానికి రెవెన్యూ అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి రెవెన్యూ శాఖనే కళ్ళు, చెవులు అని,సాధారణ ప్రజలకు, రైతులకు సత్వర,జవాబుదారి రెవెన్యూ సేవలు అందించాలని అయన రెవెన్యూ అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ట్రెసా ఉపాధ్యక్షులు కె.నిరంజన్ రావు,కార్యవర్గ సభ్యులు అనితా రెడ్డి, పలువురు డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు

You missed