(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఎంతటి అమాయ‌క‌త్వం ఆమెది. ఇప్ప‌టికీ ఇంకా ఇలాంటి అమ్మాయిలున్నారా? అనిపించింది. ఎంత వ‌ర‌కు చ‌దువుకున్న‌దో తెలియ‌దు. ప్ర‌తీది యూట్యూబ్‌లోకి ఎక్కియ్యాల‌నేది మాత్రం ఆమె మైండ్‌కెక్కించుకున్న‌ది. ఆ మాట్లాడే తీరు.. విష‌యం.. ఆమెకు అవ‌గాహ‌న లేద‌ని, అమాయ‌కురాల‌ని, సోష‌ల్ మీడియాకు అడిక్ట్ అయ్యింద‌ని అర్థ‌మైతుంది అంద‌రికి. వాడు ప్రేమించాడు నిజంగానే. ఆ ముఖంలో అమాయ‌క‌త్వ‌మూ ఉంది. కానీ వాడెందుకు హంత‌కుడ‌య్యాడు? ఆ ప్రేమంతా న‌ట‌నేనా? నిజంగా వ‌ర‌క‌ట్న‌మేనా ఆమె హ‌త్య‌కు కార‌ణం? ఎన్నో ప్ర‌శ్న‌లు, ఎన్నో అనుమానాలు. యూట్యూబ్‌లో రీల్ చేస్తే 30 ల‌క్ష‌ల అప్పు తీర్చుతుందా? ఆమె త‌ల్లే అన్న‌ది ఆ మాట‌. నా బిడ్డె నా అప్పులు తీర్చుతాన‌న్న‌ది అని. అంటే.. ఎంత‌గా ఆ అమ్మాయిని ఎంక‌రేజ్ చేశారో.. ఎంత‌లా ఆమెను ఆ ఊబిలోకి త‌మంత‌ట‌గా తాము చూస్తూ నెట్టేశారో తెలిసిపోతుంది.

దాదాపు యాభైవేల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లున్నారంట‌. ఈ పిచ్చి వీడియోలు. ఏది ప‌డితే అది చూసి లైకులు కొట్టి, కామెంట్లు పెట్టేవారంటే అదో పిచ్చిలోక‌మ‌నే చెప్పాలి. ఆ పిచ్చిలోకంలోకి ఎంట్రీ ఇచ్చింది వీడ్ని. ఆ వీడియోలు తీసి వాడెంతో సంతోష‌ప‌డ్డాడు. అబ్బ ఎంత బాగుందీ జీవితం.. నేనో హీరో, ఆమో హీరోయిన్.. మేమేం చేసినా చూసే జ‌నం.. మా వీడియోల కోసం ఎదురుచూసి ఎగ‌బ‌డే మా మందీమార్బ‌లం.. అనుకున్నారు. ఆలోకంలో ఇద్ద‌రూ విహ‌రించారు. చిన్న చిన్న మ‌న‌స్ప‌ర్ద‌లు, అనుమానాలు. ఇది ఇంట్లో కూర్చుని మాట్లాడుకుని సెట్ చేసుకోవాల్సిన‌వి. అమ్మాయి వ‌య‌స్సు చిన్న‌ది. అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ లేదు. మ‌రీ చిన్న‌త‌నంలోనే పెండ్లీలు చేయొద్ద‌నేది కూడా అందుకే చెప్పేది.

అప్ప‌టిదాకా హీరోను చేసిన వాడ్ని… విల‌న్‌గా చూపించింది. ఇగో ఇది వీడి నిజ‌స్వ‌రూప‌మ‌ని త‌న పిచ్చిలోకంముందుంచింది. అట్లైతే వాడు దారికొస్తాడ‌ని, త‌న‌కు భ‌య‌ప‌డ‌తాడ‌ని, ఇలా భ‌య‌పెడుతూ వాడిని మార్చుకోవాల‌నే ఆ చిన్న మ‌న‌సు ఆలోచ‌న కావొచ్చు. కానీ వాడి ఆలోచ‌న మారింది. త‌ను నిన్న‌టి వ‌ర‌కు ఆమె సృష్టించుకున్న లోకానికి హీరో. ఆమెను పెండ్లి చేసుకున్న భ‌ర్త‌. ఇప్పుడు ఆమే వాడ్ని విల‌న్ చేసింది. ఇక త‌ట్టుకోలేక‌పోయాడు. అప్ప‌టి వ‌ర‌కు ఆమె సాంగ‌త్యం స్వర్గం.. ఆ త‌రువాత నుంచి ప్ర‌తీ క్ష‌ణం న‌ర‌కం. ప‌ర్స‌న‌ల్‌గా మాట్లాడే ముచ్చ‌ట లేదు. ముచ్చ‌ట్ల‌న్నీ యూట్యూబ్‌లోనే. కోపాలు, ఆవేశాలు, త‌మ అప‌రిప‌క్వ నిర్ణ‌యాలు, బెదిరింపులు… అన్నీ అన్నీ అందులోనే. వాడో సైకో అయ్యాడు. హంత‌కుడూ అయ్యాడు. ఆమె బ‌లైంది. ఆ చంపే వీడియో కూడా పెడితే బాగుండ‌ని అనుకుంటున్న‌ది ఆమె సృష్టించుకున్న ఆ పిచ్చిలోకం.

Dandugula Srinivas

7661066999