భాగ్యనగరం. రాష్ట్ర రాజధాని. హైదరాబాద్. నిత్యం వేలాది మందికి జీవనోపాధిని చూపే నగరం. కాంట్రాక్టు పనుల్లో కూలీ పనిచేసుకుని పొట్టపోసుకునే నగర జీవులు… పొట్ట చేతబట్టుకుని నగరానికి వచ్చిన తెలంగాణలోని ఇతర జిల్లాలపేదలు… ఇతర రాష్ట్రాల వలస జీవులు….. ఇప్పుడు వీరంతా ఆకలితో అలమటిస్తున్నారు. పనులు లేక నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లలేక చిక్కిశల్యమవుతున్నారు. ఆకలి కేకలతో ఆ పేదల పేకులు దిక్కులు పిక్కటిల్లేలా అలమటిస్తున్నారు.
దేశాన్ని, దేశ స్వరూపాన్ని, దేశ ప్రజల జీవన స్ఙతిగతులను మార్చుతానని కంకణం కట్టుకున్న మన జాతిపేత , నేత, సీఎం కేసీఆర్ కు ఇది పట్టదు. యువరాజుకు అంతు చిక్కదు. బిల్లులు లేవు. నిధులు లేవు. ఐదు వందల కోట్లు పెండింగ్. పైసలిస్తేనే పనిచేస్తామని కాంట్రాక్టర్ల స్ట్రైక్. ఒక్క రోజు కాదు.. రెండు రోజులు కాదు.. నేటికి ఇరవై ఐదు రోజులు. అయినా చలనం లేదు పాలకుల్లో. ఎన్నో పనులు నిలిచిపుపోయాయి. రెక్కాడితే గానీ డొక్కాడని కూలీ బతుకులు ఆకలితో కూలిపోతున్నాయి.

కానీ ఇప్పుడు పాలకుడి దృష్టి ఉప ఎన్నిక మీద ఉంది. మునుగోడు గెలుపు మీద ఉంది. దేశంలో తనకంటూ ఓ పేరుతెచ్చుకోవాలనే తపనలో నిమగ్నమై ఉంది. రాజకీయ వ్యూహాలు రచించడంలో ఉంది. ఎత్తుకు పై ఎత్తులు వేసి ప్రత్యర్థులను చిత్తు చేసే అపర చాణక్యం అంతా ప్రదర్శించేందుకు మేథోమథనంలో బిజీబిజీగా ఉంది. కలో గంజో దొరకక ఆకలి కేకలు వేస్తున్న పేదల పేగుల చప్పుళ్లు వినే స్థితిలో ఇప్పుడా పాలకుడు లేడు. ఆ ఉప ఎన్నిక పాలకుడే గెలిస్తే బాగుండు. ఎందుకంటే ఓడితే బిల్లుల చెల్లింపులు అటకెక్కి… ఆకలితో నకనకలాడే పేగులతో ఎండిన డొక్కలతో ఆకలి చావులకు దగ్గరయ్యే రోజులు వచ్చినా వస్తాయి. అందుకే ఆ పాలకుడే గెలవాలి. పట్టించుకోవాలి. నిధులివ్వాలి. పనులు నడవాలి. కూలీ దొరకాలి. నోటికి కూడు దొరకాలి.
Dandugula Srinivas
