మునుగోడు ఉప ఎన్నిక బరిలోకి బీఆరెస్ కదం కలిపింది. ఇన్చార్జులను ప్రకటించారు. ప్రతీ రెండు వేల ఓట్లకు ఒకరిని ఇన్చార్జిగా పెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు… మొత్తం 88 మంది గల్లీ గల్లీ జల్లెడ పట్టినట్టు ప్రచారం చేయనున్నారు. కేసీఆర్ ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోదల్చుకోలేదు. ప్రతీ రెండు వేల ఓట్లకు ఒకరు ఇన్చార్జిగా ఉన్నారు. ఆఖరికి కేటీఆర్‌కూ ఇన్చార్జి బాధ్యతలు తప్పలేదు. ఆయనకూ రెండు వేల ఓట్ల పరిధే. ఇక ప్రచారం ఊపందుకోనుంది. జిల్లాలోని అందరి చూపులు మునుగోడు వైపే ఉన్నాయి. కొందరు ఆహ్వానం లేకున్నా మేమొస్తామంటే మేమోస్తామంటూ నాయకులతో మాట్లాడుకుని మరీ వెళ్లేందుకు రెడీ అయ్యారు. అక్కడ డబ్బు, మద్యం పంపిణీకి లెక్క ఉండదు. పోటాపోటీ పంపకాలు.
నువ్వింత అంటే నేనంతా అనే రేంజ్‌లో ఉంటుంది. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనతో ఈ ఉప ఎన్నిక గెలుపు మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో ఎట్టి పరిస్థితిల్లో బీఆరెస్ దీన్ని వదులకోదు. బీజేపీ, కాంగ్రెస్‌లకూ ఇది జీవన్మరణ సమస్యగా మారింది. రానున్న ఎన్నికల్లో దీని ఫలితం తీవ్ర ప్రభావం చూపుతుండటంతో గెలుపు అన్ని పార్టీలకు అనివార్యంగా మారింది. కనీసం గెలుపు తీరాలకు చేరకున్నా… రెండో స్థానం కోసమైనా పోరాడే పరిస్థితులు ఏర్పడ్డాయి.