దేశ వ్యాప్తంగా ఇకపై తెలంగాణ మోడల్ అమలు కానుందని, దేశ ప్రజలందరికీ ఇకపై తెలంగాణ తరహా సంక్షేమ ఫలాలు దక్కనున్నాయని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. సీఎం కేసీఆర్.. టీఆరెస్‌ను జాతీయ పార్టీగా మార్చి భారత్ రాష్ట్ర సమితి (బీఆరెస్) గా పేరు మార్చారని, జెండా, ఎజెండా, గుర్తు, కలర్ అంతా ఒకటేనని , తెలంగాణ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ఎక్కడా ఎలాంటి అయోమయం లేదన్నారు. దేశ వ్యాప్తంగా బీఆరెస్‌పై చర్చ జరుగుతున్నదని, రాష్ట్రమంతటా ప్రజలు సంబురాలు చేసుకుని దీన్ని ఆహ్వానించడం శుభపరిణామమని బాజిరెడ్డి పేర్కొన్నారు. ఒకప్పుడు గుజరాత్ మోడల్ అంటూ చంకలు గుద్దుకునేవారని, దాన్నే ప్రచారం చేసుకుంటూ పబ్బం గడిపేవారని, ఇక ఆ రోజులకు చెల్లు చీటి పడిందన్నారాయన.
ఇకపై దేశమంతటా తెలంగాణ మోడల్ అమలుకానుందని, ఇక్కడ సంక్షేమ పథకాల ఫలాలన్నీ దేశ ప్రజలు అనుభవించనున్నారని, కేసీఆర్ ఒక విజన్ ఉన్న నేత అని ఆయన అభిప్రాయపడ్డారు. రైతు సంక్షేమమే ఆయన ప్రధాన ధ్యేయమని, తెలంగాణలో ఈ దిశలోనే ఆయన పాలన సాగిందని, సాగునీరు, తాగునీరు, సంక్షేమ పథకాలు ఇవన్నీ ఆయన సాధించిన విజయాలన్నారు. ఇదే విజయబావుటా దేశమంతటా ఎగురవేసేందుకే ఆయన బీఆరెస్‌ను ఏర్పాటు చేశారని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటునందిస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణనేనని, ఇదిప్పుడు దేశ వ్యాప్తంగా అమలుకు శ్రీకారం చుట్టేందుకే కేసీఆర్ కృషి చేస్తున్నారని, బీఆరెస్ ఏర్పాటు దీనికి నాంది పలికిందని ఆయన అన్నారు.
మోడీ పాలన అట్టర్ ప్లాప్ అయ్యిందని, పథకాలన్నీ ప్రజలకు చేరువకాలేక ఫెయిల్యూర్ అయ్యాయని ఆయన విమర్శించారు. దేశమంతా కేసీఆర్ వైపు.. బీఆరెస్ వైపు.. ఆయన ఆలోచనలు, సంస్కరణల వైపు చూస్తున్నదని, జాతీయ పార్టీ బీఆరెస్ ఏర్పాటు ఓ చారిత్రాత్మక నిర్ణయమని బాజిరెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగా బీఆరెస్ విజయం సాధించి తెలంగాణ పథకాలను అంతటా అమలు పరిచే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
