అధికార పార్టీ ప‌త్రిక‌, టీవీ ఛానెళ్ల‌లో ప‌నిచేసే ఉద్యోగుల ప‌రిస్థితి పాపం ఘోరం..! అంగ‌ట్లో అన్నీ ఉన్నా… అన్న‌ట్టుగా సీఎం, కేటీఆర్‌, క‌విత‌, సంతోష్‌రావు… ఇలా ఉద్దండులు, పార్టీ , ప్ర‌భుత్వ పెద్ద‌ల క‌నుస‌న్న‌ల్లో , వారి అజ‌మాయిషీలో న‌డిచే ఈ ప‌త్రిక‌, చానల్ ఇప్పుడు బ‌జారున ప‌డుతున్నాయి. వార్త‌ల్లో నిలుస్తున్నాయి. ప‌లువురు చ‌ర్చించుకునే ప‌రిస్థితికి వ‌చ్చాయి. కార‌ణం ఏమైనా కావొచ్చు.. అన్నీ యాజ‌మాన్యాల‌కు తెలుసు. కానీ పట్టింపులేని త‌నం వాటి ప‌రువు తీస్తున్నాది. అంతిమంగా పెద్ద‌ల‌కూ త‌ల‌వంపులు తెస్తున్న‌ది.

మొన్న‌టి వ‌ర‌కు న‌మ‌స్తే తెలంగాణ‌లో జీతాల లొల్లి. నాలుగేండ్లుగా జీతం పెంచ‌లేదంటూ పెన్‌డౌన్‌, ఆందోళ‌న‌, ధ‌ర్నా చేస్తే గానీ మేనేజ్‌మెంట్ దిగిరాలేదు. ఏదో అలా అత్తెస‌రు జీతాలు పెంచి వారి ఆగ్ర‌హ‌జ్వాల‌ల‌పై నీళ్లు కుమ్మ‌రించింది. ఇప్పుడు అదే బాట‌ను టీ న్యూస్ ఎంప్లాయిస్ ఎంచుకున్నారు. మూడేండ్లుగా ఏవీ జీతాలు..? అని నిల‌దీస్తున్నారు. పెన్ డౌన్ చేశారు. ఆఫీసులోనే బైఠాయించారు.

అధికారంలో ఉండీ ఏమిటీ ఉద్యోగుల‌కు ఈ దుస్థితి..? అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్‌, కేటీఆర్‌లు వీటి గురించి ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశారా..? పాత‌వాళ్ల‌ను తీసేసి కొత్త‌వాళ్ల‌కు అప్ప‌గిస్తే పేను కు పెత్త‌న‌మిస్తే జుట్టుంతా కొరికింద‌న్న‌ట్టే చేస్తున్నారు వాళ్లు. న‌డ‌మంత‌ర‌పు సిరిలా వీరికి ఒక్క‌సారిగా పెద్ద పెద్ద అవ‌కాశాలు రావ‌డం.. కేసీఆరే మ‌మ్మ‌ల్ని పిలిచి మ‌రీ బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ని, బోడిపెత్త‌నం చేస్తూ ఉద్యోగుల‌ను పీకేయ‌డం.. త‌మ‌కు కావాల్సిన వారిని తెచ్చుకోవ‌డం.. వారికి మాత్ర‌మే జీతాలు పెంచుకోవ‌డం.. మొద‌టి నుంచి దీనిపైనే ఆధార‌ప‌డ్డ వారితో మాత్రం వెట్టి చాకిరీ చేయించుకోవ‌డం… ఇదే కొత్త బాధ్య‌త‌లు తీసుకున్న పెద్ద‌లు చేస్తున్న‌ది. కేసీఆర్ కూడా ఇదే కోరుకుంటున్నాడు బ‌హుశా. అందుకే అక్క‌డ ఏం జ‌రిగినా.. ప‌రువు బ‌జారుకెక్కినా ప‌ట్టించుకోవ‌డం లేదు…

You missed