(దండుగుల శ్రీనివాస్)
కాంగ్రెస్ పార్టీ నుంచి అచ్చంగా సొంతంగా ఓ పత్రిక రాబోతుంది. దాని పేరు స్వేచ్ఛ. దీని వెనుక కర్త, కర్మ, క్రియ అంతా సీఎం రేవంత్ రెడ్డే. ఎన్నికలకు ముందు బిగ్ టీవీ పేరుతో వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఒంటరిగా పోరాడింది. అప్పటికే మీడియా మొత్తం కేసీఆర్ గుప్పిట్లో ఉండే. మూడోసారి కూడా కేసీఆర్ అధికారంలోకి వస్తారని చాలా మంది అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తుందా..? రాదా..? రావడం కష్టమే అన్న అభిప్రాయమే మెజారిటీ జనాల్లో. ఆ సందర్బంలో రేవంత్‌కు , కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంది బిగ్ టీవీ. సోషల్ మీడియా. ఈ రెండింటినీ బేరీజు వేసుకుంటే సోషల్ మీడియా చాలా చాలా సపోర్ట్ చేసింది కాంగ్రెస్‌ను. అప్పటికే పదేళ్ల పాలన, సిట్టింగు ఎమ్మెల్యేల అరాచకాలు, కేసీఆర్ నియంత పోకడ, కేటీఆర్ అహంకారం, కవిత సపరేట్ పాలిటిక్స్… ఇవన్నింటినీ చూసీ చూసీ జనం చీదరించుకున్నారు.
కాంగ్రెస్ రావాలనుకున్నారు. ప్రధానంగా జర్నలిస్టులు కూడా చాలా మంది కూడా కాంగ్రెస్ రావాలనే కోరుకున్నారు. తెలంగాణ ఏర్పడి, బీఆరెస్ పదేళ్ల అధికారంలో జర్నలిస్టులకు ఒరిగిందేమీ లేదు. అసలు వారిని కేసీఆర్ పట్టించుకోలేదు. గంజిలో ఈగను తీసేసినట్టు తీసేశాడు. అన్ని సెక్షన్ల తరహాలోనే జర్నలిస్టు సర్కల్ లో కూడా కేసీఆర్ అంటే తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా రేవంత్‌కు అండగా నిలిచింది. కానీ ఇప్పుడు రేవంత్‌కుఈ సోషల్ మీడియానే శత్రువైంది. అది రేవంత్ స్వయంకృతాపరాధం. అది వేరే విషయం. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక సేమ్ కేసీఆర్ లాగే మెయిన్ మీడియా మొత్తం రేవంత్ పాట పాడటం మొదలు పెట్టింది. నమస్తే తెలంగాణ, సాక్షి మినహా ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, దిశ… ఇలా అన్నీ.. కాంగ్రెస్‌కు దాసోహం అంటున్నాయి. రేవంత్ ఏమీ తక్కువ తినలేదు. కేసీఆర్‌ను మించి మీడియాను తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. గుప్పిట్లో పెట్టుకుంటున్నాడు.
తస్మాత్ జాగ్రత్త అని బెదిరించి తన పని తాను చేసుకుపోతూ ఉన్నాడు. అందుకే మీడియా మొత్తం రేవంత్ బాకా ఊదుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బిగ్‌టీవీ యాజమాన్యం… విజయ్‌కుమార్ రెడ్డి. ఇతనో ఎన్నారై. ఇతనే ఇప్పుడు స్వేచ్ఛ అనే డిజిటల్ పత్రికకు అంకురార్పణ చేశాడు. ప్రభుత్వ సలహాదారు, రేవంత్‌కు అత్యంత సన్నిహితుడైన వేం నరేందరెడ్డికి ఈ విజయ్‌కుమార్ రెడ్డి బంధువు. మిత్రుడు. అదే ఊరు. తొలత డిజిటల్. ఆ తరువాత ప్రింట్‌కు పోతారట. ఇంకా రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. మొత్తానికి కేసీఆర్‌కు మానస పుత్రికైన పత్రిక నమస్తే తెలంగాణ. రేవంత్‌కు పోలోమని మొత్తం మీడియా వంతపాటి బాకా ఊదినా… ఇప్పుడు ఆయనకూ ఓ మానస పుత్రికైన ఓ పత్రిక జనించింది. అదే స్వేచ్ఛ.