వాస్తవం- పబ్లిక్ టాక్..
అది బార్బర్ షాప్… ఉదయమే ఓ యువ రైతు కటింగ్ చేయించుకుంటున్నాడు. హడావుడిగా ఓ యువకుడొచ్చాడు. ‘ఏమైందే నిన్న వస్తే రేపు పొద్దున రమ్మన్నావు.. ఇప్పుడు కూడా బిజీగానే ఉన్నావు..’ అన్నాడు.
” అన్నా జర్ర ఓపిక పట్టు అయిపోతది” అన్నాడు మంగళి నాగరాజు..
వచ్చిన యువకుడు ఊకనే ఉండడు కదా… పేపర్ తీసుకుని … ”
అగోనే మునుగోడులో సర్పంచులకు 20 లక్షలు ఇస్తున్నరంట” అన్నాడు.
‘ఎవరు ఎవరికిస్తున్నరు..? ” నాగరాజుకు అర్థం కాలేదు.
“ఓ వైపు అధికార పార్టీ, మరోవైపు బీజేపీ … కాంగ్రెస్‌కు గాలం వేస్తుంది… మస్తు పైసలు మన నాయకులకు” అన్నాడు యువకుడు…
“అవునే….. బీజేపీ గెలుస్తదంటవా..?” నాగరాజు అడిగాడు ఉత్సుకతతో
“రాజగోపాల్ రెడ్డికి అక్కడ అంత సీన్ లేదు.. గెలవడం కష్టమే.. టీఆరెస్సే గెలుస్తది….” యువకుడు డిసైడ్ చేసేశాడు.
“సరే అదిపోని గానీ….. బీజేపీ వచ్చే ఎన్నికల్లో బాగానే సీట్లు సంపాదిస్తదా…?” మళ్లీ అడిగాడు నాగరాజు…
” దానికంత సీన్ లేదే…! పది పదిహేను తో సరిపెట్టుకుంటుంది…” అన్నాడాయువకుడు.
“అయినా ఆ పార్టీలో అంత సీన్ ఉన్న నాయకులున్నారా..? ఎవలికి సక్కగ మాట్లాడొస్తది… సబ్జెక్టు మీద సరిగ్గా మాట్లాడేటోడున్నడా….?” మళ్లా కసిగా అన్నాడాయువకుడు.
అప్పటిదాకా కటింగ్ చేపించుకుంటూ వీళ్ల మాటలే శ్రద్దగా వింటున్న ఆ యువరైతు అందుకున్నాడు.
“అర్విందుకు మాట్లాడరాదు.. బండి సంజయ్‌కు మాట్లాడరాదు… వాళ్లకు అంతసీన్ లేదు…” అన్నాడు.
“అర్వింద్‌కైతే మళ్లా ఓట్లేసేటోడుండడు….” అన్నాడు కసిగా.
” పసుపుబోర్డు పేరు చెప్పి మోసం చేసిండు… రైతులు ఇవన్నీ చూస్తలేరా….?” అన్నాడు కొంచెం కోపంగా..
“అరే అర్వింద్ గెలిచినకంనే పసుపుకు మంచి ధర వస్తుందంటకదనే… ” అమాయకంగా ముఖం పెట్టి అడిగాడు నాగరాజు…
“ఒకసారి మార్కెట్లకు పోయి సూడు.. ఐదు వేలు.. ఆరు వేలు…… ”
పూర్తిగా చెప్పడమూ ఇష్టం లేనట్టు ముగించేశాడు.
కటింగ్ పూర్తయినట్టుంది మీద పడ్డ వెంట్రుకలు దులుపుకుంటూ …… “అర్వింద్ ఇక జన్మలో గెలవుడు……” ఏదో శాపం పెట్టినట్టే అనుకుంటూ వెళ్లిపోయాడు….
Dandugula Srinivas