అక్రిడేష‌న్‌. ఓ జ‌ర్న‌లిస్టుగా అదో గుర్తింపు కార్డు. అదుంటే ఇక అన్నీ మ‌న చేతిలో ఉన్న‌ట్టే అని భ్ర‌మ‌ప‌డ‌తారు. ఏదైనా చేసేయొచ్చ‌ని వెర్రి క‌ల‌లు కంటారు. త‌మ చేతిలో అదో ప‌శుప‌తాస్త్రం అని చంక‌లు గుద్దుకుంటారు. అందుకోసం ఎంత‌కైనా తెగిస్తారు. ఎంతైనా పెడ‌తారు. ఎన్నివేలైనా ఇస్తారు. ఇగో ఇదే స‌దాశ‌కాశమ‌ని భావించారు మ‌న చితికిపోయిన చిన్న ప‌త్రిక‌ల ఎడిట‌ర్లు. ఓ స‌మావేశం ఏర్పాటు చేసుకున్నారు. రేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఓక్కో కార్డుకు న‌ల‌భై వేల‌కు త‌గ్గ‌కుండా తీసుకోవాలి. అంతే కాదు. కార్డు పొందిన వాళ్లు క్యాలెండ‌ర్ యాడ్స్ చేసి పెట్టాలి. అకేష‌న్ ల వారీగా అవ‌స‌ర‌మైనప్పుడ‌ల్లా యాడ్స్ చేయాలి. ఈ కండిష‌న్ల‌కు ఒప్పుకుంటునే అక్రిడేష‌న్‌కార్డులు. అయినా మ‌న‌వాళ్లు త‌గ్గ‌డం లేదు. అన్ని కండిష‌న్లు ఒప్పుకుంటున్నారు. అడిగినంతా స‌మ‌ర్పిస్తున్నారు. అక్రిడేష‌న్ చేతిలో ప‌డితే చాలు ప్ర‌పంచాన్ని జ‌యించినంత ఆనందం మ‌న వెర్రి జ‌ర్న‌లిస్టు మాలోకాల‌కు. ఇప్పుడిదే ట్రెండ్ న‌డుస్తున్న‌ది. ఇర‌వై తారీఖ వ‌ర‌కు ఆఖ‌రు తేదీ. కానీ ఇప్ప‌టికే అంత‌టా హౌజ్ ఫుల్‌.

అవునూ… అక్రిడేష‌న్ కార్డొస్తే ఏమొస్త‌ది…?

డ‌బుల్ బెడ్ రూం ఇండ్లొస్త‌యి…
ప్లాట్లొస్త‌య్‌…

ఫ్రీగా ప్రైవేటు ద‌వాఖాన‌ల్లో ట్రీట్‌మెంట్ దొరుకుత‌ది..

ప‌ర‌ప‌తి, ప‌రువు పెరుగుత‌ది…

స‌మాజంలో మంచి గౌర‌వం ల‌భిస్తుంది.

ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు గ‌జ‌గ‌జా వ‌ణికి స‌లాం కొట్టి కుర్చీ ఏసీ కుసోబెట్టి ఛాయ్ తాపుత‌రు.

ఇంకా… ఇంకా…

చాలానే ఉన్నాయి.. కానీ స‌రిగ్గా ఇప్పుడే గుర్తుకురావ‌డం లేదు…

ఏంటీ అలా ఘాట్టిగా న‌వ్వుతున్నారు…ఏందీ ఇవ‌న్నీ అబ‌ద్దాల‌నుకుంటున్నారా..?
నిజ్జ‌మండీ బాబు… నిజ్జ‌మంటే న‌మ్మ‌రే…… న‌మ్మ‌క‌పోతే మీ ఖ‌ర్మ‌.. కావాలంటే మా జ‌ర్న‌లిస్టు సోద‌రుల‌ను అడ‌గండి…

 

 

You missed