నేను సంస్థలో చేరే సమయంలో ఎంతో ఉత్సాహంగా చేరాను. వార్తలు అలాగే రాశాను. రోజులు గడుస్తున్నా కొద్ది పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఇంత కాలం సంస్థలో పనిచేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. ప్రస్తుత పరిస్థితుల్లో చందా కాపీలు కట్టించడం నావల్ల కాదు. ఎందుకంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. నేను సంస్థలో చేరిన కొత్తలో నా శక్తి మేరకు స్కీమ్ కాపీలు చేయించాను. అప్పట్లో ఇలాగే టార్గెట్ పెడితే చేశాను. చందా కాపీల విషయంలో నా వల్ల కాదు. కానప్పుడు తప్పుకోవడం మంచిది అనిపించింది అందుకే తప్పుకుంటున్నాను. చందాలు కట్టడంలో ప్రతి రిపోర్టర్ ముందుగా సొంత డబ్బులు కడుతున్నారు. తర్వాత వసూలు చేసుకుంటున్నారు. వసూలు కాకపోయినా భరిస్తున్నారు. నాకు అంతగా ఆర్థిక స్థోమత లేదు. నేను డబ్బులు కట్టలేను. నేను ఏదో తప్పు చేశాను తీసివేశారు అని కాకుండా నాకు నేనుగా స్వచ్చందంగా తప్పుకుంటున్నాను.

ఇదీ న‌మ‌స్తే తెలంగాణ‌లో ప‌నిచేసే రిపోర్ట‌ర్ ఆవేద‌న‌. న‌మ‌స్తే తెలంగాణ స‌ర్క్యూలేష‌న్ పేరుతో రిపోర్ట‌ర్ల మెడ‌పై క‌త్తి పెట్టింది. చేస్తారా..? చ‌స్తారా..? అని కింద బ్యూరో ఇన్చార్జిల నుంచి మొద‌లుకొని నెట్‌వ‌ర్క్‌, బ్యూరోచీఫ్‌, ఎడిట‌ర్ వ‌ర‌కు ఒత్తిడి మామూలుగా లేదు. ఇక ప‌నిచేయ‌డం దండ‌గ రా బాబు ఇందులో అనే కాడికి వ‌చ్చింది ప‌రిస్థితి. టీఆరెస్ వార్త‌లే రాస్తారు. మ‌రి వాళ్లే చందా కాపీలు చేయ‌రు. త‌ప్పించుకుంటారు. ఫోన్‌లు చేస్తే లేప‌రు. క‌లిస్తే పారిపోతారు. మ‌రి వీళ్లే ప‌ట్టించుకోకపోతే.. బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కులు చేస్తారా చందాలు. చేయ‌రు. మ‌రి ఎవ‌రితో చేపించాలె. ఎవ‌రితోనైనా చేపించండి. బెదిరించండి. బ‌తిమాలాడండి.. ఏదైనా చేయండి.. కాపీలు కావాలి. లేదంటే మీ ఉద్యోగాలుండ‌వు. ఇవీ పై నుంచి బెదిరింపులు.

అస‌లే క‌రోనా టైం. క‌రోనా పేరు చెప్పే క‌దా అంద‌రినీ రోడ్డు పాలు చేశారు. ఇప్పుడు మ‌ళ్లీ క‌రోనా వేళ ఎవ‌రు కాపీలు క‌డ‌తారు. జేబులో నుంచి ఎవ‌రు పైస‌లు తీసి ఇస్తారు. కొత్త ఎడిట‌ర్ కృష్ణ‌మూర్తి కొత్త‌లో వ‌చ్చినప్పుడు మీటింగ్ పెట్టి ఏమ‌న్నాడు… అస‌లు రిపోర్ట‌ర్లు ఎందుకు స‌ర్క్యూలేష‌న్ చేస్తారు.. దానికి సెప‌రేట్ వింగ్ ఉంది క‌దా.. ఇక‌పై చెల్ల‌వు ఇలాంటి ప‌ద్ద‌తులు అని క‌దా బీరాలు ప‌లికింది. మ‌రి ఇప్పుడాయ‌న ఇలా క‌త్తి మెడ పెట్టి కాపీలు చేస్తారా..? రోడ్డున ప‌డ‌తారా…? అని బెదిరించ‌డ‌మేమిటీ..?

అందుకే ఇప్పుడు న‌మ‌స్తే తెలంగాణ విలేక‌రులు … అయితే దిశ‌, లేక‌పోతే వెలుగు పేప‌ర్ల వైపు చూస్తున్నారు. వాటికి అక్రిడేష‌న్లు లేక‌పోయినా స‌రే.. అదే బెట‌ర్ అని ఫిక్స‌యిపోయారు. మీరూ మీ పత్రిక ఇంకా ఎన్ని రోజులు ఇలా చంపుతార్రా నాయ‌నా.. అని దుమ్మెత్తిపోసి గుడ్ బై చెప్పి వెళ్లిపోతున్నారు. మండ‌లాలు విలేక‌రులు లేక ఖాళీ అవుతున్నాయి. ఇక కొత్త విలేక‌రులు దొర‌కరు. అధికార పార్టీ న‌మ‌స్తే తెలంగాణ కు విలేక‌రులు లేని సెంట‌ర్లు ఉన్నాయంటే ఎంత నామ‌ర్ద‌.. స‌రే, కానీ ఇంకా ఎక్క‌డి దాకా వ‌స్తుందో ప‌రిస్థితి.

You missed