అర్వింద్ అంటేనే ప‌సుపు బోర్డు గుర్తొస్త‌ది రైతుల‌కు. ఎట్లాగూ గెలిచేది లేద‌నుకున్నాడో.. అడిగేవారెవ‌ర‌నుకున్నాడో తెలియ‌దు కానీ, త‌న‌ను ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో ప‌సుపు బోర్డు తీసుకొస్తాన‌ని ఓ ఉచిత హామీ ఇచ్చేశాడు రైతుల‌కు. ఏ పోపోవోయ్‌.. మాట‌లు చెప్పొచ్చావు అని ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఇట్ల కాద‌ని ఓ బాండు పేప‌రే రాసి విడుద‌ల చేశాడు. ఎన్నిక‌ల్లో బాండు పేప‌ర్ రాజ‌కీయాలు ప్ర‌వేశ‌పెట్టింద‌ని ఎవ‌రైనా అడిగితే ట‌క్కున అంద‌రూ చెప్పేది మ‌న అర్వింద్ పేరే.

అలా బాండు పేప‌ర్‌తో న‌మ్మించి గెలిచిన అర్వింద్ ఆ త‌ర్వాత యూట‌ర్న్ తీసుకుని … అంబాసిడ‌ర్ కారులాంటి ప‌సుపుబోర్డు ఎందుకు..? దాని క‌న్నా తాత‌ను తీసుకొస్తాన‌ని ఏదో చెప్పి.. అలా రోజులు దాట‌వేస్తూ వ‌చ్చాడు. రైతుల‌కు క్లారిటీగా అర్థ‌మ‌య్యిందేంటంటే… బాండు పేప‌ర్ బాబు బాగా మోసం చేశాడ‌ని. అప్ప‌ట్నుంచి ర‌గిలిపోతున్నారు. కానీ ఏం చేస్తారు..? ఎన్నిక‌ల‌ప్పుడు క‌దా త‌మ ఓటు అస్త్రాన్ని మ‌ళ్లీ ప్ర‌యోగించేది. అందుకే స‌మ‌యం కోసం వేచి చూస్తున్నారు.

మ‌న టీఆరెస్ నాయ‌కులైతే దీన్ని మ‌రిచిపోయారు. అర్వింద్ ఊసెత్త‌డానికే భ‌య‌ప‌డుతున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం వ‌ద‌ల‌డం లేదు. ఆ మ‌ధ్య ఆర్మూర్‌లో రాజీవ్ రైతు భ‌రోసా దీక్ష పెట్టారు. దీనికి రేవంత్‌రెడ్డి వ‌చ్చాడు. రైతుల‌తో క‌లిసి ప‌సుపు బోర్డు కోసం ఢిల్లీ వెళ్దామ‌న్నాడు. అదిప్పుడు కార్య‌రూపం దాల్చ‌నుంది. ఈ నెలాఖ‌రులో పార్ల‌మెంటు సెష‌న్స్ చాలు కాబోతున్నాయి.

ఈ సెషన్స్ న‌డిచేప్పుడే నిజామాబాద్ జిల్లా నుంచి ఓ 200 మంది రైతులు హైద‌రాబాద్ వ‌ర‌కు బ‌స్సులో వెళ్లి అక్క‌డి నుంచి ట్రైన్‌లో ఢిల్లీ వెళ్లేందుకు జిల్లా కాంగ్రెస్ క‌మిటీ ప్లానింగ్ చేస్తున్న‌ది. ఇచ్చిన హామీ మేర‌కు ప‌సుపు బోర్డు ప్ర‌క‌టించాలి. ప‌సుపు కు మ‌ద్ద‌తు ధ‌ర ప్ర‌క‌టించాలి అనే ఈ రెండు ప్ర‌ధాన డమాండ్ల‌తో రైతులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు, అర్వింద్ మోసం చేశాడ‌ని ఎండ‌గ‌ట్టేందుకు ఇందూరు అన్న‌దాత‌లు ఢిల్లీ బాట ప‌ట్ట‌నున్నారు.