ఈటలా..! నీకిది తగునా..?
ఉద్యమకారులకు కాకుండా వేరొవరికో పదవులిస్తున్నామని చెవికోసిన మేకలెక్క ఒర్రుతున్నవ్.. అసలు నీకు సోయుండి మాట్లాడుతున్నవా…? మాట మతి తప్పి మాట్లాడుతున్నవా తెలుస్తలేదు. అధికారం కోసం నువ్వూ నేనూ చేసింది అదే. ఉద్యమం కోసం రోడ్డెక్కిన ప్రతీ ఒక్కడికీ పదవి ఇయ్యాలంటే కుదుర్తుందా? కుదరదు. అది నీకూ తెలుసు. అసలు ఉద్యమకారులమనే పేరుతో ఉన్నోడికి పదవి ఇస్తే ఏమన్నా.. అహా.. ఏమన్నా పార్టీకి ఉపయోగమా..? నయాపైస ఉపయోగం కూడా లేదు. మరి అసొంటిది ఎందుకియ్యాలె ఉద్యమకారులకు పదవులు. ఇదే ముచ్చట కదా మనం అప్పుడు మాట్లాడుకున్నది.
మనదేమన్నా సన్నాసుల మఠమా..? అందరికీ పదవులిచ్చుకుంటా కూసుంటందుకు. మనది పక్తు రాజకీయ పార్టీ. ఓట్లు కావాలె. సీట్లు రావాలె. పదవులు పంచాలె. ఎవరికి పంచాలె. మనని బూతులు తిట్టినోన్ని భుజానెక్కించుకోవాలె. గాండ్రించి ముఖాన ఉంచినోన్ని కౌగిలించుకోవాలె. దిష్టిబొమ్మలు తల్గవెట్టినోని కడుపుల తలవెట్టాలె. దొంగదెబ్బ తీసిన గుంటనక్కలను కారుల ఎక్కించుకుని ఊరేగాలె. నవ్వు రాకున్నా ముసి ముసి నవ్వాలె. ఇసొంటోళ్లకు పదవులిస్తే ఏమైతది. కిక్కరుమనకుండా కుక్కిన పేను లెక్క అట్ల పడి ఉంటరు బాసిన కుక్కలు. లేకపోతే మనమీదన వాగేది. అట్ల పార్టీని కాపాడుకోవాలె. ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలె.
దీనికి రాజకీయ పునరేకీకరణ.. దోకీకకరణ.. తీన్‌కీకరణ… ఏదైనా పేరు పెట్టుకోవాలె. అంతే. మరి ఇప్పుడు నువ్వు కొత్తగా ఉద్యమకారుల పాట అందుకోవడ్తివి. నువ్వు చేసింది ఏందీ ఈటల. నీ పదవి కాపాడుకునేందుకు .. ప్రతిపక్షాలు, శత్రువులు లేకుండా జాగర్త పడ్డవా లేదా? పక్కపార్టోనికి పిలిచి పదవులిచ్చినవా లేదా..? మరి నువ్వు కూడా మా తాను ముక్కనే కదా ఈటల. ఇప్పుడు కొత్తగా మాట్లాడి. .ఓట్ల కోసం వాళ్ల దగ్గర సానుభూతి పొందాలని చూస్తే.. నవ్వుకుంటరు రాజేంద్ర…! నువ్వు ఉద్యమకారుడవని మంత్రి పదవిస్తే ఏం చేసినవు? నాకే వెన్నుపోటి పొడిచి సీఎం సీటు మీద కూసుందామని చూసినవు.
ఇదెంత పెద్ద రాజ్యద్రోహం..? సీఎం పదవి ఉత్తగనే వస్తదా..? ఒకరాజును గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నో..? వినలేదా..? మరి నీ అసొంటి విశ్వాసంలేనోడికి పదవిచ్చే బదులు ఓ శ్రీనివాస్ యాదవ్, ఓ మల్లారెడ్డి, ఓ పుల్లారెడ్డి. ఓ ఎల్లారెడ్డి…. ఇలా నన్ను తిట్టినోళ్లకు ఇస్తే .. వాళ్లు చూడు ఎంత విశ్వాసంగా ఉన్నారు. నా కోసం బట్టలు చింపుకుంటరు.తొడలు కొట్టి సవాళ్లు విసరుతరు. నా మీద ఈగ వాలనీయరు. ఏదేమైనా నిన్ను క్షమించేది లేదు.
నువ్వు ఈ విషయంలో బేషరతుగా క్షమాపణ చెప్పాలె.
నువ్వు అసలైన ఉద్యమకారుడవే అయితే.. నువ్వు చేసిన ఈ ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలె.
ఇదే నా సవాల్……..