ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయం. రాజీనామాల ద్వారా సీమాంధ్ర ప్రభుత్వానికి, కేంద్రానికి ఉద్యమ సెగ తగులుతున్న సందర్భం. రాజీనామా చేసి మళ్లీ గెలిచి తెలంగాణ వాదం బతికే ఉందని నిరూపించుకునే చారిత్రక సన్నివేశం. ఆనాడు ఇందులో భాగంగానే నిజామాబాద్ అర్బన్ నుంచి డీఎస్‌పై బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన యెండల లక్ష్మీనారాయణ రాజీనామా చేసి మళ్లీ బరిలో నిలిచాడు. పార్టీలకతీతంగా అతనికి మద్దతు లభించింది. మళ్లీ ఇక్కడ డీఎస్సే నిలబడ్డాడు. తను గెలిస్తే బంగారు పళ్లెంలో తెలంగాణ తెస్తానని నమ్మబలికాడు. గెలిస్తే.. అధిష్ఠానం సీఎంను చేస్తుందని కూడా ప్రచారం చేసుకున్నాడు. కానీ ఎవరూ నమ్మలేదు. మళ్లీ యెండలకే పట్టం గట్టారు.
అంతటి అధికార దుర్వినియోగం, విచ్చలవిడి ఖర్చు మధ్య కూడా పదివేల పైచిలుకు ఓట్లతో యెండల గెలిచాడు. అన్ని వర్గాలు కలిసి యెండలను గెలిపించి తెలంగాణవాదాన్ని నిలబెట్టారు. ఇప్పుడిదంతా ఎందుకంటారా? కొంత మంది తెలంగాణ ఉద్యమకారులు ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికకు దీన్ని ఆపాదిస్తన్నారు. అదేందీ? అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం అంతా అలా చేశారు. ఈటల విషయంలో అంత బలమైన మద్దతు ప్రజల నుంచి లభిస్తుందా? దానికి దీనికి పోలిక ఏమిటీ? అని అనుకోవచ్చు. కానీ అదే రిపీట్ అవుతుందని కొందరు వాదిస్తున్నారు.
అప్పటి ఉప ఎన్నిక కన్నా.. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌కు అందరి మద్దతు ఉందనేది వారి వాదన.ఈటలకు మంచి పేరుందని, వ్యక్తిగతంగా అందరూ అభిమానిస్తారని, తలలో నాలికలా ఉన్న ఈటల కచ్చితంగా గెలుస్తాడనీ అంటున్నారు. దీనిపై యెండల లక్ష్మీనారాయణ కూడా వాస్తవం ప్రతినిధితో మాట్లాడాడు. గుర్రాన్ని చెరువు దాకా తీసుకుపోగలుగుతారు.. కానీ నీళ్లు తాగించలేరు. అలాగే ఎన్ని కోట్లు గుమ్మరించినా.. ఓట్లు మాత్రం ఈటలకే పడతాయన్నాడు. ఆనాడు అర్బన్‌లో తన గెలుపు కన్నా బలంగా ఇక్కడ పార్టీలకతీతంగా ఈటలకు సపోర్టుగా నిలుస్తున్నారని, బ్రహ్మాండమైన విజయం సొంతం చేసుకోబోతున్నాడని చెప్పాడు.