సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్‌గాంధీ విషయంలో ఓ తప్పు చేసిందని కేసీఆర్ బలంగా నమ్ముతాడు. దీన్ని పలుమార్లు తన అంతరంగీకులతో కూడా చెప్పుకున్నాడు. మన్మోహన్ సింగ్‌కు బదులుగా పీఎంగా రాహుల్‌ను చేయాల్సి ఉండేనని కేసీఆర్ అభిప్రాయపడ్డాడు. ఒక్కసారి పీఎం చేస్తే ఆ తర్వాత ఆ హోదాలోనే రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా వుండేవాడని, అదే బ్రాండ్ ఇమేజ్‌తో పార్టీని తన భుజస్కంధాలపై మోస్తూ కాపాడుకునేవాడనేది కేసీఆర్ ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు దీన్ని తనకూ వర్తింపజేసుకుంటున్నాడు. ఇంకా సమయం కోసం వేచి చూసే దోరణి అవలభిస్తే పరిస్థితి చేయిదాట వచ్చనేది ఆయన అభిప్రాయం. అందుకే కేటీఆర్‌ను పట్టాభిషక్తుడిని చేసేందుకు ఇంకా ఎక్కువ సమయం తీసుకోవాలనుకోవడం లేదు.
ఈ రోజు ఆయన మళ్లీ ఢిళ్లీ వెళ్లనున్నాడు. మంత్రులను కలవనున్నాడు. ఇప్పుడిది ప్రాధాన్యత సంతరించుకున్నది. మొన్ననే 9 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసిన కేసీఆర్. మళ్లీ మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. పలువురు మంత్రులను కలవనున్నాడు. ఇప్పుడు కాకపోతే మళ్లీ తన కొడుకును సీఎం చేయడం కష్టమనే బలమైన అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నాడు. ప్రత్యక్ష ఉదాహరణగా రాహుల్ ఉదంతాన్నే ఆయన తీసుకుంటున్నాడు. రాహుల్‌ను అప్పుడే పీఎం చేస్తే ఇప్పుడు ఆయనకీ పరిస్థితి వచ్చేది కాదనేది కేసీఆర్ ప్రగాఢ విశ్వాసం.
కేటీఆర్‌ను ఒక్కసారి సీఎం చేస్తే.. ఆ తర్వాత అదే హోదాలో పార్టీని కూడా కాపాడుకునే శక్తిని ప్రోది చేసుకుని .. మున్ముందు మరింత క్రియాశీలకంగా మారుతాడనేది కేసీఆర్ ఆలోచన. అందులో భాగంగా ఆయన మూడేండ్ల నుంచే ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నాడు. తొలత ప్రజల వద్దకు పంపి .. బహిరంగ సభల ద్వారా ప్రజామోదం పొందేందుకు ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత లీకుల ద్వారా ఈ ఏడాది .. కేటీఆర్ సీఎం కాబోతున్నాడనేది విస్తృత ప్రచారం చేయించాడు. కానీ ఈటల రాజేందర్, హరీశ్‌రావులు వ్యవహారం అడ్డంకిగా మారింది. దీంతో ఎప్పటికామాటలాడు.. అన్నట్టు అప్పటి పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ దీన్ని వాయిదా వేసేశాడు. సమయం కోసం చూశాడు. ఈటలను బయటకు సాగనంపాడు.
ఇప్పటికీ ఈటల రాజేందర్‌ను కేసీఆర్ వెంటాడుతూనే ఉన్నాడు. మామూలుగా కాదు. ఎవరైనా తనతో పెట్టుకుంటే పుట్టగతులుండవు.. అనే రేంజీలో. ఇక అసమ్మతి సెగనే కాదు.. దాని పొగ కూడా ఇప్పట్లో టీఆరెస్‌కు తాకదు. ఆ విధంగా కేటీఆర్‌కు మంచి కోటరీ ఏర్పాటు చేసి పెట్టాడు. అన్నీ చక్కదిద్ది .. సీఎం పదవిని కానుకగా ఇవ్వబోతున్నాడు. ముహూర్తం కోసం చూస్తున్నాడు. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవం పూర్తికావడమే తరువాయిగా కనిపిస్తున్నది. తెరవెనుక చకచక అన్నీ జరిగిపోతున్నాయి.