రాజకీయ సమీకరణాలు వడివడిగా మారుతున్నాయి. ప్రతిపక్షం బలం పుంజుకుంటున్నది. కేటీఆర్‌ను ఈ టర్మ్‌లోనే సీఎం చేయాలనేది కేసీఆర్ ఆలోచన. ఇది వరకే ఇటువైపు అడుగులు పడ్డాయి. కానీ అప్పటి రాజకీయ సమీకరణాలు కలిసి రాలేదు. దీంతో ఇదంతా వట్టిదేనని కేసీఆర్ కొట్టేశాడు. ఎవరూ ఇక దీనిపై మాట్లాడొద్దని హుకుం జారీ చేశాడు. నేనే సీఎంగా ఉంటానని క్లారిటీ ఇచ్చాడు. కానీ ఆయన మనసులోని ఆలోచనలు ఎవరికీ తెలియవు. ఎవరికీ అంతుచిక్కవు. కేటీఆర్‌ను సీఎం చేయడానికి ఇదే అనువైన సమయంగా కేసీఆర్ భావిస్తున్నాడు.
మొన్నటి వరకు హుజురాబాద్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏదైనా అనుకున్నారంతా. కానీ అవి మరింత జాప్యం జరిగేలా ఉన్నాయి. ఆలోపే ఈ తతంగమంతా పూర్తి చేయాలని కేసీఆర్ భావిస్తున్నాడనే సంకేతాలందుతున్నాయి. పూర్తిగా పార్టీ కేసీఆర్ కంట్రోల్‌లో ఉంది. ఎమ్మెల్యేలంతా సెట్‌రైట్ అయ్యారు. కేసీఆర్ నిర్ణయం తీసుకోవడమే తరువాయి….అన్ని చకాచకా జరిగిపోతాయి. ఇప్పుడు కాకపోతే ఇక ముందు కేటీఆర్‌ను సీఎం చేసేందుకు అనువైన సమయం ఉండదనే భావనలో కేసీఆర్ ఉన్నాడు.
ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీఆరెస్‌కు ప్రతికూల ఫలితాలొచ్చినా.. కేటీఆర్‌ను సీఎం చేశాననే సంతృప్తి కేసీఆర్‌కు ఉంటుంది. కేటీఆర్ కూ ఓ బ్రాండ్ ఇమేజ్ రావాలంటే తనదైన మార్కు పాలనను ప్రజలు చూడాలి. చూడాలంటే ఇప్పుడే ఆయన సీఎం కావాలి. ఆ తర్వాత కేటీఆర్ పట్ల వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉంటుందో తెలిసిపోతుంది. మళ్లీ కేటీఆర్ కావాలనుకుంటే .. ప్రజలు కేటీఆర్‌కు జై కొడతారు. లేదంటే మాజీ సీఎం హోదాలో కేటీఆర్ ప్రజాక్షేత్రంలో పోరాడుతాడు. పార్టీని కాపాడుకుంటాడు. కొట్లాడి గెలిచేందుకు అన్ని విధాల సమాయత్తమవుతాడు. మున్ముందు కేసీఆర్ ఇవన్నీ చేయలేడు. అందుకే ఇక కేటీఆర్ ఇవన్నీ భుజస్కంధాలపై వేసుకోవాల్సి వస్తుంది.
ఒకవేళ కేటీఆర్‌ను ఇప్పట్లో సీఎంగా చేయాలని లేకపోతే.. మంత్రి వర్గ విస్తరణ చేసేస్తారు. లేదంటే కేటీఆర్‌ను సీఎం చేశాకే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అక్టోబర్, నవంబర్ నెలలో యాదాద్రి నిర్మాణం పూర్తవుతుంది. ఈ ఉత్సవానికి మోదీని ఆహ్వానించాడు కేసీఆర్. అది తను సీఎంగా ఉన్నప్పుడే చేయాల్సిన అద్భుత ఘట్టంగా కేసీఆర్ భావిస్తున్నాడు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాతే కేటీఆర్‌కు పట్టాభిషేకం ఆలోచనకు కార్యరూపం ఇవ్వనున్నాడు కేసీఆర్. కేటీఆర్ కూడా దీని కోసమే ఎదురుచూస్తున్నాడు. హరీశ్ బాధ కూడా లేదు. హరీశ్ ఇప్పుడు కేసీఆర్ చెప్పినట్టే వింటున్నాడు. ఇక ఇబ్బందులేమీ లేవు. సమయం కోసమే ఎదరుచూపులు. అవి కూడా ఇంకా ఎక్కువ రోజలు లేనట్టున్నాయి.
