బీజేపీకి మూడో స్థానం ఖాయమైందా?

@@@

మునుగోడులో నిన్న సాయంత్రం వరకు నెలకొన్న పరిస్థితులను విశ్లేషించినపుడు టీఆరెస్, కాంగ్రెస్ పార్టీలతో పోల్చినపుడు బీజేపీ పూర్తిగా వెనుకబడిపోయింది. టీఆరెస్ పార్టీకి అనేక పాజిటివ్ అంశాలు కనిపిస్తున్నాయి. అరవై ఏళ్ళనుంచి జిల్లాను పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను కేసీఆర్ పరిష్కరించారని, ఇప్పుడు దాదాపు అన్ని ఇళ్లకు పరిశుద్ధమైన త్రాగునీరు లభిస్తున్నదని, బాధితుల సంఖ్య చాలావరకు తగ్గిపోయిందనేది ఓటర్ల అభిప్రాయం. పైగా అసెంబ్లీ ఎన్నికలు ఏడాదిలోగా వస్తుండగా ఈలోగా ప్రతిపక్ష పార్టీని గెలిపించి అభివృద్ధిని దూరం చేసుకునే ఆలోచన ఎవ్వరికీ లేదు. గులాబీ పార్టీ ప్రచారం చేస్తున్న సంక్షేమ పధకాలు అన్నీ వాస్తవమే, ప్రజలు అనుభవిస్తున్నవే కాబట్టి వాటిలో రంధ్రాన్వేషణ చెయ్యడానికి ప్రతిపక్షాలకు అవకాశం లభించడం లేదు. గ్రామాల్లో కూడా మంత్రి స్థాయి నాయకులు ప్రచారాన్ని చేస్తుండటం ప్రజలను ఆకర్షిస్తున్నది. ఇక్కడ టీఆరెస్ గెలుపు అనేది నల్లేరు మీద బండి నడకే. యాభై శాతం ఓట్లతో కారు జోరు తధ్యం.

కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా మూడో స్థానం అనుకున్నప్పటికీ క్రమక్రమంగా పుంజుకుంటున్నది. ఇక్కడ నిలబడిన పాల్వాయి స్రవంతి కుటుంబ నేపధ్యం, మహిళ అన్న సానుభూతి పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నప్పటికీ ఓటర్లు ” ఆశిస్తున్న” కోరికలను తీర్చడంలో విఫలం అవుతున్నారు ఆమె. నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్నారట. ఎలాగూ ఓడిపోయేది కాబట్టి ఇప్పుడు జేబులోంచి డబ్బులు తియ్యడానికి ఏ నాయకుడూ సిద్ధంగా లేడు. వెంకటరెడ్డి ప్రచారానికి దూరంగా ఉండటం, అధిష్టానం నిధులతో సహకరించకపోవడం కూడా కొన్ని కారణాలు.

ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూర్తిగా చతికిలపడ్డారు. ఆ ముప్ఫయివేల కోటీశ్వరుడు సహనం కోల్పోయి బూతులు లంకించుకుంటున్నారంటే ఇక ఆయన విజయావకాశాలు ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. ఆయన నమ్మినట్లు అయన అనుచరులు ఎవ్వరూ బీజేపీలోకి వెళ్ళలేదు. బీజేపీకి బోలెడుమంది నాయకులు ఉన్నారు. కానీ మునుగోడులో కార్యకర్తలు, అభిమానులు ఎవ్వరూ లేరు. ప్రతి పనికి భత్యం ఇస్తేనే మనుషులు దొరుకుతున్నారు. ఒక్కోసారి లక్షల రూపాయల ఆశ చూపినా మనుషులు దొరకడం లేదు. పైగా పద్దెనిమిదివేలకోట్ల రూపాయలు కాంట్రాక్ట్ బీజేపీ ఇచ్చిందని, మూడేళ్లనుంచి బీజేపీలో టచ్ లో ఉన్నానంటూ రాజగోపాల్ రెడ్డి చెప్పిన ఒక వీడియో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. దాంతో రాజగోపాల్ రెడ్డి మీద ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది. గత నాలుగేళ్లలో ఆయన ఎన్నడూ నియోజకవర్గం ముఖం చూడలేదని ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డి ఓటమి ఖాయమైంది.

ఇక రాజగోపాల్ రెడ్డి ఎవరినైతే నమ్ముకున్నారో, ఆ కార్యకర్తలు, చోటా నాయకులు కేటీఆర్ భయంతో టీఆరెస్ గూటిలోకి చేరుతున్నారు. బీజేపీ నాయకులను ఈ విషయమే కంగారెత్తిస్తున్నది.

పై అంశాలను విశ్లేషించినపుడు కాంగ్రెస్, బీజేపీ రెండు, మూడో స్థానంలోకి వెళ్లడం తధ్యం అని విశ్లేషకుల భావన. గత ఎన్నికలో బీజేపీకి దక్కింది కేవలం పన్నెండు వేల ఓట్లు. డిపాజిట్ కూడా రాలేదు. ఇప్పుడు అంతకన్నా బీజేపీకి పెరిగిందేమీ లేదు. అక్కడ బీజేపీ ఎన్ని ఓట్లు పోల్ అయినా అవి కేవలం రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత అభిమాన ఓట్లు మాత్రమే.

 

ముర‌ళీమోహ‌న రావు ఇల‌పావులూరి

You missed